నిర్మల్ టౌన్, డిసెంబర్ 29 : అగ్రరాజ్యం అమెరికాలో కురుస్తున్న మంచు తుఫాన్ ధాటికి అక్కడ ఉన్న తమ పిల్లలతో పాటు ఇక్కడ ఉన్న వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అమెరికాలోని న్యూయార్క్, మిషిగాన్, మెన్నెసోటా, మాంటెన్నా, ఐయోవా, బండియానా,విస్కిన్సన్, నార్త్ డకోటా, సౌత్‌డకోటా, జియోవా, తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 మంది విద్యార్థుల వరకు మంచు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్నట్లు ఇక్కడి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన నిర్మల్, ఆదిలాబాద్, బోథ్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జన్నారం, ఖానాపూర్, భైంసా, ఉట్నూర్, తదితర ప్రాంతాలకు చెందినవిద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వైద్యులు, వివిధ రంగాల్లో స్థిరపడ్డ ఉద్యోగుల ఆరోగ్య స్థితిగతులపై కుటుంబ సభ్యులు ప్రతి రోజూ ఫోన్లు, వీడియో కాల్ ద్వారా అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. మూడు రోజుల నుంచి మంచు తుఫాన్ వర్షంలా కురవడంతో అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందని బయటకు వెళ్లలేక ఇంట్లోనే ఉంటున్నామని, ఇప్పటికైతే ఆరోగ్యంగా ఉన్నామని అక్కడి పిల్లలు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తూ ఎప్పటికప్పుడు ఫోటోలు పంపుతున్నారు. ఇక్కడ ఉన్న వారి తల్లిదండ్రులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మాది నిర్మల్ పట్టణం నాయిడివాడ. మా కుమారుడు పులి రవితేజ రెండు నెలల క్రితమే అమెరికాలోని మిచ్చిగన్ యూనివర్సిటీలోని ఎంఎస్ చదువుకునేందుకు వెళ్లాడు. అక్కడ రెండు రోజుల నుంచి మంచు తుఫాను ఉండడంతో మా బాబు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నట్లు మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాడు. ఇప్పటికైతే పిల్లలు క్షేమంగా ఉండడం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది.
-పులి శోభ, నాయిడివాడ, నిర్మల్
మాది నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం. మేము అక్కడే చదివి స్థానికంగా ఉన్న సీవీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా భార్యభర్తలిద్దరం కలిసి పని చేస్తున్నాం. మూడు రోజుల నుంచి మేము ఉండే ప్రదేశాల్లో మంచు తుఫాను బాగా కురుస్తోంది. బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. ఇంట్లోనే ఉండి రక్షణగా ఉన్ని దుస్తులు ధరించుకొని విధులు నిర్వహిస్తున్నాం. బయటకు వెళ్లాలంటే ఎక్కడ చూసినా రోడ్లపై మంచు తుఫాను కురవడం వల్ల ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కంపెనీ నిర్వాహకులు కూడా మాకు పూర్తిగా సహకరిస్తూ ఎప్పటికప్పుడు ఆరోగ్య సూత్రాలు అందిస్తూ ఉద్యోగంలో కొంత వెసులుబాటు కల్పిస్తున్నారు.
-ప్రణయ్శ్వేత, అమెరికా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు
మా పిల్లలు ఇద్దరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. మూడేళ్ల నుంచి అక్కడే పని చేస్తున్నారు. రెండు రోజుల నుంచి అమెరికాలో విపరీతమైన మంచు తుఫాను కురుస్తున్నట్లు మాకు పిల్లల నుంచి ఫోన్ వచ్చింది. మా ఇద్దరు పిల్లలుండే చోట ఆ ప్రభావం చాలాగానే ఉందని చెప్పడంతో మేము మొదట ఆందోళన చెందాం. ఇంట్లో నుంచి బయటకు వెళ్లవద్దని రక్షణ దుస్తులు వేసుకోవాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పిల్లలకు సూచిస్తున్నాం.
-కళావతి