వాతావరణ మార్పులు, సీజనల్ ఇన్ఫెక్షన్ల నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు లాంటి వ్యాధులు పెరిగే సమయంలో ‘ప్లేట్లెట్స్’ అనే పదం తరచుగా వినిపిస్తుంటుంది. ప్లేట్లెట్స్ అంటే ఏమిటి? అవి ఎందుకు తగ్గుతాయి? ప్లేట్లెట్ కౌంట్ తగ్గిన ప్రతిసారీ వాటిని ఎక్కించాలా? ఎప్పుడు ప్లేట్లెట్ ట్రాన్స్ ఫ్యూజన్ అవసరం? అనే సందేహాలు ప్రజల్లో చాలా వినిపిస్తున్నాయి. ప్లేట్లెట్లపై ఉన్న అపోహలను తొలగించుకుని, సరైన వ్యాధి నిర్ధారణతో తగిన చికిత్స పొందడం ఎంతో ముఖ్యం.
మన రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్ అనే ప్రధాన రక్తకణ భాగాలు ఉంటాయి. ఇవి ప్రధానంగా ఎముక మజ్జ (బోన్ మ్యారో)లో ఉత్పత్తి అవుతాయి. తెల్ల రక్తకణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎర్ర రక్తకణాల్లోని హిమోగ్లోబిన్ శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తుంది. ప్లేట్లెట్స్ మాత్రం రక్తస్రావాన్ని నియంత్రించడంలో, రక్తం గడ్డకట్టే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి.
సాధారణంగా పెద్దల్లో ప్లేట్లెట్ కౌంట్ సుమారు 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటుంది. అయితే వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, వయసు, ఇన్ఫెక్షన్లు తదితర అంశాల ఆధారంగా ఈ సంఖ్యలో మార్పులు ఉండవచ్చు. ప్లేట్లెట్ల సగటు జీవితకాలం సుమారు 7 నుంచి 10 రోజులు. పాత ప్లేట్లెట్లు తొలగిపోతుండగా, ఎముక మజ్జలో కొత్త ప్లేట్లెట్లు ఉత్పత్తి అవుతూ రక్తప్రసరణలోకి చేరుతాయి. శరీరానికి గాయం అయినప్పుడు రక్తస్రావాన్ని ఆపే ప్రక్రియలో రక్తనాళాలు, ప్లేట్లెట్స్, రక్తం గడ్డకట్టే వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తాయి. అందువల్ల రక్తస్రావాన్ని నియంత్రిస్తూ ప్రాణరక్షణలో ప్లేట్లెట్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు లాంటి వ్యాధుల సమయంలో ప్లేట్లెట్ కౌంట్ తాత్కాలికంగా పడిపోవచ్చు. ఎముక మజ్జలో ప్లేట్లెట్ల ఉత్పత్తి తగ్గడం, కొన్ని ఆటోఇమ్యూన్ పరిస్థితులు, కాలేయం లేదా ప్లీహం సంబంధిత సమస్యలు, కొన్ని మందుల ప్రభావం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్లేట్లెట్ల సంఖ్య సాధారణంగానే ఉన్నప్పటికీ వాటి పనితీరు దెబ్బతినవచ్చు. అందువల్ల కేవలం ప్లేట్లెట్ కౌంట్‌ను మాత్రమే కాకుండా, రోగి మొత్తం ఆరోగ్య పరిస్థితిని కూడా వైద్యులు అంచనా వేయాలి.

ప్లేట్లెట్ కౌంట్ ఎంత తగ్గింది? ఎంత వేగంగా తగ్గుతున్నది? రక్తస్రావం ఉందా, లేదా? అనే అంశాల ఆధారంగా లక్షణాలు మారవచ్చు. చర్మంపై చిన్న ఎర్రటి లేదా ఊదా రంగు మచ్చలు (పెటీకియా), సులభంగా గాయాలు ఏర్పడటం, ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం, మూత్రం లేదా మలంలో రక్తం లాంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉన్న ప్రతి ఒక్కరిలోనూ రక్తస్రావం తప్పనిసరిగా జరగదు. డెంగ్యూ వంటి ఇన్ఫెక్షన్లలో అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం లాంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. రక్తస్రావం, తీవ్రమైన బలహీనత, రక్తపోటు పడిపోవడం లేదా ఇతర ప్రమాద సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి.
ప్లేట్లెట్ కౌంట్ తగ్గిన ప్రతిసారీ వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించాలనే అభిప్రాయం సరైంది కాదు. తాజా అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం, ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ నిర్ణయం కేవలం ఒక సంఖ్య ఆధారంగా తీసుకోకూడదు. రోగికి రక్తస్రావం ఉందా, ప్లేట్లెట్ల సంఖ్య ఎంత ఉంది, వాటి పనితీరు ఎలా ఉంది, ఏ వ్యాధి కారణంగా ప్లేట్లెట్స్ తగ్గాయి, శస్త్రచికిత్స లేదా ఇతర వైద్య ప్రక్రియ అవసరమా లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వైద్యులు నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా డెంగ్యూ రోగుల్లో తీవ్రమైన రక్తస్రావం లేకపోతే కేవలం ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉందనే కారణంతో రొటీన్‌గా ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం సిఫారసు చేయడం జరగదు. 2025 నాటి WHO మార్గదర్శకాల ప్రకారం రక్తస్రావం లేని డెంగ్యూ రోగుల్లో ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల స్పష్టమైన ప్రయోజనం నిరూపితం కాలేదని పేర్కొంటున్నాయి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఉదాహరణకు అత్యవసర శస్త్రచికిత్స అవసరమైనప్పుడు, వైద్యుల క్లినికల్ నిర్ణయం మేరకు ప్లేట్లెట్లు అవసరం కావచ్చు. అందువల్ల ప్లేట్లెట్ కౌంట్ ఎంత? అనే ప్రశ్నతో పాటు రోగి పరిస్థితి ఎలా ఉంది? అనేది మరింత కీలకం.
