విష్ణువు మనవాడైతే.. విశ్వమంతా మనదే!
ఎల్లరు దేహధారులు- నరులు, ఇల్లు అనే మోహమయమైన చీకటి నూతిలో ద్రెళ్లక- మగ్గక, ‘మేము-మీరు, వీరు-వారు’ అన్న బుద్ధి భ్రమ వల్ల కలిగిన భేదభావాలతో ప్రవర్తిల్లక, ద్వైత భ్రాంతిని వీడి ‘ఈ విశాల విశ్వమంతా విష్ణు దేవుని దివ్యలీలా విలాస విభ్రమమే’ అనే విజ్ఞానాన్ని పొంది ఇందీవరశ్యాము
ఎల్లరు దేహధారులు- నరులు, ఇల్లు అనే మోహమయమైన చీకటి నూతిలో ద్రెళ్లక- మగ్గక, ‘మేము-మీరు, వీరు-వారు’ అన్న బుద్ధి భ్రమ వల్ల కలిగిన భేదభావాలతో ప్రవర్తిల్లక, ద్వైత భ్రాంతిని వీడి ‘ఈ విశాల విశ్వమంతా విష్ణు దేవుని దివ్యలీలా విలాస విభ్రమమే’ అనే విజ్ఞానాన్ని పొంది ఇందీవరశ్యాము (విష్ణు)ని యందే డెందము-ఉల్లము చేర్చి వారు అడవిలో నివసించినా మంచిదే- అన్నది అసురరాజ సుతుని అరమరికలు లేని అభిమతం. అనుష్ఠాన వేదాంతం.
మూలంలోని ‘గృహమంధకూపం’ అన్న పదానికి ‘ఇల్లను చీకటి నూయి’, ‘యద్ధరి మాశ్రయేత’కి ‘విష్ణునందుల్లము జేర్చి’, ‘వనం గతః’కి ‘అడవినుండుట మేలు’ అని పోతన అమాత్యుని అందమైన యథాక్షర అనువాదం. ఇక ‘సర్వమున్నతని దివ్యకళామయము’ అన్నది ఆయనగారి స్వానుభవానికి అద్దంపట్టే సొంపుమీరిన ఇంపైన పెంపుదల. ఆయన చిరకాల సాధనకు, చరమ పరిణతి, పరమ ఫలం!
‘శరీరం గృహం’- జీవునికి తన బొందియే బందీగృహం. ఇది చాలదా అన్నట్లు దీనికి ఇల్లు మరో ఠికానా- మరో బందిఖానా! కళ్లు పొడుచుకున్నా ఏమీ కనిపించని కటిక చీకటి నూయి. ఏది తప్పినా గురి తప్పని ఉరి వంటి మృత్యువు ఉన్నా కూడా కనిపించదు! ఎప్పటికైనా చనిపోతామని అనిపించదు! ఆ మరణ ఘంటిక వినిపించదు! ‘బధిరాంధక శవము చూడ పాపము సుమతీ!’
ప్రహ్లాదుని ప్రత్యుత్తరంలో ‘విష్ణునందుల్లము చేర్చుట’ పరమార్థానికి పరాకాష్ఠ! ‘మనః పుష్పం సమర్పయేత్’ మనస్సనెడి మందార పుష్పాన్ని మాధవునికి సమర్పించుటే పరాపూజ- ప్రధాన అర్చన. ‘చిత్తమేవ హి సంసారః’- చిత్తం (మనసు) విజృంభణమే ప్రపంచం కాబట్టి ఆ చిత్తాన్ని ‘చైతన్యమూర్తి’లో లయం చేసిన వానిపై ప్రపంచకం (విశ్వం, సంసారం) తన ప్రభావం చూపలేదు. ‘మనోనాశో మహోదయః’- మనసు నశించుటే మహా లాభమని వేదశాస్ర్తాలు ఘోషిస్తున్నాయి. ఇంత వరకు అంతా నిశ్చింతగానే ఉన్నది. కానీ, ‘వనం గతః’- ‘అడవినుండుట మేలు’ అని అనడమే కొంత వింతగా అనిపిస్తుంది. ప్రహ్లాదుడు జీవితకాలంలో అరణ్యవాసం చేసినట్లు దాఖలాలు లేవు. ‘వన’ శబ్దానికి లాక్షణికంగా ఏకాంతవాసమని, సత్సంగమని, ప్రశాంత స్థితి అని వ్యాఖ్యానం చేశారు. లౌకిక పదార్థాలు, లోకుల పట్ల కన్నా లోకాంతరంగుడైన శ్రీకాంతుని పట్ల మిన్నగా ప్రేమ కలిగి ఉండటమే ఏకాంతవాసం! గృహాసక్తికి, భగవత్ప్రాప్తికి షష్ఠాష్టక (విరోధ)మన్నది వాస్తవమే! కాని, సంసార సుముఖులంతా కంసారికి విముఖులన్నది మాత్రం చెల్లదు. గృహస్థులెందరో సిద్ధి పొందిన వారున్నారు. వనస్థులైనా సంయమనం లేక అధఃపతనం చెందినవారున్నారు. వనములో ఉన్నా, భవనము (గృహం)లో ఉన్నా మనమే (చిత్తమే) ప్రధానం! అంతా మనఃస్థితిని బట్టే ఉంటుంది. భగవత్పరులైన సాంసారికుల మనసు ‘పద్మపత్రమివాంభసా’- తామరాకు మీద నీటిబొట్టు వలె ఉంటుంది. మహాత్ములకు ‘వాసుదేవస్సర్వం’- సర్వం వాసుదేవుడే! ప్రహ్లాదుడు భయంకర ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా భక్తిని మాత్రం విడువలేదు. సాధనకు బాధకమని భావించి గృహత్యాగం చేసి ఆశ్రమంలో ఉంటూ కూడా విజ్ఞానయుతుడు, వైరాగ్యరతుడు అయిన జడభరతుడు మాయాప్రభావంతో సాధనకు దూరమై లేడి జన్మను పొందాడు!

