దండేపల్లి/చెన్నూర్ టౌన్, జూన్ 28 : ముస్లింల పండుగల్లోని బక్రీద్ త్యాగానికి ప్రతీక. ఈ పండుగను ఈదుల్ అజహా, ఈదుజ్జహాతో పాటు బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్‌హేజ్ 10న బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు.
హజ్ యాత్ర ..
ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాల్లో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయాల్సి ఉంటుంది. ఈ నెల ప్రారంభంలోనే ముస్లింలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరుతారు. హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి చేరుకొని మస్జీద్ ఉల్ హరామ్లో ఉన్న కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి మసీదులో ప్రార్థనలు చేస్తారు. ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు ఉండి నమాజ్ (ప్రార్థనలు) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు. హజ్ తీర్థయాత్రకు వెళ్లినవారు మక్కా నుంచి మదీనా (మహ్మద్ ప్రవక్త గోరీ ఉన్న నగరం)ను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇచ్చేందుకు సిద్ధమవుతారు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ ఈదుల్ అజహా పండుగను జరుపుకుంటారు.
త్యాగానికి ప్రతీక..
రంజాన్ లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా (ధార్మిక ప్రసంగం)తో ఈద్గాలో సామూహిక ప్రార్థనలు చేస్తారు. అనంతరం వారు నెమరువేసే జంతువులను (ఒంటె, మేక, గొర్రె, ఎద్దు) మాత్రమే ఖుర్బానీ (బలి) ఇస్తారు. బలి ఇచ్చిన తర్వాత దాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకో భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. ముస్లింలు త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకుంటారు.