రామాయణమహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ – అంటే, రామాయణమనే మహామాలలో రత్నమైన పవనసుతునికి నమస్కరిస్తున్నాను అని అర్థం. రామాయణంలో శ్రీరాముని తరువాత అంతటి ఉదాత్తమైన పాత్ర ఏదైనా ఉన్నదంటే, అది నిస్సందేహంగా ఆంజనేయుడిదే. బ్రహ్మదేవుడు, వాల్మీకి మహర్షి కలసి హనుమంతుణ్ని సకల సద్గుణాల సమాహారంగా తీర్చిదిద్దారు. రాముడిలోనూ ఈ గుణాలన్నీ ఉన్నాయి. మరి, మారుతి పాత్ర ద్వారా మనకు లభించే ప్రత్యేకమైన సందేశం ఏమిటి?
రామాయణం ఆరంభంలోనే శ్రీరాముడు మహావిష్ణువు అవతారమని, రావణసంహారం కోసం భూమిపై అవతరించాడని స్పష్టంగా ఉంది. సృష్టి ఉన్నంతవరకు మానవజాతికి దిక్సూచిగా నిలవాలనే ఉద్దేశంతో రామాయణం, రాముడి పాత్రను తీర్చిదిద్దారు. కానీ భవిష్యత్తులో ఎవరైనా ‘రాముడు దేవుడు కాబట్టి నియమనిష్ఠలతో జీవించగలిగాడు; మనబోటి మానవులకు అదెలా సాధ్యం?’ అనే వాదనకు దిగవచ్చు. ఆ తర్కానికి తావుండకూడదనే మహదాశయంతోనే ఆంజనేయుడు ఆవిర్భవించాడని; ఇదంతా సృష్టికర్త వ్యూహరచనలో భాగమని పౌరాణికుల విశ్వాసం. ఒక వానరుడే అంతటి ఆదర్శవంతంగా జీవించగలిగితే, మానవుడైన నాకెందుకు సాధ్యం కాదు?- అన్న ఆత్మవిశ్వాసాన్ని మనలో కలిగించడమే హనుమంతుడి పాత్ర పరమార్థం.
రామనామం భక్తికి, ముక్తికి మార్గమైతే; ఆంజనేయుని అనుసరించటం భుక్తికీ మార్గమే! ఆంజనేయుణ్ని రామభక్తుడిగా మాత్రమే కాదు, ప్రస్తుత ప్రపంచానికి మార్గదర్శకునిగా కూడా చూడాలి. ఈరోజు మనం ఆధునిక భావజాలంగా తరచూ చర్చించుకునే వ్యాపార నిర్వహణ, పౌర సంబంధాలు, సిబ్బంది సంక్షేమం, దీర్ఘకాలిక దృష్టి, ప్రణాళికా రచన, మనస్తత్వ శాస్త్రం, వనరుల పొదుపు, పర్యావరణ పరిరక్షణ, అడ్డంకుల తొలగింపు వంటి విజ్ఞాన సర్వస్వాన్ని ఆంజనేయుడు ప్రబోధించలేదు; స్వయంగా ఆచరించి చూపాడు.
అంజనాసుతుడి పేరు వినగానే అసంకల్పితంగా మన మదిలో మెదిలేవి- సుందరకాండ, సముద్ర లంఘనం, లంకాదహనం లాంటి అనితరసాధ్యమైన సాహసకృత్యాలే! బాల్యం నుంచే మనం వింటూ వస్తున్న- ‘శాకినీ ఢాకినీ గాలి దెయ్యంబులన్, నీదు వాలంబులన్ జుట్టి నేలంబడంగొట్టి’- దండకం ద్వారా మారుతి దుష్టశక్తులకు సింహస్వప్నమని కూడా మనకు తెలుసు. కానీ హనుమంతుడు కేవలం శారీరక శక్తి, పరాక్రమాల ప్రతిరూపమే కాదు; దూరదృష్టి, విచక్షణ, కార్యదక్షత, సంయమనంతోపాటు వినయం కలగలిసిన పరిపూర్ణ వ్యక్తిత్వం.