ప్లేట్లెట్లు ఎందుకు తగ్గుతున్నాయో గుర్తించడం చికిత్సలో అత్యంత ముఖ్యమైన దశ. డెంగ్యూ కారణంగా ప్లేట్లెట్లు తగ్గితే డెంగ్యూ చికిత్సతో పాటు రోగి ద్రవాల స్థితి, రక్తస్రావం, అవయవాల పనితీరు లాంటి అంశాలను పర్యవేక్షించాలి. మలేరియా కారణంగా ప్లేట్లెట్స్ తగ్గితే మలేరియాకు తగిన చికిత్స అందించాలి. వైరల్ ఇన్ఫెక్షన్లలో వ్యాధి నియంత్రణతో పాటు ప్లేట్లెట్ కౌంట్ కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. కొన్ని మందుల కారణంగా ప్లేట్లెట్లు తగ్గుతున్నట్లు అనుమానం ఉంటే వైద్యుల పర్యవేక్షణలో మందులను సమీక్షించాలి. స్వయంగా మందులు ఆపడం లేదా మార్చడం మాత్రం చేయకూడదు.
ఆధునిక ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్‌లో అవసరానికి అనుగుణంగా ప్లేట్లెట్లను సేకరించి, పరీక్షించి, నిల్వ చేసి, అవసరమైన రోగులకు అందించే సదుపాయాలు అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ (SDP/Apheresis Platelets), పూల్డ్ లేదా రాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ లాంటి రక్త భాగాల ఉత్పత్తులు ఉపయోగిస్తున్నారు. అఫెరిసిస్ (Apheresis) టెక్నాలజీ ద్వారా ఒకే దాత నుంచి ప్లేట్లెట్లను ప్రత్యేకంగా సేకరించవచ్చు. ఈ ప్రక్రియలో ప్లేట్లెట్లను సేకరించిన తర్వాత మిగిలిన రక్త భాగాలను దాతకు తిరిగి అందిస్తారు. మరోవైపు, మొత్తం రక్తాన్ని సేకరించిన అనంతరం వివిధ రక్త భాగాలను వేరు చేసి ప్లేట్లెట్లను తయారు చేసే విధానం కూడా అందుబాటులో ఉంది.

ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ రంగంలో Platelet Additive Solutions (PAS), Pathogen Reduction Technology (PRT) వంటి సాంకేతికతలు కూడా వినియోగంలో ఉన్నాయి. PAS ద్వారా ప్లేట్లెట్లను ప్రత్యేక ద్రావణంలో నిల్వ చేయడం ద్వారా వాటి నిర్వహణకు ప్రత్యామ్నాయ విధానం లభిస్తుంది. Pathogen Reduction Technology ద్వారా కొన్ని వ్యాధికారక సూక్ష్మజీవుల వల్ల కలిగే ట్రాన్స్ఫ్యూజన్ సంబంధిత ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతున్నది. అదేవిధంగా ఆధునిక బ్లడ్ బ్యాంకింగ్ వ్యవస్థల్లో దాతల ఎంపిక, రక్త సేకరణ, పరీక్షలు, ప్రాసెసింగ్, నిల్వ, నాణ్యత నియంత్రణ, ట్రేసబిలిటీ వంటి ప్రతి దశకు కఠినమైన ప్రమాణాలు పాటిస్తున్నారు. AABB ప్రస్తుత Blood Banks and Transfusion Services Standards 35వ ఎడిషన్ 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది, ఇది రక్త సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, ట్రాన్స్ఫ్యూజన్ సేవలకు సంబంధించిన తాజా ప్రమాణాలను నిర్దేశిస్తున్నది.
ప్రస్తుతం వైద్య రంగంలో Patient Blood Management (PBM) విధానానికి ప్రాధాన్యం పెరుగుతున్నది. అంటే రోగికి అవసరమైనప్పుడు మాత్రమే రక్తం లేదా రక్త భాగాలను ఉపయోగించడం, అనవసరమైన ట్రాన్స్ఫ్యూజన్లను తగ్గించడం, రోగి రక్తసంబంధిత పరిస్థితిని ముందుగానే అంచనా వేసి సరైన చికిత్స అందించడం. AABB తాజా మార్గదర్శకాలు కూడా రక్త మార్పిడి నిర్ణయంలో రోగి మొత్తం క్లినికల్ పరిస్థితి, ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నాయి.
ప్లేట్లెట్ కౌంట్ తగ్గిందని వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో దాన్ని నిర్లక్ష్యం చేయడం కూడా సరికాదు. ప్లేట్లెట్లు ఎందుకు
తగ్గాయన్న కారణాన్ని గుర్తించడం, రోగి పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయడం, రక్తస్రావం ప్రమాదాన్ని పర్యవేక్షించడం, అవసరమైనప్పుడు మాత్రమే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం, అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా విధానాలను వినియోగించడం ద్వారా రోగులకు మెరుగైన వైద్య సంరక్షణ అందించవచ్చు. అంతిమంగా, ప్లేట్లెట్ కౌంట్ ఒక ముఖ్యమైన వైద్య సూచిక మాత్రమే. రోగి మొత్తం క్లినికల్ పరిస్థితి, రక్తస్రావం, వ్యాధి కారణం, ప్లేట్లెట్ల పనితీరు, అవసరమైన వైద్య ప్రక్రియ లాంటి అంశాల సమగ్ర అంచనానే సరైన చికిత్సకు మార్గం చూపుతుంది.