చిన్నప్పటి నుంచి సమీనాకు అందం, గ్లామర్ పట్ల మక్కువ. తన ‘అందమైన’ కలను నిజజీవితంలో నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసింది. ఆమె తిరుగులేని సంకల్పానికి కుటుంబ ప్రోత్సాహమూ దక్కింది. దీంతో ప్రస్తుతం ‘రిషెస్సే సెలూన్ స్పా అకాడమీ’కి వ్యవస్థాపక యజమానిగా మారిపోయారు సమీనా. అంతేకాక ముంబైలోని టాప్ హెయిర్ కలరిస్ట్లలో ఒకరిగానూ పేరు గడించారు.
భారతదేశంలోని మౌనిర్ సర్టిఫైడ్ ఆర్టిస్టుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. లండన్, కౌలాలంపూర్, పారిస్ లాంటి నగరాల్లోని ప్రముఖ ఇన్స్టిట్యూట్ల నుంచి మేకప్, హెయిర్ కలరింగ్ తదితర సర్టిఫైడ్ కోర్సుల్లో శిక్షణ పొందారు. గత 15 ఏళ్లుగా శ్రీమంతులకు, నటీనటులకు, ప్రముఖులకు తన సేవలను అందిస్తూ ఫ్యాషన్ దిగ్గజాల ప్రశంసలు పొందుతున్నారు. అంతటితో ఆగకుండా హెయిర్, స్కిన్, మేకప్నకు సంబంధించిన అంశాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకొని ‘రిషెస్సే సెలూన్ స్పా అకాడమీ’ ద్వారా ఔత్సాహిక యువతీ యువకులకు బ్యూటీ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు.