చూడగానే ‘సూపర్’ అనిపించే ఫ్యాషన్ కంటే, కండ్లు తిప్పగానే ‘క్రేజీ’ అనిపించే ట్రెండ్‌కే యూత్ ఓట్లు ఎక్కువ పోల్ అవుతాయి. ప్యాంటూ షర్టే కాదు, కండ్లజోడూ కట్టిపడేసేలా ఉండాలన్నది ఈ తరం ఫ్యాషనిస్టుల ఉవాచ.ఆ ధోరణికి తగ్గట్టు సన్ గ్లాసెస్ కూడా ఫన్ గ్లాసెస్‌గా వస్తున్నాయి. నెవర్ బిఫోర్ లుక్స్‌తో ‘వారెవ్వా!’ అనిపిస్తున్నాయి. మీరూ ఓ లుక్కేయండి!
కండ్లజోడంటే గుండ్రంగానో, మహా అయితే అటో ఇటో సాగదీసిన దీర్ఘవృత్తంలానో మాత్రమే ఎందుకు ఉండాలి? ఎగసిపడే మంటలా, నింగిలోని మేఘంలా, తుళ్లిపడే సీతాకోక చిలుకలా, కరిగిపోయే మనసులా… ఎందుకు ఉండకూడదు? ఓ సొగసరి ప్రేమికుడి మనసులో ఇలాంటి ఆలోచనే మెరిసింది. అంతే, మనసు దోచే రంగుల్లో.. ముచ్చటైన రూపాల్లో కండ్లజోళ్లు కొత్త కళలు సింగారించుకున్నాయి. ఫ్యాషన్‌ను ఇష్టపడే కలువ నేత్రాలకు ఈ చలువ నేస్తాలు తోడయ్యాయి. బటర్‌ఫ్లై ట్రెండీ సన్‌గ్లాసెస్, ఫైర్ ఫ్లేమ్ సన్ గ్లాసెస్లాంటి పేర్లతో కుర్రకారు మది దోచేలా మార్కెట్లో ప్రత్యక్షమయ్యాయి. చూసేందుకు బాగుండటమే కాదు.. పెట్టుకున్నా సౌకర్యవంతంగా ఉండేలా.. లైట్‌వెయిట్‌లో మంచి నాణ్యతతో ఈ కండ్లద్దాలు రూపొందుతున్నాయి. మంచి ఫినిషింగ్ కోసం లేజర్ కట్ టెక్నాలజీతో వీటిని డిజైన్ చేస్తున్నారు. అంతేకాదు, సాధారణ సన్‌గ్లాసెస్ తరహాలో అతినీలలోహిత కిరణాల నుంచీ కండ్లను రక్షిస్తాయి. ఇంకేం, మీ అవుట్ ఫిట్‌కు పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించే ట్రెండీ గ్లాసెస్ ఎంచుకోండి. మనసైన వారికి చూసీచూడంగానే నచ్చేసేలా కనిపించేయండి!