ప్రస్తుతం ప్రతి వంట గదిలోనూ ‘క్యాప్సికం’ కనిపిస్తున్నది. వంటకు రుచితోపాటు ఒంటికి ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తున్నది. కూర వండుకోవడానికి మాత్రమేకాదు.. సాలాడ్గా తినడానికీ క్యాప్సికం పనికొస్తుంది. అయితే, క్యాప్సికంలో ఆడ; మగ ఉంటాయట. వాటి అడుగు భాగంలో ఉండే ‘బంప్స్’ ఆధారంగా.. ఆ తేడాను గుర్తించవచ్చట. లింగ భేదం కాకపోయినప్పటికీ.. వంటల్లో రుచి కోసం ఈ తేడాలను గమనించడం చాలా ముఖ్యమని పాకశాస్త్ర నిపుణులు అంటున్నారు.
మగ క్యాప్సికం: అడుగు భాగంలో కేవలం మూడు బంప్స్ మాత్రమే ఉన్నట్లయితే.. దానిని ‘మగ క్యాప్సికం’గా పరిగణిస్తారు. సాధారణంగా ఈ రకమైన కాయలు పొడవుగా ఉంటాయి. గింజలు తక్కువగా కనిపిస్తాయి. రుచి విషయానికి వస్తే.. కొంచెం తక్కువ తీపితో ఉంటాయివి. వీటిని కూర వండుకోవడానికీ, ఉడికించి తినడానికీ చాలా బాగుంటాయి.
ఆడ క్యాప్సికం: అడుగు భాగంలో నాలుగు, అంతకంటే ఎక్కువ బంప్స్ ఉంటే.. అది ఆడ క్యాప్సికం అన్నమాట. మగ క్యాప్సికంతో పోలిస్తే.. వెడల్పుగా, పొట్టిగా ఉంటాయి. వీటిలో గింజలు అధికంగా ఉంటాయి. రుచికి తీపిగా అనిపిస్తాయి. కాబట్టి, వీటిని పచ్చిగా తినొచ్చు. సలాడ్లు, శాండ్విచ్లు, గార్నిషింగ్ కోసం చూస్తుంటే.. ఆడ క్యాప్సికం కొనడం మంచిది.