చైనాకు చెందిన వివో.. మరో ఫ్లాగ్షిప్ ఫోన్‌ను సిద్ధం చేసింది. వివో ఎక్స్ ఫోల్డ్-6 పేరుతో తీర్చిదిద్దిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నది. ఫోన్‌కు సంబంధించిన వివరాలను ఇటీవలే అధికారికంగా వెల్లడించింది. అన్ని కంపెనీల మాదిరిగా క్వాల్కామ్ చిప్‌లను వాడే సంప్రదాయ పద్ధతికి వివో పుల్‌స్టాప్ పెట్టేస్తున్నది. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం సరికొత్త కస్టమ్ సిలికాన్ చిప్‌తోపాటు భారీ హార్డ్‌వేర్ అప్గ్రేడ్లను ఎంచుకుంది. దీని ద్వారా వివో ఎక్స్ ఫోల్డ్-6ను పవర్ఫుల్ ఏఐ, ప్రొడక్టివిటీ డివైజ్‌గా నిలబెట్టాలని సంస్థ ప్లాన్ చేస్తున్నది.
ఇందుకోసం మీడియాటెక్ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా రూపొందించిన మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ఎడిషన్ చిప్‌సెట్‌ను ఈ ఫోన్లో పరిచయం చేస్తున్నది. ఈ చిప్సెట్ పెద్ద స్క్రీన్‌పై మల్టీటాస్కింగ్, స్లిట్-స్క్రీన్ లేఅవుట్, మల్టీ విండోస్ సజావుగా రన్ అవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుంది. గత జనరేషన్ ఫోన్లతో పోలిస్తే దీని న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ పనితీరు 111శాతం పెరిగిందని, అలాగే ఏఐ కోసం ఖర్చయ్యే పవర్ వినియోగం 56 శాతం తగ్గిందని వివో చెబుతున్నది. ఇందులో అల్ట్రా-థిన్ గ్లాస్‌తో కూడిన 8.02 అంగుళాల 2కె AMOLED మెయిన్ డిస్ప్లే ఉంటుంది.
బయటివైపు 6.51 అంగుళాల కవర్ డిస్ప్లేతో వస్తున్నది. అన్నిటికన్నా ముఖ్యంగా, కెమెరాల క్వాలిటీ విషయంలో వివో ఎక్కడా రాజీ పడలేదు. వెనుక భాగంలో ప్రీమియం ఫ్లాగ్షిప్ కెమెరా సెటప్‌ను ఏర్పాటు చేసింది. జీస్ ఆప్టిక్స్ ట్యూనింగ్‌తో కూడిన 200ఎంపీ మెయిన్ సెన్సర్‌తోపాటు హైరెజల్యూషన్ ల్యాండ్‌స్కేప్ షాట్స్ కోసం 50ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, షార్ప్ ఆప్టికల్ జూమ్ సామర్థ్యం కలిగిన 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్‌తో కెమెరా సెటప్‌ను తీర్చిదిద్దింది. 20ఎంపీ సామర్థ్యం ఉన్న రెండు ఫ్రంట్ కెమెరాలను ఏర్పాటు చేసింది.
ఇక వివో ఎక్స్ ఫోల్డ్-6కి సంబంధించిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం.. దీని బ్యాటరీ కెపాసిటీ. ఇందులో నెక్ట్స్ జనరేషన్ సిలికాన్-కార్బన్ యానోడ్ టెక్నాలజీతో కూడిన 6,900 ఎంఏహెచ్ – 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండబోతున్నది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోల్డబుల్ ఫోన్లలోని బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్ – 5,500 ఎంఏహెచ్ మాత్రమే! కానీ, వివో వాటికంటే చాలా సమర్థమైన బ్యాటరీని ఏర్పాటు చేస్తున్నది. ఇది కనీసం 80W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్తోపాటు వైర్లెస్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. మరిన్ని అత్యాధునిక, సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్ ఫోన్.. త్వరలోనే మార్కెట్లోకి రానున్నది.