ఇప్పుడంటే బ్యూటీ పార్లర్ నిర్వహణకు కార్పొరేట్ స్థాయి దక్కింది. బ్యుటీషియన్లకు సెలెబ్రిటీ హోదా వచ్చింది. అదే 25 ఏండ్ల కిందట..పార్లర్ పెట్టడమంటేనే సాహసం. అద్దెకు చిన్నగది కూడా దొరికేది కాదు. ఆ పరిమితులన్నీ అధిగమించి.. బ్యుటీషియన్‌గా, శిక్షకురాలిగా, బ్యూటీ ఇండస్ట్రీ అధినేత్రిగా.. సౌందర్య పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు ఎస్. శైలజ. ఓ ఉపాధ్యాయుడి భార్య నుంచి వేలమంది బ్యుటీషియన్లకు గురువు వరకూ ఆ ప్రయాణమంతా ఆమె మాటల్లో..
నాన్న రైల్వే ఉద్యోగి. నేను సికింద్రాబాద్ రైల్వే పాఠశాలలో చదువుకున్నాను. ఇంటర్ పూర్తికాగానే పెండ్లయింది. మావారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. వాళ్లది కరీంనగర్. ఆయనకు బదిలీ కావడంతో ఆదిలాబాద్ వెళ్లాం. నగరంలో పుట్టి పెరిగిన పిల్ల ఆ పల్లెటూళ్లో ఎలా ఉంటుందో అనుకున్నారు చాలామంది. కానీ నేను అన్నింటినీ అలవాటు చేసుకున్నాను. నాకు మొదటి నుంచీ బోధన అంటే ఆసక్తి. ఆయన బడికి వెళ్లాక ఇంట్లో ఒక్కదాన్నే ఖాళీగా కూర్చోవడం నచ్చలేదు. ట్యూషన్ ప్రారంభించాను. తర్వాత ఆయనకు సిరిసిల్ల బదిలీ అయ్యింది. అక్కడే నా బ్యుటీషియన్ కెరీర్‌కు నాంది పడింది.
సిరిసిల్ల వెళ్లాక నా కూతురిని చేర్పించిన బడిలోనే టీచర్‌గా చేరాను. కొడుకు పుట్టాక ఇంట్లో నా పరిస్థితి అర్థమైపోయింది. ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని బయటికెళ్లి ఉద్యోగం చేస్తానంటే ఒప్పుకోరని తెలుసుకున్నాను. పుట్టింటికి వచ్చినప్పుడు అమ్మతో ఇదే మాట చెప్పాను. ‘ఇంట్లోనే ఉండటం నాకు నచ్చట్లేదమ్మా. అత్తింట్లోనేమో బయటికి పంపేలా లేరు. ఏదో ఒకటి సొంతంగా చేయాలని ఉంది’ అని బాధపడ్డాను. అప్పుడు వచ్చిన ఆలోచనే బ్యూటీ పార్లర్. దానికి కూడా ఇంట్లో వాళ్లు వద్దన్నారు. నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారని వాళ్ల భయం. అయినా మొండిగా బ్యుటీ షియన్ కోర్సు చేశాను. నా పట్టుదల చూసి మౌనంగా ఉండిపోయారు. మొదట్లో పార్లర్ కోసం గది అద్దెకు కావాలని అడిగినా ఎవరూ ఇవ్వలేదు. మొత్తానికి ఓచోట దొరికింది. అద్దె వేయి రూపాయలు. అంత కట్టగలనా అనుకున్నాను. కానీ మనోధైర్యంతో పార్లర్ ప్రారంభించాను. కొన్నిరోజులకే మంచి ఆదరణ లభించింది. నా దగ్గరికి వచ్చే ఆడపిల్లలతో కలివిడిగా ఉండేదాన్ని. దాంతో వాళ్లు మనసు విప్పి మాట్లాడేవారు. ఇంట్లో బడి మాన్పించారనీ, బీడీలు చేస్తున్నామనీ బాధపడేవాళ్లు. వాళ్లకో పరిష్కారం చూపాలని అనిపించింది. అప్పటినుంచి బ్యాచ్‌కు 30మంది లెక్కన పేద ఆడపిల్లలకు ఉచితంగా బ్యూటీ కోర్సు మొదలుపెట్టాను.
