కౌమారం.. ఈ సమయంలోనే పిల్లల్లో శారీరక ఆరోగ్యం, మానసిక బలం రూపుదిద్దుకుంటాయి. ఇతర కీలకమైన జీవనశైలి అలవాట్లు కూడా ఇదే దశలో అలవడుతాయి. అయితే, నేటితరం టీనేజర్లు శారీరకంగా చురుకుగా ఉండటం లేదనేది కాదనలేని వాస్తవం. దీనికి ప్రధాన కారణం.. స్క్రీన్టైమ్ పెరగడం. ఆరుబయట కార్యకలాపాలు తగ్గడం. ఫలితంగా.. చాలామంది పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారు. లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే, పిల్లల్లో ఫిట్నెస్ను ప్రోత్సహించడం ద్వారా.. వారు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించేలా చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలకు ఇష్టం లేకుండా.. జిమ్‌కు వెళ్లి రకరకాల వ్యాయామాలు చేయాలని బలవంతం చేయడం సరికాదు. ఎందుకంటే, తమకు నచ్చని పనులంటే టీనేజర్లు ఏమాత్రం ఆసక్తి చూపించరు. కాబట్టి, వారి ఆసక్తిని బట్టి వ్యాయామ శైలిని ఎంచుకోనివ్వండి. జిమ్‌కు వెళ్లడం ఇష్టం లేకపోతే.. నచ్చిన ఆటలను ఆడుకోనివ్వండి. స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్, సైక్లింగ్.. ఇలా వారికి ఏది ఇష్టమో అడిగి తెలుసుకోండి. తమకు నచ్చిన పని అయితే వారు ఉత్సాహంగా చేస్తారు.
చిన్నచిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లాలి, ఎక్కువ దూరం పరిగెత్తాలి లాంటి పెద్ద లక్ష్యాలను నిర్దేశిస్తే.. టీనేజర్లలో ఆసక్తి తగ్గే అవకావం ఉంటుంది. బదులుగా.. రోజుకు 20 నిమిషాలు నడవడం, వారానికి రెండుసార్లు ఏదైనా క్రీడలో పాల్గొనడం, ఇంట్లోనే కొన్ని వ్యాయామాలు చేయడం వంటి చిన్నచిన్న, వారు సాధించగల లక్ష్యాలను నిర్దేశించాలి. దీనివల్ల ఫిట్నెస్ లక్ష్యాలను కొనసాగించడానికి వారిలో ప్రేరణ కలుగుతుంది. ఈ చిన్న లక్ష్యాలే వారి జీవనశైలిలో ఒక భాగంగా మారతాయి. ఫిట్నెస్ అంటే కొద్ది కాలంపాటు వ్యాయామాలు చేయడం కాదు.. ఎక్కువకాలం పాటు క్రమం తప్పకుండా చేయడమనేది వారే గుర్తిస్తారు.
ఫిట్నెస్ను ఒక ‘పని’లా కాకుండా.. సరదాగా మార్చుకోండి. వీకెండ్స్‌లో అందరూ కలిసి శారీరక శ్రమ ఉండే పనులను ప్లాన్ చేయండి. సాయంత్రం వేళల్లో అందరూ కలిసి వాకింగ్‌కు వెళ్లడం, ఇంట్లోనే చిన్నపాటి ఇండోర్ గేమ్స్ ఆడటం, వారాంతాల్లో ట్రెక్కింగ్ వంటివి ప్లాన్ చేయండి. దీనివల్ల వారితో గడిపే సమయం పెరుగుతుంది. వారిలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి కలుగుతుంది.
శరీరాకృతి కన్నా.. ఆరోగ్యంపైనే అధికంగా దృష్టిపెట్టాలి. టీనేజర్లు తమ శరీరాకృతి విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. కాబట్టి, తల్లిదండ్రులు ఎక్కువ బలవంతం చేస్తే.. పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపవచ్చు.
నేటితరం టీనేజర్లు స్మార్ట్ఫోన్లు, వీడియో గేమ్స్‌కే అధిక సమయం కేటాయిస్తున్నారు. వాటిని పూర్తిగా ఆపడం సాధ్యం కాదు. అందుకే, ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం ఒక గంటపాటు ఫోన్ పక్కన పెట్టి బయట ఆడుకోవాలనే నిబంధనను అమలు చేయాలి.
పిల్లలు బరువు తగ్గడం, సిక్స్‌ప్యాక్ రావడం వంటి లక్ష్యాల కన్నా.. వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారా? లేదా? అన్నదే ముఖ్యం. కాబట్టి, చిన్నచిన్న లక్ష్యాలు సాధించినప్పుడు వారిని ప్రోత్సహించడం మరిచిపోవద్దు. ఏదైనా ఆటలో గెలిచినా, కొత్తగా ఏదైనా వ్యాయామం నేర్చుకున్నా.. వారిని మనస్ఫూర్తిగా అభినందించండి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వారు ఆ పనిని కొనసాగించేలా చేస్తుంది.
మీరు చెప్పే మాటల కంటే.. మీరు చేసే పనులనే పిల్లలు ఎక్కువగా గమనిస్తారు. మీరు రోజంతా ఫోన్ చూస్తూ.. వ్యాయామం చేయాలని వారికి చెబితే ఏమాత్రం వినరు. కాబట్టి, పెద్దవాళ్లు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా లాంటివి చేస్తుంటే.. వారు కూడా దాన్ని ఒక జీవనశైలిగా భావిస్తారు.