పూల సాగులో గులాబీ తర్వాతి స్థానం చామంతిదే. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పంట కూడా ఇదే! పండుగలు, పర్వదినాలతోపాటు సౌందర్య ఉత్పత్తుల్లోనూ ఎక్కువగా వాడే చామంతికి.. ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. అందుకే, రాష్ట్రంలో భారీగా సాగవుతున్నది.శీతాకాలంలో విరబూసే సువాసనల చామంతి.. అన్నదాత ఇంట సిరుల వర్షం కురిపిస్తున్నది.

తక్కువ పెట్టుబడి, అతి తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందాలనుకొనే రైతులకు ‘చామంతి’ ఎంతో అనుకూలం. మార్కెట్లో భారీ డిమాండ్ ఉండే ఈ పూలతో, ఏడాది పొడవునా నిలకడైన ఆదాయం పొందవచ్చు. అధిక సేంద్రియ పదార్థం గల అన్ని రకాల నేలల్లోనూ చామంతిని సాగు చేయవచ్చు. మురుగు నీటి వసతి గల ఒండ్రు నేలల్లో భారీ దిగుబడులు సాధించవచ్చు.
సాగు విధానం..
చామంతి సాగుకోసం భూమిని మూడునాలుగు సార్లు కలియ దున్నుకోవాలి. మొక్కలు నాటడానికి ముందే, ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 60-80 కిలోల నత్రజని, 30-40 కిలోల భాస్వరం, 60-80 కిలోల పొటాష్ వేసుకోవాలి. 30 సెం.మీ.X 20 సెం.మీ. ఎడంగా మొక్కలను నాటుకోవాలి. ఇలా ఎకరం పొలంలో 55వేల నుంచి 65వేల మొక్కలను నాటుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్న తల్లి మొక్క నుంచి పిలకలను సేకరించుకోవచ్చు. చామంతి మొక్కలకు డ్రిప్ ద్వారా నీరు అందించాలి. దీనివల్ల కలుపు బెడద తగ్గుతుంది. మొక్కలు ఒరిగిపోకుండా వెదురు కర్రను ఊతంగా అమర్చాలి. మొక్క దగ్గర మట్టిని రెండు మూడు సార్లు కదిలించడం వల్ల వేరు వ్యవస్థ దృఢంగా మారుతుంది.
మొక్కలు నాటిన మొదటి నెలలో వారానికి రెండు నుంచి మూడు నీటి తడులు ఇవ్వాలి. ఆ తర్వాత వారానికి ఒకసారి నీరు అందిస్తే సరిపోతుంది. అయితే, మొక్క దగ్గర నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. లేకుంటే వేరుకుళ్లు తెగులు వచ్చే ప్రమాదం ఉంటుంది. 20 రోజులకోసారి క్రిమిసంహారక మందులను పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. నాటిన మొదటి 30 రోజులు మొక్కలు బాగా ఏపుగా పెరిగేలా జాగ్రత్తలు పాటించాలి.
దిగుబడి పెంచేలా..
చామంతి సాగులో తలల కత్తిరింపు ముఖ్యమైన ప్రక్రియ. పొలంలో మొక్కలన్నీ 30 సెంటీమీటర్ల దాకా పెరిగిన తర్వాత, వాటి తలలను తుంచేయాలి. దీనివల్ల పక్కకొమ్మలు ఎక్కువగా వస్తాయి. ఫలితంగా పూల దిగుబడి పెరుగుతుంది. తలలు తుంచిన తర్వాత నత్రజని, పొటాష్ ఎరువులను అందించడం వల్ల, నాణ్యమైన పూలను పొందవచ్చు.
పువ్వుల పరిమాణం పెరగటానికి తలలు కత్తిరించిన 20 నుంచి 25 రోజులకు లీటర్ నీటిలో 50 పీపీఎం జిబ్బరెల్లిక్ ఆమ్లం (50 మిల్లీగ్రాములు) కలిపి పిచికారీ చేయాలి.
లియోసిన్ మందును పిచికారీ చేస్తే మొగ్గ సైజు పెరుగుతుంది. పండుగలు, పర్వదినాల్లో పంట చేతికి వస్తే అధిక లాభాలు పొందవచ్చు. దీనికోసం మొగ్గ దశకు ముందే లీటర్ నీటిలో 100 పీపీఎం నాఫ్తాలిక్ ఎసిటిక్ ఆమ్లం (100 మిల్లీగ్రాములు) కలిపి పిచికారీ చేయాలి. దీనివల్ల పూత ఆలస్యంగా వస్తుంది. 15 నుంచి 20 రోజుల ముందే పూల కోతను చేపట్టడానికి లీటర్ నీటిలో 100-150 పీపీఎం జిబ్బరెల్లిక్ ఆమ్లాన్ని పిచికారీ చేయాలి.
