‘ఆమెకు నవ్వించడం తెలుసు. బరువైన హావభావాలతో ప్రేక్షకులచేత కన్నీళ్లు పెట్టించడం తెలుసు. జానపదంతో జనసమూహాలను వెర్రెక్కించడమూ తెలుసు. బంధాలు, అనుబంధాలు, సామాజిక బాధ్యత ఇతివృత్తంగా వంద పైచిలుకు లఘు చిత్రాల్లో నటించింది. మరోపక్క, మోడల్‌గానూ మెరుపులు మెరిపిస్తున్నది ఘట్కేసర్కు చెందిన ప్రియాశర్మ.
రంగం ఏదైనా సరే. కృషి, పట్టుదల ఉంటే.. ప్రతిభను మెరుగుపర్చుకుంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ముళ్లబాటనైనా పూలదారిగా మార్చుకోవచ్చు. ప్రియాశర్మ జీవితంలో జరిగిందీ ఇదే. ప్రియ తండ్రి ఎంపీ శర్మ జన్మతః నేపాలీ. తల్లి లక్ష్మి తెలంగాణ ఆడబిడ్డ. యాభై ఏండ్ల క్రితం ఘట్కేసర్లోని ఓ కంపెనీలో ఉద్యోగం కోసం ఎంపీ శర్మ నేపాల్ నుంచి వలస వచ్చారు. లక్ష్మిని పెండ్లి చేసుకుని తెలంగాణ అల్లుడు అయిపోయారు. మొత్తం కుటుంబం ఇక్కడే స్థిరపడిపోయింది. మధ్యలో ఓ ఇరవై ఏండ్లు మధ్యప్రదేశ్‌కు వెళ్లినా.. మళ్లీ ఘట్కేసర్కు తిరిగొచ్చింది. ఇంటర్ వరకూ చదివిన ప్రియాశర్మకు చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి. అదే ఆమెను కళారంగం వైపు నడిపింది.
సినీరంగం అంటేనే ఎన్నో సమస్యలు. వాటన్నిటిని తట్టుకుని నిలబడింది. లఘుచిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. వంద వరకు ఫోక్ సాంగ్స్‌లో, లఘుచిత్రాల్లో నటించి నెటిజన్ల అభిమానం చూరగొంది. ఆన్లైన్ ప్రేమ మోసాలే ఇతివృత్తంగా తీసిన ‘ఫేస్బుక్ లవ్‌స్టోరీ’ ప్రియాశర్మ తొలి లఘు చిత్రం. ప్రియాశర్మ ప్రముఖ వస్త్ర తయారీ సంస్థలకు మోడల్‌గానూ రాణిస్తున్నది. అందులోనూ చేనేత వస్ర్తాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నది. ప్రియకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. గత ఏడాది ఒక చెల్లి పెళ్లి చేసింది. పక్షవాతంతో మంచాన పడ్డ తండ్రితోపాటు తల్లి, చెల్లి, తమ్ముడి బాధ్యతలనూ సంతోషంగా స్వీకరించింది ప్రియా శర్మ. తనకంటూ ఓ యూట్యూబ్ చానెల్ ఏర్పాటు చేసుకోవాలన్నది ఆమె కల. ఆ స్వప్నమూ ఆమెకు చేరువలోనే ఉంది.