ఆరున్నర అడుగుల ఎత్తు. దానికి తోడు కండలు. చురకత్తుల్లాంటి చూపులు. మెగాప్రిన్స్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తనకంటూ ఓ మార్క్ సృష్టించుకున్నాడు వరుణ్‌తేజ్. ‘ముకుంద’గా తెలుగు ప్రేక్షకుల మనసుల్ని ‘ఫిదా’ చేశాడు. అంచెలంచెలుగా వారసత్వ ‘కంచె’ దాటుకొని కోబ్రోగా ఫన్ అందించాడు. ‘గద్దలకొండ గణేష్’గా మరో కోణం చూపించాడు. తాజాగా బాక్సర్‌గా మారేందుకు దేహాన్ని గాయాల ‘గని’గా మార్చుకున్నానని అంటున్నాడు వరుణ్‌తేజ్.
తెలుగు ప్రేక్షకులను ‘గని’ ఎలా అలరించబోతున్నాడు? మొదటిసారి బాక్సర్‌గా కనిపిస్తున్నారు.. ఆ అనుభవం ఎలా ఉంది?
తెలుగు ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చే సినిమా ‘గని’. ఇందులో అన్ని రకాల భావోద్వేగాలున్నాయి. ఓ పవర్ఫుల్ పంచ్‌ల ప్యాక్. వ్యక్తిగతంగా ఇది నాకు చాలెంజింగ్ రోల్. బాక్సర్‌గా చేయడం చాలా కష్టం. దాని కోసం కఠోర శిక్షణ తీసుకున్నాను. ఫైనల్ అవుట్‌పుట్ చూశాక ఆ బాధలన్నీ మర్చిపోయా. ప్రేక్షకులూ ఆదరిస్తారన్న నమ్మకం ఏర్పడింది.
బాక్సర్ పాత్ర కోసం ఎలా సిద్ధమయ్యారు?
బాక్సింగ్ నాకు ఇష్టమైన క్రీడ. బాక్సర్ కథ అనగానే మొదట ఆసక్తి కలిగింది. కానీ, ఆ పాత్ర పోషించాలంటే కఠోర శిక్షణ అవసరం. ఒలింపియన్, ప్రొఫెషనల్ బాక్సర్ అయిన టోనీ జెఫ్రీన్ దగ్గర అమెరికాలో రెండు నెలలు శిక్షణ తీసుకున్నా. తర్వాత నీరజ్ గోయత్ దగ్గర ఎనిమిది నెలలు శిక్షణ తీసుకున్నా. ఈ ప్రక్రియలో నా ట్రైనర్ రాకేశ్ ఉడియార్ పక్కనే ఉన్నాడు. ప్రతీక్షణం జాగ్రత్తలు చెప్పాడు. సరైన ఆహారం అందించాడు. శిక్షణ సమయంలో నా దేహం గాయాల గనిగా మారింది. సినిమాలో ఆ ట్రైనింగ్ జర్నీని మీరూ చూడొచ్చు.
సినిమాలో మీ కో-స్టార్స్ నుంచి సహకారం ఎలా ఉంది?
దర్శకుడు కిరణ్ కొర్రపాటి స్టోరీ లైన్ చెప్పినప్పుడే కో-స్టార్స్ గురించి చెప్పారు. షూట్లో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, కన్నడస్టార్ ఉపేంద్ర, జగపతిబాబు గారు, నవీన్ చంద్ర, నదియా, తనికెళ్ల భరణి, స్పెషల్ సాంగ్ చేసిన తమన్నా వంటి స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఓ అదృష్టం. ప్రతి ఒక్కరి దగ్గర ఓ కొత్త విషయం నేర్చుకున్నా.
ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారు. ఎలాంటి నియమాలు పాటిస్తారు?
నేను మొదట్లో నాకు నచ్చినట్లే ఉండేవాడిని. సినిమాల్లోకి వచ్చాక క్రమశిక్షణతో ఫిట్నెస్ సూత్రాలు పాటిస్తున్నా. బరువు తగ్గింది లేదు, పెరిగిందీ లేదు. బరువుకు తగ్గట్లుగా నా ఫిట్నెస్ ట్రైనింగ్ ఉంటుంది. అదే సమయంలో శరీరానికి పోషకాలు అందించే సమతుల ఆహారం తీసుకుంటా. ధ్యానం, యోగా, జిమ్.. ఇలా నాలుగు గంటల శిక్షణ ఉంటుంది.
షూటింగ్ లేనప్పుడు ఏం చేస్తుంటారు?
షూటింగ్ లేకపోతే ఆన్లైన్ కంటెంట్‌లో మునిగిపోతాను. అది సినిమాలు కావొచ్చు, ఇతర విషయాలు కావొచ్చు. ఆన్లైన్లో నిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటా. అదికూడా బోర్ కొడితే.. గేమింగ్‌పై దృష్టిపెడతా. పుస్తకాలు చదువుతుంటా. మంచి పుస్తకం దొరికితే.. సమయమంతా దానితోనే గడిపేస్తా.
కోలీవుడ్, బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు?
ఆసక్తికరమైన స్క్రిప్టులు వస్తే వెళ్లడానికి నాకు అభ్యంతరం లేదు. ఇప్పటికే కొన్ని పాన్ ఇండియా స్క్రిప్టులు వచ్చాయి. అన్నీ కుదిరితే ఓ కళాకారుడిగా కోలీవుడ్, బాలీవుడ్‌లకు వెళ్లడానికి నేను సిద్ధమే. అందుకు సరైన వేదిక ఓటీటీ. అన్ని భాషల్లో, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే మాధ్యమం ఇది. ఓటీటీ కంటెంట్ చేయడానికీ వెనకాడను. అలాంటి అవకాశం వస్తే వదులుకోను. స్క్రిప్ట్ ఆసక్తికరంగా ఉండాలి.. అంతే (నవ్వుతూ..).
కొత్త ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు?
ప్రస్తుతం ‘గని’, ‘ఎఫ్-3’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు మూడు సినిమాల కోసం కథలు వింటున్నాను. రెండు కథల లైన్ నచ్చింది. వాటి గురించి ఇప్పుడేం మాట్లాడలేను. అయితే, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నా తర్వాతి సినిమా ఉంటుంది. అదొక యాక్షన్ థ్రిల్లర్. ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
చివరగా చదివిన పుస్తకం?
జేమ్స్ క్లియర్ రాసిన ‘అటామిక్ హ్యాబిట్స్’ ఈ మధ్యే చదివా. మనలో మంచి అలవాట్లు పెంపొందించుకోవడానికి, చెడు అలవాట్లను మనలో మనమే నిర్వీర్యం చేయడానికి సులభమైన మార్గాలు అందులో చాలానే ఉన్నాయి. నాకు నేనుగా కొన్ని మార్పులు చేసుకున్నాను.
ప్రాణం పెట్టేస్తా!
‘గని’ విడుదల తర్వాత నన్ను అంతా బాక్సర్ ైస్టెల్లోనే చూస్తారు. నేను కూడా పాత్ర కోసం అలాగే తయారవ్వాల్సి వచ్చింది. ఇదొక ‘ట్రేడ్‌మార్క్’ ైస్టెల్. పాత్ర డిమాండ్ చేస్తే ప్రాణం పెట్టడానికి వెనకాడను. ‘గని’లో నా వరకు నేను చాలా సౌకర్యవంతంగానే పాత్రలో జీవించా. సినిమా విడుదల తర్వాత మీరే చూస్తారుగా..!