ఇంట్లోని మూలమూలనూ ప్రతిరోజూ శుభ్రం చేస్తుంటారు. కానీ, కొన్ని వస్తువులు, ప్రదేశాలను మాత్రం అంతగా పట్టించుకోరు. దాంతో, ఆయాచోట్ల దుమ్ము, ధూళి చేరిపోతుంది. అలాగే వదిలేస్తే.. శ్వాసకోశ సమస్యలు, స్కిన్ అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఇంట్లోని కొన్ని వస్తువులు, ప్రదేశాలను నిర్ణీత వ్యవధిలో కచ్చితంగా శుభ్రం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
కనీసం వారానికి ఒక్కసారైనా గోడలను శుభ్రం చేయాలి. లేకుంటే వాటిపై దుమ్ము అధికంగా పేరుకుపోతుంది. దాంతో ఇంటి అందం దెబ్బతింటుంది. దీర్ఘకాలంపాటు శుభ్రం చేయకుండా ఉంటే.. అనారోగ్యాన్నీ కలిగిస్తాయి.
ఇక పండగకో పబ్బానికో మాత్రమే కిటికీలను క్లీన్‌గా ఉంచాలనే ఆలోచన వస్తుంది. అదిచాలా తప్పు. బయటి నుంచి వచ్చే దుమ్ము మొత్తం కిటికీలను పట్టుకొని ఉంటుంది. రాత్రిపూట గాలి వీచినప్పుడు.. ఆ దుమ్మంతా ఇంట్లోకి చేరిపోతుంది. ఇది పిల్లల్లో శ్వాసకోశ సమస్యలకు కారణం అవుతుంది. అలా కావొద్దంటే.. కిటికీలను నెలలో రెండుసార్లయినా శుభ్రం చేయడం మంచిది.
బాత్‌టబ్, షవర్లో నిలిచి ఉండే నీళ్లు.. హానికర క్రిములకు ఆలవాలంగా మారుతాయి. వీటిని శుభ్రం చేయకుండానే అలాగే వాడుతూ ఉంటే.. ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాబట్టి, కనీసం నెలకోసారైనా వీటిని మొత్తం శుభ్రం చేయాలి.
చాలామంది బెడ్షీట్లు, పిల్లో కవర్లను రెగ్యులర్‌గా శుభ్రం చేస్తున్నా.. పరుపులను మాత్రం పట్టించుకోరు. కానీ, పరుపులపై దుమ్ము-ధూళితోపాటు చుండ్రు, చర్మపు మృతకణాలు, రాలిన వెంట్రుకలు అధికంగా చేరుతాయి. చిన్న పిల్లలు ఉంటే, మూత్ర విసర్జన వల్ల దుర్వాసన వస్తుంది. అందుకే.. పరుపులను రెండు నెలలకు ఒకసారైనా శుభ్రం చేసుకోవాలి.
కొందరికి కార్పెట్‌ను వాడటం తెలుసుకానీ, శుభ్రం చేయడం మాత్రం తెలియదు. ఎప్పుడో ఓసారి అలా దులిపి.. ఇలా ఎండలో ఆరేస్తారంతే! ఇలా చేస్తే పైనపైన మాత్రమే శుభ్రం అవుతుంది. దుమ్ము ఎక్కువగా చేరిపోయి.. అనారోగ్యానికి ఆహ్వానం పలుకుతుంది. ముఖ్యంగా, ఇంట్లో చిన్నారులు ఉంటే కార్పెట్‌పై మరింత శ్రద్ధ పెట్టాలి. మూడు నెలలకు ఒకసారైనా వీటిని స్టీమింగ్ చేయాలి.