రామాయణంలో హనుమంతుడి పాత్ర కిష్కింధకాండ ప్రారంభంలోనే తెరమీదకు వస్తుంది. సుగ్రీవుడు ప్రాణభయంతో వణికిపోతుంటే, వాయునందనుడు దైన్యాన్ని త్యజించి కర్తవ్యాన్ని ఆలోచించమంటూ మృదువుగా మందలిస్తాడు. సుగ్రీవుని మంత్రిగా తన బాధ్యతను నిర్వర్తించాడు గాని, కేవలం ప్రభువును తృప్తి పరచడమే తన పరమావధిగా భావించలేదు. ప్రస్తుత సమాజంలో అధికశాతం ఉద్యోగులు యజమానిని సంతోషపరచడానికే ప్రయత్నిస్తున్నారు. కటువైన మాటలు చెప్పైనా సరే- నాయకుణ్ని, తద్వారా సంస్థను సరైన గాడిలో పెట్టడం సభ్యులందరి బాధ్యత. దాన్ని సక్రమంగా నిర్వర్తించిన హనుమయ్యకు ‘బుద్ధిమతాం వరిష్ఠం’- ‘బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు’ అన్న విశేషణం అతికినట్లు సరిపోతుంది!
అప్పుడైనా, ఇప్పుడైనా- సున్నితంగా, మర్యాదగా, సంక్షిప్తంగా, ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడగలగడం ఒక అరుదైన కళ. భారతీయ సంప్రదాయంలోని చతుఃషష్టి కళలలో దీనికీ స్థానం ఉంది. అందులో హనుమంతుడు నిష్ణాతుడు. సీతను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న రామలక్ష్మణులు, గంధర్వుడి సూచన మేరకు సుగ్రీవుణ్ని అన్వేషిస్తూ రుష్యమూకం సమీపంలోని దట్టమైన అడవిలోకి ప్రవేశిస్తారు. హనుమంతుడు తొలిపరిచయంలోనే వారితో సత్సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. తనను, సుగ్రీవుణ్ని క్లుప్తంగా పరిచయం చేసుకుని, తన వాక్చాతుర్యంతో వారి విశ్వాసాన్ని చూరగొంటాడు.

ఎదుటివారి స్వభావాన్ని త్రుటిలో అంచనా వేయగలిగిన రాముణ్ని.. వాయునందనుడి సరస సంభాషణ ఎంతగానో ఆకట్టుకుంది. ‘అతను వేదాలలో పాండిత్యం కలవాడు, వ్యాకరణంపై లోతైన పట్టున్నవాడు, సంస్కారవంతుడు అయి ఉండవచ్చ’ని లక్ష్మణునితో ప్రస్తావిస్తాడు రాముడు. ఇలాంటి దూత ఉన్న రాజు నిజంగా అదృష్టవంతుడని కొనియాడాడు. మితంగా మాట్లాడే రాముని నుంచి అంతటి ప్రశంస అందుకున్న హనుమయ్య సంభాషణా చాతుర్యం అనిర్వచనీయం. అనుమానం, భయం, ఆందోళనలతో కూడుకున్న పరిస్థితుల్లో- మొదటి పరిచయంలోనే ఎదుటివారి మనసును గెలుచుకునేలా మనలో ఎందరు అలా మాట్లాడగలుగుతారు?.. ‘వాక్పటుత్వంచ హనూమత్ స్మరణాద్భవేత్!’ హనుమను వేడుకుని, అటువంటి సంభాషణను అభ్యసిస్తే మనకూ అలాంటి వాక్చాతుర్యం ఎందుకు అలవడదు?