శిక్షణ తర్వాత కూడా చాలామంది పాత జీవితాన్నే గడిపే వారు. దాంతో హైదరాబాద్‌కు వచ్చి కొన్ని కార్పొరేట్ కంపెనీలతో మాట్లాడాను. అమ్మాయిలను సొంత ఖర్చులతో ఇంటర్వ్యూకు తీసుకొచ్చేదాన్ని. ఎంపిక కానివాళ్లకు మళ్లీ అవసరమైన శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించేదాన్ని. ఉచితంగా చేయడం ఎందుకు, మీకు మేం కమీషన్ ఇస్తాం.. అంటూ చాలా సంస్థలు ముందు కొచ్చాయి. అయినా నేను ఒప్పుకోలేదు. ఇప్పటివరకు 10వేల మంది అమ్మాయిలకు శిక్షణ ఇచ్చాను. వాళ్ల కంటూ ఓ ఉపాధి కల్పించాను. ఇప్పుడు వాళ్లలో చాలామంది మంచి స్థాయిలో ఉన్నారని చెప్పడానికి గర్వంగా ఉంది.
రోజురోజుకూ నేర్చుకునే వాళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దాంతో ఒక బ్యూటీ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను. కరీంనగర్‌కు 10 కిలోమీటర్ల దూరంలోని తిమ్మాపూర్ గ్రామంలో ‘రోజాస్ బ్యూటీ స్కూల్’ ప్రారంభించాను. ఇక్కడా పేద విద్యార్థులకు ఉచితంగా చెప్పేదాన్ని. సొంతంగా పార్లర్ పెట్టుకునేంత నైపుణ్యం వచ్చేలా తీర్చిదిద్దేదాన్ని. స్కూల్ బాగా నడుస్తున్న సమయంలో వైద్య వృత్తిలో ఉన్న ఓ స్నేహితులు ‘బ్యుటీషియన్‌గా ఇన్నేండ్ల అనుభవం ఉంది. నువ్వే ఒక పరిశ్రమ పెట్టొచ్చుగా’ అని సలహా ఇచ్చారు. నాకూ మంచిగా అనిపించింది. అంతలోనే నావల్ల అవుతుందా అన్న భయం. రకరకాల వర్క్‌షాపుల్లో పాల్గొని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకున్నాను. సబ్సిడీతో కోటి రూపాయల రుణం వచ్చింది. మా రోజాస్
ఇండస్ట్రీస్‌లో ‘సిన్నోవ్’ బ్రాండ్ మీద హెర్బల్‌తో పాటు సింథటిక్ సబ్బులు, షాంపూలు, హ్యాండ్ వాష్‌లు మొదలైనవి తయారు చేస్తాం. మా కంపెనీలో పనిచేస్తున్న వాళ్లంతా మహిళలే. మా కుటుంబంలో ఎవరికీ వ్యాపార అనుభవం లేదు. సంకల్ప బలమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నా విద్యార్థులూ ఇలానే పైకి రావాలన్నది నా ఆకాంక్ష.
ఆడపిల్లలు బాగా చదువుకుని తమ కాళ్లపై తాము నిలబడాలని నేను కోరుకుంటాను. ఏ కారణంగానో చదువుకోక పోయినా, ఏదో ఒక పనిలో నైపుణ్యం సాధించాలి. ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా ఉన్నప్పుడే మహిళా సాధికారత సాధ్యం. పుట్టింటివాళ్లు, అత్తింటివాళ్లు తమ ఆశయానికి అడ్డుపడుతున్నారని చాలామంది వాపోతుంటారు. అలాంటివారికి నా సలహా ఒక్కటే. ఉద్యోగం లేదా వ్యాపారంలోకి వచ్చినంత మాత్రాన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వ్యక్తిగత జీవితాన్ని వందశాతం బాధ్యతగా నిర్వర్తిస్తే.. ఎవరూ మనల్ని అడ్డుకోవాలని అనుకోరు. అందరికీ గౌరవమర్యాదలు ఇస్తూ, స్వాభి
మానాన్ని కాపాడుకుంటూ నచ్చిన పనిచేస్తే కచ్చితంగా విజయం సాధించవచ్చు. ఆ ఓర్పు, నేర్పు నాకు విజయాన్నీ, పురస్కారాలనూ తెచ్చిపెట్టాయి.
–నిఖిత నెల్లుట్ల