బజార్హత్నూర్, మే17: రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల సభ్యులకు అందిస్తున్న స్రీనిధి రుణాలు.. మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి. వీటిని పొందిన మహిళలు స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. వచ్చిన రుణాలను సద్వినియోగం చేసుకొని వ్యాపారాలు ప్రారంభించి, ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. బజార్హత్నూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఐకేపీ అధికారుల సలహాలు, సూచనలతో పలువురు మహిళలు స్రీనిధి రుణాలు పొంది సొంతగా వ్యాపారాలు ప్రారంభించారు. టైలరింగ్, కిరాణా దుకాణాలు, చిన్న చిన్న యంత్రాల ద్వారా పరికరాల తయారీతో వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
ఉపాధి కోసం వ్యాపారాలు
కొత్తగూడ గ్రామానికి చెందిన సరస్వతీ స్త్రీనిధి ద్వారా రూ. లక్ష రుణంగా తీసుకున్నది. ఈ డబ్బులతో గ్రామంలో పిండిగిర్నిని ఏర్పాటు చేసుకొని నిత్యం వచ్చే డబ్బులతో కుటుంబ పోషణను కొనసాగిస్తున్నది. ఇంటి వద్దే ఉంటూ పిండిగిర్నీని నడుపుతున్నది. దీంతో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఆదాయం వస్తున్నట్లు చెబుతున్నది. జాతర్ల గ్రామంలో అందె మంజుల కిరాణా దుకాణం, భగత్ గంగామాత టైలరింగ్, రేణుక కిరాణం నడుపుతున్నారు. ఇలా స్త్రీనిధి రుణాలతో తమకు తెలిసిన రంగాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా పరిపుష్ఠి సాధిస్తున్నారు.
నెలకు రూ.10 వేల వరకు సంపాదిస్తున్న..
నేను రూ.లక్ష స్త్రీ నిధి రుణం తీసుకున్న. వీటితో గ్రామంలో పిండి గిర్నిని ఏర్పాటు చేసుకున్న. వచ్చిన డబ్బులతో కుటుంబ పోషణకు ఉపయోగపడుతున్నయ్. నెలకు 10వేల వరకు సంపాదిస్తున్న.ప్రస్తుతం పెరిగిన ధరలతో ఇంట్లో అందరూ పని చేస్తనే కుటుంబం గడుస్తది. లేకుంటే ఇబ్బందయితది.
-సరస్వతి, కొత్తగూడ
రుణాలు సద్వినియోగం చేసుకుంటున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలకు అందిస్తున్న స్రీనిధి రుణాలతో వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో మహిళలు కిరాణాషాపులు, బట్టల దుకాణాలు, టైలరింగ్, పిండి గిర్ని వంటి వ్యాపారాలు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు సమావేశాలు నిర్వహించి తగిన సలహాలు,సూచనలు అందజేస్తున్నాం. వారు ఆర్థికంగా పరిపుష్ఠి సాధించి, కుటుంబాలకు అండగా ఉండేలా చూస్తున్నాం.
–గణేశ్, ఐకేపీ ఏపీఎం
టైలరింగ్‌లో నలుగురికి శిక్షణ ఇస్తున్న..
ప్రభుత్వం మహిళలకు డ్వాక్రా గ్రూపుల ద్వారా అందజేస్తున్న రుణాన్ని తీసుకున్న. రూ. లక్ష రుణం తీసుకొని ఇంటి ముందే టైలరింగ్ షాపు పెట్టుకున్న. టైలరింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్న. దీంతో పాటు నలుగురికి టైలరింగ్‌లో శిక్షణ అందిస్తున్న. అంటే మరికొందరికి ఉపాధినిచ్చే అవకాశం కలిగింది. స్త్రీ నిధి రుణాలతోనే ఇది సాధ్యమైంది.
–భగత్ గంగామాత