నారద ఉవాచ.. ధర్మరాజా! కుమారుడు విరోధి అయిన విష్ణువును మెచ్చుకొనగా మనములో నొచ్చుకొని, అచ్చెరువొంది, చిర్రుబుర్రులాడక చిరునవ్వుతో ఇలా అడిగాడు దైత్యరాజు.. నా చిన్నినాన్నా! మనకు బద్ధశత్రువును ప్రశంసించే బుద్ధి నీకే పుట్టిందా? గిట్టనివారెవరైనా గట్టిగా నూరిపోశారా? లేక, గుట్టుగా శుక్ర పుత్రులైన గురువులే చక్రి (విష్ణువు)ని అర్చించే వక్రబుద్ధిని నీకు బోధించారా? కుమారా! మన దానవ జాతికి దామోదరుడు పరమ దారుణమైన అపరాధం- హాని చేసినవాడు. వానిని నిందించాలి కాని, వందించరాదు. భంజించాలి కాని భజించరాదు. అంతేకాదు, ‘పుత్రకా! అతగాడి వందీజనులు (స్తోత్ర పాఠకులు), మందీ మార్బలమైన గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, యక్ష, పక్షి, నాగాది బృందారక (దేవతా) బృందాలను తన్ని తరిమెయ్యాలి. వెన్నుని కనుసన్నలలో మెలిగే ఆ అమరుల అధిపతులను వెన్ను విరిచి మన్ను కరిపించాలి. సాధుసంతులను, వారి ఇంతులను భయభ్రాంతులు చేసి బాధించాలి. సిద్ధపురుషులను, రుషీశ్వరులను కారాగారబద్ధులుగా చేసి వేధించాలి. మునీశ్వరులను మూకుమ్మడిగా మట్టి కరిపించాలి. ఇలా విష్ణు వర్గీయులను వేధించి, బాధించడమే మన విధి, పరమావధి కూడా! అంతేకానీ, ఔరా! హతవిధీ! నీవు ‘హరి, గిరి’ అంటూ ఆ దానవవైరిని, శౌరిని పొగుడుతూ ఈ విధి మూఢుని పగిది (వలె) అజ్ఞాన అంధకారంలో పడి చెడిపోకు’ అని కుమారుని వారించాడు.
తండ్రి బోధలు ఆలించి తనయుడు కాయాధవుడు మనసున పురోహితుల మేలెంచి, వారి వంక చూచి వినయంతో ఇలా విన్నవించాడు.. మాధవుని మాయచే మోహితులైన మానవులలో స్వ-నా, పర-నీ (నీ-నా) అనే దురాగ్రహం- పట్టుదల కానవస్తుంది. శత్రుమిత్రులు, నావారు పరాయివారు మొదలైన భేద-బుద్ధిలో తగుల్కొన్న మనిషికి ఆ ఖేద జనకమైన భేదమే సత్యమనిపిస్తుంది. నిజానికి ఈ భేదం వాస్తవం కాదు. కేశవ భగవానుని కృపకు పాత్రులైతేనే పురుషులలోని భేద-బుద్ధికి కారమైన ఈ పాశవిక ప్రవృత్తి తొలగిపోతుంది. గురుదేవా! మాయాపతి మధుసూదన స్వామికి మరల మరల నమోవాకాలు!
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Hindu Deity
- lord vishnu
- refuge
- seek
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

