ఎర్రగడ్డలో ఉంటున్న చంద్రకాంత్, కవిత దంపతుల ప్రథమ సంతానం పూజ. తను యూసుఫ్ గూడలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నది. ఇటీవల జాతీయ స్థాయిలో రెండు బంగారు పతకాలు సాధించి రెజ్లింగ్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. బాల్యం నుంచీ పూజ తండ్రి వద్ద కుస్తీలో ఓనమాలు నేర్చుకుంది. చంద్రకాంత్ నిత్లేకర్ పూర్వికులది మహారాష్ట్ర. అతను నాంపల్లిలోని రతన్‌సింగ్ వస్తాద్ వ్యాయామశాలలో కోచ్. ఎనిమిదేండ్ల ప్రాయం నుంచే కూతుర్ని తనతోపాటు వ్యాయామశాలకు తీసుకెళ్లేవాడు.
ఆ చిన్నారి కూడా కుస్తీలో మంచి ప్రావీణ్యం కనబరిచింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ శిక్షణ శిబిరాలలో మరింత రాటుదేలింది. రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ విభాగంలో రెండు పసిడి పతకాలు కొల్లగొట్టింది. జాతీయస్థాయిలో రెండుసార్లు తెలంగాణకు ప్రాతినిధ్యం వహించింది. ఇటీవల పాట్నాలో జరిగిన జాతీయ ఓపెన్ నేషనల్స్‌లో కూడా పాల్గొన్నది. ఉత్తరాఖండ్ వేదికగా నిర్వహించిన జాతీయ సబ్ జూనియర్ గ్రాఫ్లింగ్ రెజ్లింగ్ పోటీలలో రెండు బంగారు పతకాలు గెలుచుకుని సత్తా చాటింది. తాజాగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘనంగా సన్మానించారు. ‘సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ నా లక్ష్యం. ఆ కలను తప్పక నిజం చేసుకుంటా’అంటున్నది పూజ.
…? కె.ఇ. ప్రతాప్