ఒక బాలికను రక్షించడం అంటే.. పదిమంది బాలికలను బతికించడం. పదిమంది బాలికలను చదివించడం అంటే.. వందమంది బాలికలకు కొత్త జీవితం ఇవ్వడం. వంద మందికి ఉపాధి చూపితే.. లక్ష జీవితాలను తీర్చిదిద్దినట్టే. ఆ బాధ్యతతోనే ‘సేవ్ ద గర్ల్ చైల్డ్’ సంస్థ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నవారికి ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నది.
వేల కొలువులు. లక్షల అభ్యర్థులు. పోటీ తీవ్రం.
ప్రామాణికమైన పుస్తకాలతోనే సాధన రాటు దేలుతుంది. విజయం చేరువ అవుతుంది. వేలకువేలుపెట్టి స్టడీమెటీరియల్ కొనలేనివారికి, లక్షలు పోసి హైదరాబాద్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయించలేనివారికి, అసలు ఏ దిశానిర్దేశం లేని గ్రామీణ యువతకు ఎవరు దిక్సూచి అవుతారు? ‘సేవ్ ద గర్ల్ చైల్డ్’ ఆ కర్తవ్యాన్ని తలకెత్తుకుంది. నిరుపేద నిరుద్యోగులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నది.
ఆడబిడ్డల రక్షణే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన ఈ సంస్థ…సామాజిక బాధ్యతగా గ్రూప్స్, ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధం అవుతున్నవారికి సాయంగా నిలుస్తున్నది. ఒక్కో సెట్లో భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, పాలన.. తదితర అంశాలకు సంబంధించి మొత్తం పదకొండు పుస్తకాలను అందిస్తున్నది. మార్కెట్లో వీటి ధర ఆరువేల రూపాయల పైమాటే. ‘ప్రభుత్వ ఉద్యోగంతోపాటే బాధ్యత, అధికారం వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
ఒక యువతి తననుతాను నిరూపించుకోవడానికి ఇదో మంచి అవకాశం. ప్రస్తుత నియామకాల ద్వారా కనీసం యాభైవేలమంది యువతుల జీవితాలు మారబోతున్నాయి. ఈ కీలకమైన మలుపులో మేము ఉద్యోగార్థులకు అండగా ఉండాలని నిర్ణయించాం’ అంటారు సేవ్ ద గర్ల్ చైల్డ్ ప్రతినిధులు. అలా అని, ఈ సంస్థ తమ అక్షర సాయాన్ని మహిళలకే పరిమితం చేయడం లేదు. ఒక కొడుకుకు ఉద్యోగం వస్తే.. తల్లి జీవితం మారుతుంది, చెల్లి జీవితం మారుతుంది. కాబట్టి, నిరుపేద యువకులకు కూడా ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తున్నది.
‘పంపిణీ చేసే ప్రతిపుస్తకంలో బాలికలను రక్షించుకుందాం.. అనే నినాదాన్ని ముద్రించడం ద్వారా ఓ మంచి సందేశాన్ని యువతలోకి తీసుకెళ్తున్నా’మని అంటారు ‘సేవ్ ద గర్ల్ చైల్డ్’వ్యవస్థాపకుడు, చంచల్‌గూడ సెంట్రల్ జైలు ఎస్పీ శివకుమార్ గౌడ్.
ఆ సంఘటనే..
వరంగల్ జిల్లాలో ప్రవీణ్ అనే వ్యక్తి తొమ్మిది నెలల పసిపాపపై హత్యాచారానికి పాల్పడిన ఘటన శివకుమార్ గౌడ్‌ను కదిలించింది. ఇలాంటి అకృత్యాలకు తావులేని సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించారు ఆయన. ఆ తర్వాత సామాజిక స్పృహ కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు, వృత్తి నిపుణులు ఇందులో భాగస్వాములు అయ్యారు. అంతా కలిసి ‘సేవ్ ద గర్ల్ చైల్డ్.. సేవ్ ద సొసైటీ..’
నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లారు. భ్రూణ హత్యల నివారణ, బాలికల సంరక్షణ.. సంస్థ ప్రధాన లక్ష్యాలు. ‘ఆడపిల్లలను కాపాడండి..ఎదగనివ్వండి, గౌరవించండి’.. అని పిలుపునిస్తున్నది సేవ్ ద గర్ల్ చైల్డ్.
పుస్తకాలే బలం
ఈ సంస్థ అందించే ప్రతి పుస్తకం ఉద్యోగార్థులకు కొండంత మనోబలాన్ని ఇస్తున్నది. క్యాంపస్ ఆవరణల్లో విద్యార్థులు బృందాలుగా అధ్యయనం చేస్తున్నారు. ‘ఉస్మానియా వర్సిటీ హాస్టల్లో మేం ఐదుగురం ఉంటున్నాం. అంతా కలిసి సేవ్ ద గర్ల్ చైల్డ్ మెటీరియల్‌ను చదువుకుంటున్నాం. నిత్యం చర్చించుకుంటున్నాం. మాతోపాటు దివ్యాంగురాలైన మా స్నేహితురాలికి కూడా సంస్థ నుంచి మెటీరియల్ అందింది’ అని చెబుతున్నారు ఉస్మానియా పీహెచ్డీ స్కాలర్ ప్రణతి. ‘నేను ఎంబీఏ పూర్తి చేశాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది ఆశయం.
తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్టడీ మెటీరియల్ కొనలేకపోతున్నా. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు సేవ్ ద గర్ల్ చైల్డ్ గురించి తెలిసింది. శివకుమార్‌గౌడ్ గారికి ఫోన్ చేసి నా పరిస్థితి చెప్పాను. అడ్రస్ తీసుకుని ఇంటికే పుస్తకాలు పంపారు. ఆ మెటీరియల్ చూశాక నా ఆత్మవిశ్వాసం పెరిగింది’ అంటారు గోదావరిఖనికి చెందిన గ్రూప్స్ ఉద్యోగార్థి సుజాత. ఎదురుగా వేలాది కొలువులు. చేతిలో ప్రామాణికమైన పుస్తకాలు. లక్ష్యం ఉంది. మార్గమూ తెలిసింది. ఇక, విజయం తథ్యం!
ఒక్క వాట్సాప్ చాలు..
మేం పోటీపరీక్షలకు సిద్ధమైనప్పటి పరిస్థితులు వేరు. సరైన వసతులు లేవు. ప్రామాణికమైన మెటీరియల్ లేదు. అయినా పట్టుదలతో కొలువులు సాధించాం. ఆ బాధేమిటో తెలుసు కాబట్టే పేద ఉద్యోగార్థులకు మా వంతు సాయం అందించాలని సంకల్పించాం. పుస్తకాలు కొనే స్తోమత లేనివారు.. 9848763008 నంబర్‌కు వాట్సాప్ చేస్తే సరిపోతుంది.. మిగిలినవారికి కూడా అవసరమైన గైడెన్స్ అందిస్తాం.
నవాబ్ శివకుమార్ గౌడ్
సూపరింటెండెంట్,చంచల్‌గూడ సెంట్రల్ జైలు
…? నాగోజు సత్యనారాయణ