గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 26, 2020 , 00:12:25

జీవితం చాలా విలువైనది

జీవితం చాలా విలువైనది

ఆదిలాబాద్‌ రూరల్‌: జీవితం అనేది చాలా విలువైందని, దానిని లక్ష్యంవైపు నడిపించుకోవాలని కలెక్టర్‌ శ్రీ దేవసేన అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌టీయూ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన పదో తరగతి విద్యార్థుల ప్రేరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. జీవితంలో చదువనేది ఒక భాగమేనని, మార్కులే జీవితం కాదని అన్నారు. పదిలో మంచి మార్కులు సాధించడానికి విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. సబ్జెక్టులపై ఆసక్తిని పెంచుకుంటే సాధించలేనిది లేదన్నారు. మార్కు లే కొలమానం కాదని, వాటి గురించి ఎక్కువగా ఆలోచించొద్దన్నారు. చాలా మంది విద్యార్థులు మార్కులు తక్కువగా వస్తాయని, ఫెయిల్‌ అవుతామని భయంతో ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి చేరుకుంటున్నారన్నారు. సక్సెస్‌, ఫెయిల్యూర్‌లు శాశ్వతం కాదని గుర్తుచేశారు. పరీక్షలంటే భయం వీడి ప్రశాంతంగా రాయాలన్నారు. టైంటేబుల్‌ ప్రకారం చదివితే మంచి మర్కులు సాధించవచ్చన్నారు. చదువు ఒక్కటే సరిపోదని చదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలని సూచించారు. సమాజంలో నేడు స్వార్థం ఎక్కువైందని, దానిని పక్కన పెట్టి పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలన్నారు. మన మాతృభాషను మర్చిపోవద్దని సూచించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు డిసెంబర్‌ నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారు ఉత్తీర్ణులయ్యేలా సిద్ధం చేస్తున్నామన్నారు. గత ఏడాది 95 శాతం ఉత్తీర్ణత సాధించామని, ఈ ఏడాది 100 శాతం ఫలితాలు వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులకు సాయి వైకుంఠ ట్రస్ట్‌ తరఫున డాక్టర్‌ రవికిరణ్‌ యాదవ్‌ పెన్నులు, పరీక్ష ప్యాడ్‌లు, డిక్షనరీలను పంపిణీ చేయగా వాటిని కలెక్టర్‌, డీఈవో అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ మిల్కా, డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్‌ సుధాకర్‌, సమీ, ఏఎస్‌వో శ్రీహరి, డీఈవో సీసీ రాజేశ్వర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.logo