ఎదులాపురం, ఆగస్టు 22 : హెచ్ఐవీ, ఎయిడ్స్ నిర్మూలనకు విసృ్తత అవగాహన కల్పించడంతోపాటు ముందస్తు పరీక్షలు, సకాలంలో చికిత్స అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ‘ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్-2026’లో భాగంగా శనివారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద నిర్వహించిన బైక్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా జాతీయ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థల క్యూఆర్ కోడ్ అవగాహన పోస్టర్‌ను ఆవిషరించి, ఎయిడ్స్ నివారణపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రారంభమైన బైక్ ర్యాలీ కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్ మీదుగా సాగి తిరిగి స్టేడియానికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలకు హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణ, పరీక్షలు, చికిత్సపై అవగాహన కల్పించారు. ఈ నెల12 నుంచి అక్టోబర్ 12 వరకు రెండు నెలల పాటు జిల్లావ్యాప్తంగా ‘ఎయిడ్స్ సురక్ష మాస్ క్యాంపెయిన్’ ద్వారా విసృ్తత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
హెచ్ఐవీ స్రీనింగ్ను రిమ్స్, ఉట్నూర్, బోథ్ దవాఖానలకే పరిమితం చేయకుండా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణులు, క్షయ అనుమానిత లక్షణాలు ఉన్నవారికి తప్పనిసరిగా హెచ్ఐవీ పరీక్షలు చేయాలని స్పష్టం చేశారు. పరీక్షల్లో హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచాలని, ఏఆర్టీ కేంద్రాల ద్వారా ఉచిత చికిత్సను తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఆదిలాబాద్ ప్రస్తుతం 14వ స్థానంలో ఉందని, రాబోయే రెండు నెలల కార్యాచరణతో జిల్లాను పూర్తి ‘సురక్షిత స్థానం’లోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పాఠశాలలు, యువతలో అవగాహన పెంచడంతోపాటు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని హాట్ స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక స్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు 1097 హెల్ప్ లైన్, క్యూఆర్ కోడ్ సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన, డీవైఎస్వో దయానంద్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నాగరాజు, ఐసీటీసీ కౌన్సెలర్లు, పీహెచ్‌సీల వైద్యులు, వైద్య సిబ్బంది, యువత, తదితరులు పాల్గొన్నారు.