‘అమానిత్వమదంభిత్వమహింసా క్షాంతిరార్జవం’ అనే గీతాశ్లోకంలో పేర్కొన్న సుగుణాలలో ‘అమానిత్వం’, అంటే వినయం- ప్రప్రథమంగా కనిపిస్తుంది. రాముడికి దాసుడిగా తనను తాను పరమానందంగా పరిచయం చేసుకునే హనుమంతుడిలో వినయశీలత స్పష్టంగా గోచరిస్తుంది. దీనికి రామాయణంలో అనేక ఉదాహరణలు లభిస్తాయి. సీతాన్వేషణలో దక్షిణ దిక్కుకు వెళ్లిన వానరసేనకు, సీత సముద్రం అవతల లంకలో ఉన్నదనే విషయం తెలిసింది. అప్పుడో పెద్ద సమస్య ఎదురైంది. నూరు యోజనాల సముద్రాన్ని దాటగల సమర్థులెవరు? అంగదుడి ఆదేశం మేరకు గజుడు, గవాక్షుడు, సుషేణుడు వంటి వానరవీరులు తమ తమ బలాలను పేర్కొంటూ ఇరవై, ముప్పై, యాభై యోజనాలు దాటగలమని చెప్పారు. అంతకంటే ఎన్నో రెట్లు శక్తిసంపన్నుడైన పవనసుతుడు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. చివరికి జాంబవంతుడు ప్రోత్సహించిన తరువాతనే మారుతి ముందుకు వచ్చాడు. ఉన్న గోరంత సామర్థ్యాన్ని కొండంతగా చెప్పుకొనే మనకు- హనుమంతుడంతటి వాడికి ఉన్న వినయంలో ఇసుమంతైనా ఉందా!
శతయోజన సముద్రాన్ని లంఘించగలిగినంత వేగంతో ఎగరాలంటే, కాళ్లతో అదమడానికి బలమైన ఆసరా కావాలి. అప్పుడే వేగం పుంజుకుంటుంది. సమీపంలో మహేంద్రగిరి పర్వతం ఉంది. కానీ, అది గుహలు, బిలమార్గాలతో నిండిపోయి డొల్లగా ఉంది. బలంగా అదమడానికి అనువుగా లేదు. సమయోచితంగా ఆలోచించిన హనుమంతుడు, ముందుగా తన బాహుబలంతో పర్వతశిఖరాలను గట్టిగా కుదిపాడు. ఆ గుహలన్నీ బండరాళ్లతో మూసుకుపోయి, పర్వతం దృఢమైన శిలగా మారిపోయింది. కేసరీసుతుడి కార్యం సుగమమైంది. ఏదైనా కార్యం ప్రారంభించేముందు, ఆ కార్యరంగం మనకు అనుకూలంగా ఉందో, లేదో గమనించాలి; లేకపోతే దానిని మనకు సానుకూలంగా మలచుకోవాలి. అప్పుడే లక్ష్యం సాకారమవుతుంది.
సముద్రాన్ని అతివేగంగా లంఘిస్తున్న హనుమంతునికి మార్గమధ్యలో ప్రలోభాలు, పరీక్షలు ఎన్నో ఎదురయ్యాయి. కొంతదూరం ఎగిరిన తర్వాత మైనాకుడు అనే పర్వతరాజు సముద్ర ఉపరితలానికి ఎగసి వచ్చాడు. వాయుదేవుడు తనకు చేసిన సహాయానికి గుర్తుగా, వాయుపుత్రుణ్ని కొద్దిసేపు తన శిఖరంపై విశ్రాంతి తీసుకొమ్మని కోరాడు. కానీ, హనుమంతుడు అలసట తీర్చుకోవడం కోసం తన సమయాన్ని వెచ్చించలేదు. ఆతిథ్యాన్ని స్వీకరించమని అభ్యర్థించిన తన తండ్రి స్నేహితుడిని నిరుత్సాహపరచనూ లేదు. ఆ పర్వతాన్ని కృతజ్ఞతా పూర్వకంగా స్పృశించి ముందుకు సాగిపోయాడు. లక్ష్యసాధనలో ఎదురయ్యే తాత్కాలిక ఆకర్షణలకు లోను కాకుండా.. సాటి వారిపట్ల నొప్పించక, తానొవ్వక అన్నట్లుగా ప్రవర్తించాడు.