సస్యరక్షణ చర్యలు
చామంతి పంటను పలురకాల తెగుళ్లు, పురుగులు ఆశించే ప్రమాదం ఉంటుంది. వీటివల్ల మొక్కలు చనిపోవడం, దిగుబడి తగ్గడంలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా పూలు పూసే సమయంలో పూలను తొలిచే పురుగులు కనిపిస్తాయి. వీటిని వెంటనే నివారించకపోతే దిగుబడితోపాటు పూల నాణ్యతా దెబ్బతింటుంది. సరైన సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా తెగుళ్లు, పురుగుల నుంచి పంటను కాపాడుకోవచ్చు.
ఆకుమచ్చ తెగులు
ఆకులమీద వలయాకారంలో గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. సెర్కోస్పొరా ఆకుమచ్చ వల్ల ఆకుల మీద ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి, చుట్టూ ఎరుపు వర్ణంతో మధ్యభాగం తెల్లగా ఉంటుంది. ఈ తెగులు నివారణకు లీటర్ నీటిలో 2.5 గ్రా.మంకోజెబ్ లేదా 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి 15రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
వేరుకుళ్లు తెగులు
భూమిలో తేమ అధికంగా ఉన్నట్లయితే వేరుకుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల లేత మొక్కలు అర్ధంతరంగా ఎండిపోతాయి. ఈ తెగులు నివారణ కోసం లీటర్ నీటిలో 3గ్రా.కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1గ్రా. కార్బెండజిమ్ కలిపి, తెగులు సోకిన మొక్కల పాదుల చుట్టూ నేలపై పోయాలి.
తుప్పు తెగులు
చలికాలంలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. ఆకులపై తుప్పు రంగులో చిన్న మచ్చలు ఏర్పడి, తర్వాత పై ఆకులకు, పువ్వులో పచ్చని భాగాలకు వ్యాపిస్తుంది. తద్వారా మొక్కలు ఎండిపోయే అవకాశం ఉంటుంది. ఈ తెగులు నివారణకు లీటర్ నీటిలో 2గ్రా. మాకోజెబ్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
పచ్చ పురుగు
పచ్చ గొంగళి పురుగులు ఆకులను తినడంతోపాటు పూలనూ పాడుచేస్తాయి. వీటి నివారణ కోసం ఎకరానికి మలాథియాన్ 5 శాతం పొడి 8 కిలోలు లేదా క్వినాల్ఫాస్ పొడి 8 కిలోలు చల్లుకోవాలి. లేదా లీటర్ నీటిలో 2 మి.లీ. ఎండోసల్ఫాన్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
తామర పురుగులు
ఇవి గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడతలు పడి ఎండిపోతాయి. పూలు కూడా వాడిపోతాయి. ఈ పురుగుల నివారణకు లీటర్ నీటిలో 1.5 మి.లీ. డైమిథోయేట్ లేదా 3 గ్రా. కార్బరిల్ 50 శాతం పొడిని కలిపి పిచికారీ చేయాలి.
మొక్కలు ఎదుగుతున్న సమయంలో పేను, దోమ, నలుపు, పసుపు తెగుళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని నివారించేందుకు కషాయాలను ఆశ్రయించవచ్చు. లేదా మోనోజెబ్ (ఎమ్ 45), క్యాబ్రియోటాప్, అక్రోబట్ వంటి క్రిమిసంహారక మందులనూ పిచికారీ చేయవచ్చు. మొగ్గ దశలో పచ్చపురుగు, నల్లపురుగు ఎక్కువగా ఆశిస్తుంది. బెంజర్, సైఫర్ మెత్రిన్ వంటి మందులను పిచికారి చేయడం ద్వారా వీటిని నివారించవచ్చు.
చామంతి రకాలు
ప్రస్తుతం సాగులో ఉన్న చామంతి పూలను
నక్షత్ర చామంతి (చిన్నపూలు), పట్నం చామంతి
(మధ్యస్థ పూలు), పెద్ద పూలుగా విభజించారు.
రంగులను బట్టి కూడా మూడు రకాలు (పసుపు,
ఎరుపు, తెలుపు) ఉన్నాయి.
పసుపు : బసంతి, కో-1, ఎల్లో గోల్డ్,
రాయచూర్, సిల్వర్.
ఎరుపు : రెడ్ గోల్డ్, కో-2.
తెలుపు : రత్లామ్ సెలెక్షన్, బగ్గి, ఐ.ఐ.హెచ్.ఆర్-6.
దిగుబడి
మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నుల వరకూ పూల దిగుబడిని పొందవచ్చు. ఒక్కొక్క మొక్క నుంచి 75 నుంచి 120 పూలను పొందవచ్చు. ఒక పంటకాలంలో దాదాపు 10 నుంచి 15 సార్లు పూలను కోయవచ్చు.
– మజ్జిగపు శ్రీనివాస్ రెడ్డి