కుటుంబానికి అండగా నిలవాలనే ఆలోచన.. ఓ స్టార్టప్ ఏర్పాటుకు కారణమైంది. పది మందికి ఉపాధి మార్గమైంది. ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో హ్యాండ్ మేడ్ గాజులను ఇతర రాష్ర్టాలకూ సరఫరా చేస్తున్నది ఆమె. అంతేకాదు, వీహబ్ నేర్పిన వ్యాపార మెలకువలతో లక్క గాజుల తయారీని కుటీర పరిశ్రమ స్థాయికి తీసుకెళ్లింది. అలా, సృజనలో తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్నది నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉజ్మా బేగం.
ఉజ్మా బేగం.. తెలివైనది. చురుకైనది. కష్టసుఖాలు తెలిసిన యువతి. డిగ్రీ వరకూ చదివింది. నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ తన సొంతూరు. పెండ్లి తర్వాత, తన అత్తింటికి అండగా నిలవాలనుకుంది. ఇద్దరు పిల్లల చదువులు, ఇంటి ఖర్చులకు సరిపడేంత ఆదాయం సమకూరితే చాలన్నట్టు మొదలు పెట్టింది. గాజుల తయారీలో అపార అనుభవం ఉన్న మామయ్య దగ్గర శిక్షణ తీసుకుంది. క్రమంగా ఆ కళపై పట్టు సాధించింది. నలుగురికీ నేర్పగల నైపుణ్యమూ అబ్బింది. అప్పటినుంచి ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇచ్చేది. ఆ వ్యాపకాన్ని కొనసాగిస్తూనే.. ఎనిమిదేళ్ల కిందట లక్క గాజుల తయారీ యూనిట్ ప్రారంభించింది. ఆధునిక ఫ్యాషన్లకు దీటుగా, అతివలను ఆకట్టుకునే డిజైన్లకు ప్రాణం పోసింది.
ఒకరిద్దరితో మొదలైన వ్యాపారం క్రమంగా పదిహేను మందికి జీతాలు ఇచ్చే స్థాయికి చేరింది. మరికొంతమంది పార్ట్‌టైమ్ సిబ్బందీ ఉన్నారు. తొలుత యూనిట్ నిర్వహణ సులభంగానే అనిపించినా.. ఆర్థిక సమస్యలు నిత్యం వెనక్కి లాగేవి. కొన్నిసార్లు ముడిసరుకు కొనుగోలుకు కటకట. కొన్నిసార్లు జీతాలకు ఇబ్బంది. ఏం చేయాలో తోచని పరిస్థితి. ఆ సంక్షోభ సమయంలో భర్త అండగా నిలిచారు. ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) సమకూర్చిన సొమ్ము దానికి తోడైంది. అలా కష్టాలు గట్టెక్కాయి. దీంతో ఉజ్మా బేగం నాణ్యత మీదే దృష్టిపెట్టింది.
సృజనతో ..
కస్టమర్లు కొత్తదనాన్ని కోరుకుంటారు. ట్రెండ్స్ ఫాలో అవుతారు. ఆ నాడిని మనం పట్టుకోవాలి. సృజనతో మెరుపులు మెరిపించాలి. అప్పుడే, మనసులు గెలుస్తాం. మనుగడ సాధిస్తాం. కొత్త డిజైన్లు సృష్టించడంలో ఉజ్మాకు తిరుగులేదు. దీంతో ఆర్డర్లు పెరిగాయి. ఉత్పత్తి అధికమైంది. ఆ లక్క గాజులకు మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాలతోపాటు, పొరుగు రాష్ర్టాల్లోనూ మంచి గిరాకీ ఉంది. తన దగ్గర నేరుగా కొనే కస్టమర్ల సంఖ్యే దాదాపు ఐదొందలు. ఇక రిటెయిలర్ల ద్వారా కొనేవారు లెక్కలేనంతమంది. నిజంగానే ఆ లక్క గాజులు ఏ అంతర్జాతీయ శ్రేణి కార్ఖానాలోనో తయారు చేసినట్టు ఉంటాయి.
వీహబ్‌తో దోస్తీ
‘నా ప్రయాణంలో వీహబ్ సహకారం మరువలేనిది’ అని చెబుతుంది ఉజ్మా. తొలి దశలో ఐకేపీ ఆర్థిక ప్రోత్సాహం అందిస్తే.. ఎదుగుతున్న దశలో వీ హబ్ నేనున్నానంటూ తోడైంది. ఆ అనుబంధమూ విచిత్రంగానే మొదలైంది. జిల్లా డ్వాక్రా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి వీ హబ్ సీఈవో దీప్తి రావుల వెళ్లారు. అక్కడే ఉజ్మా ఆమెను సంప్రదించింది. ఆమె చురుకుదనం, ఉత్సాహం దీప్తికి చాలా నచ్చాయి. వీహబ్‌కు ఆహ్వానించారు. ఉజ్మా ఉత్సాహంగా హైదరాబాద్ ప్రయాణమైంది.. వీహబ్ ఓ స్ఫూర్తికేంద్రంలా కనిపించింది ఆమెకు. ఓరియెంటేషన్ సెషన్లో పాల్గొనడం ద్వారా వ్యాపారానికి అవసరమైన నిర్మాణ వ్యవస్థ, మార్కెటింగ్, ఫైనాన్స్ తదితర అంశాలపై అవగాహన వచ్చింది. ఆ సూత్రాలను తన యూనిట్‌కు అన్వయిస్తూ క్రమంగా విస్తరణ చేపట్టింది ఉజ్మా.
ఆన్లైన్ శిక్షణ..
ఏపీ, తెలంగాణలోని ఔత్సాహిక మహిళలకు తరచూ శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది ఉజ్మా. వారాల తరబడి ఇతర ప్రాంతాలకు వెళ్లి రావడమనేది వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. వ్యాపారానికి కూడా ఇబ్బంది. దీంతో ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని భావిస్తున్నది. యూట్యూబ్ ఛానెల్ ప్రారంభానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవి కనుక అందుబాటులోకి వస్తే.. సాధారణ మహిళలు సైతం ఇంటి దగ్గరే కూర్చుని సొంతంగా గాజులను డిజైన్ చేసుకోవచ్చు. స్వయం ఉపాధిని పొందవచ్చు. ‘ఏ మహిళకైనా సంపాదనతో ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆత్మగౌరవమూ పెరుగుతుంది. తోటి స్త్రీల కోసం నేను చేస్తున్న ప్రయత్నమూ అలాంటిదే’ అంటుంది ఉజ్మా.
…? కడార్ల కిరణ్