నేరడిగొండ, మే 21 : నేలకు ఖనిజ లవణాలు, పోషకాల మిశ్రమ సమ్మేళనం మొక్కలు, ఫైర్ల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో హైబ్రిడ్ వంగడాలు, రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో నేలలో సారం తగ్గిపోవడం, పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో భూసార సంరక్షణ ఎంతో అవసరం. అందుకు భూసార పరీక్షలు కీలకమని నేరడిగొండ మండల వ్యవసాయాధికారి భాస్కర్ సూచించారు. రైతులు నేలలో పోషకాలు ఏ మేర ఉన్నాయో తెలుసుకునేందుకు రెండేళ్ల కోసారి భూసార పరీక్షలు చేయించుకోవడం మేలు. తద్వారా అందే నివేదికల ఆధారంగా ఏ మోతాదులో ఏ మందులు, ఎరువులు వేయాలో తెలుస్తోంది. చౌడుగుణం, సున్నం శాతం, కాలుష్యాన్ని గుర్తించవచ్చు.
నేల తీరును బట్టి నమూనాలు సేకరించాలి. ఎత్తు పల్లాలున్న భూమిలో విస్తీర్ణంతో సంబంధం లేకుండా అన్ని చోట్ల నుంచి వేర్వేరుగా నమూనాలు తీసుకోవాలి. పొలంలో ఆంగ్ల అక్షరం ‘వి’ ఆకారంలో 15 సెంటీమీటర్ల లోతు గుంత తీయాలి. పై పొర నుంచి కింది పొర వరకు ఒక పక్కగా ఉన్న మట్టిని సేకరించాలి. ఎకరం విస్తీర్ణంలో ఎనిమిది చోట్ల నుంచి మట్టిని తీసి ఓ చోట కుప్ప పోయాలి. దానిని నాలుగు భాగాలు చేయాలి. ఓ భాగాన్ని తీసుకొని అరకిలో వచ్చే వరకు ఇలా నాలుగు భాగాల పద్ధతి అనుసరించాలి. మట్టిని కలిపేందుకు రసాయన ఎరువుల సంచులను వినియోగించవద్దు. పాలిథిన్ కవర్ను ఉపయోగించాలి. పొలంలో నేలవాలు, మట్టి రంగులో తేడాలేనప్పుడు ఐదు ఎకరాలకు ఒక చోట నమూనా తీస్తే సరిపోతుంది.
సేకరించిన మట్టిని గాలికి ఆరబెట్టాలి. తర్వాత కేంద్రానికి తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ కవర్లు, గుడ్డ సంచులను వినియోగించాలి. వాటిపై రైతు పేరు, ఊరు, మండలం, సర్వే నంబర్, ఇంతకు ముందు వేసిన పంట, వాడిన ఎరువులు, ఇకముందు సాగుచేసే పంట వివరాలు రాయాలి. ఆ తర్వాతే సమీపంలోని భూసార పరీక్ష కేంద్రాలకు పంపించాలి.
మట్టి నమూనా సేకరించేటప్పుడు నేలపై ఉన్న ఆకులు, చెత్తాచెదారం తొలగించాలి. మట్టి రాళ్లు, పంట వేర్లు లేకుండా చూడాలి. నీరు నిలిచి, బురద ఉన్నచోట నమూనా తీయవద్దు. ఒకవేళ తీయాల్సి వస్తే మట్టిని నీడలో ఆరబెట్టిన తర్వాత పరీక్షకు పంపాలి. పొలంలో అక్కడికక్కడ చౌడుగా ఉన్నట్లయితే అక్కడ 15 సెం.మీ, 30 సెం.మీల లోతులో విడిగా రెండు నమూనాలు సేకరించాలి. చెట్ల కింద, గట్ల పక్కన, ఎరువుల కుప్పల వద్ద, కాలిబాటలో నమూనాలు సేకరించవద్దు.