మరికొంత దూరం సాగిన తరువాత నాగమాత సురస దేవతల ఆజ్ఞ మేరకు, హనుమంతుడి శక్తిని పరీక్షించదలచుకుంది. మార్గంలో అడ్డుగా నిలిచి, తన నోటిద్వారా ప్రవేశించి బయటికి రావాలని భీష్మించుకుంది. హనుమంతుడు యుక్తిగా ఆలోచించి, తనకున్న అణిమ అనే శక్తి ద్వారా సూక్ష్మరూపం ధరించాడు. సురస నోటిలోకి వేగంగా ప్రవేశించి వెనువెంటనే బయటికి వచ్చి తన ప్రయాణం కొనసాగించాడు. హనుమంతుడు తలచుకుంటే తనకు అడ్డుగా వచ్చిన సురసతో పోరాడి సులభంగా ఆమెను ఓడించగలడు. అయితే, అతనికి సురస ముఖంలో తనకు హాని చేసే సంకల్పం కనిపించకపోవడంతో, దండోపాయం ప్రయోగించలేదు; యుక్తితోనే అడ్డంకిని తొలగించుకున్నాడు. సాధ్యమైనంతవరకు ఉపాయంతోనే పనులు సాధించుకోవాలి; గత్యంతరం లేకపోతేనే ఘర్షణ మార్గాన్ని ఆశ్రయించాలి. కుటుంబంలో, సమాజంలో సత్సంబంధాలు కొనసాగించుకోవాలంటే ఇదే స్థిరమైన మార్గం.
తన లక్ష్యానికి చేరువవుతున్న తరుణంలో హనుమ ప్రయాణానికి మరో విఘాతం ఏర్పడింది. సింహిక అనే భయంకరమైన సముద్రపు జంతువు హనుమంతుడి నీడను పట్టుకుని బలంగా నీటిలోకి లాగసాగింది. ఆ జలచరం గురించి ముందే తెలుసుకుని ఉన్న హనుమంతుడు సమయం వృథా చేయదలచుకోలేదు. సామ, దాన, భేదోపాయాలు పనికిరావని నిశ్చయించుకున్నాడు. ఒక్క క్షణంలో తన పదునైన గోర్లతో సింహిక ఉదరాన్ని చీల్చి తన మార్గాన్ని నిష్కంటకం చేసుకున్నాడు. అవసరమైన సందర్భాలలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేయడం ప్రమాదకరం.
వాయునందనుడు అన్ని విఘ్నాలను విజయవంతంగా అధిగమించి, శీఘ్రంగా నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకానగరాన్ని చేరుకున్నాడు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఘట్టంలో హనుమంతుడు చూపించిన తెగువ, సమయస్ఫూర్తి, కార్యకుశలత అసాధారణం. అవన్నీ వివరించాలంటే వాయుసుతుని వాలాన్నే మించిపోతాయి. ఏదైనా సన్నివేశం-సమస్య ఎదురైనప్పుడు ఆంజనేయుణ్ని భక్తితో తలచుకొని, ఇటువంటి పరిస్థితిలో ఆయనైతే ఏం చేసేవాడు? అని ప్రశ్నించుకుంటే సరైన సమాధానం సత్వరమే లభిస్తుంది.
ఆంజనేయుడి అనుగ్రహం పొందడానికి సులభమైన మార్గం కూడా ఉంది- ‘యత్ర యత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిం..’ రామనామాన్ని జపిస్తే చాలు; ఆ రామదూత హనుమంతుడే స్వయంగా వచ్చి మన కష్టాలను కడతేర్చుతాడు.
-పల్లపోతు కృష్ణబాలాజి ,99490 98406