మెనోపాజ్ తర్వాత ఆస్టియో పొరోసిస్ ఎందుకొస్తుంది? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. కానీ, వయసు పెరిగేకొద్దీ.. నశించిపోయిన ఎముకల కణజాలం మళ్లీ భర్తీ అయ్యే ప్రక్రియ మందగిస్తూ ఉంటుంది. క్రమంగా ఎముకలు క్షయం చెందుతూ ఉంటాయి. ఆ మార్పు ఒక దశకు చేరుకున్న తర్వాతే, తమకు ఆస్టియోపొరోసిస్ ఉందనే విషయం గ్రహిస్తారు మహిళలు.
తమకు ఆస్టియోపొరోసిస్ ఉందని తెలుసుకున్న 50 శాతం మందిలో.. మెనోపాజే అందుకు ప్రధాన కారణమని తేలింది. రుతుక్రమం ఆగిపోయే దశ మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయులు తగ్గుతున్నాయడానికి ఇదో సూచన. అండాశయాలు అనేవి రుతుక్రమాన్ని ప్రేరేపించే ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎముకలు దృఢంగా ఉండటానికి సహకరిస్తుంది. ఎముకలు క్షయమయ్యే క్రమాన్ని నెమ్మదింపజేస్తుంది. ఇక ఈస్ట్రోజెన్ స్థాయులు దీర్ఘకాలంపాటు తక్కువగా ఉంటే.. ఆస్టియోపొరోసిస్ ముప్పు పెరుగుతున్నట్టు భావించాలి. పురుషులలో అతిగా మద్యం, ధూమపానం కీలక ముద్దాయిలు అయినా మహిళలకు సంబంధించి మాత్రం కుటుంబ చరిత్రనే ప్రధాన కారణంగా భావించాల్సి ఉంటుందంటారు వైద్య నిపుణులు.
లక్షణాలు- నిర్ధారణ
ఆస్టియోపొరోసిస్ ముదిరిపోయే వరకు వ్యాధి లక్షణాలు బయటపడవు. కానీ, వెన్నునొప్పి, వీపుభాగంలో ఎముకలు పెళుసుబారినట్లు అనిపించడం, మణికట్టు, తుంటిభాగాల్లో ఎముకల కూర్పులో మార్పులు, గూని.. లాంటివి ఆస్టియోపొరోసిస్‌కు హెచ్చరికలుగానే గుర్తించాలి. ఆ రుగ్మత ప్రభావాన్ని గుర్తించేందుకు సీటీ స్కాన్, మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ) చేస్తారు.
జీవనశైలి మార్పులు
అండాశయాలు ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని నిలిపివేస్తాయి కాబట్టి, మెనోపాజ్ తర్వాత ఆస్టియోపొరోసిస్ చికిత్సలో భాగంగా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ నిర్వహిస్తారు. క్యాల్షియం, విటమిన్-డి సప్లిమెంట్ల సాయంతో క్షీణిస్తున్న ఎముకల కణజాలం భర్తీ అయ్యేలా చూసుకోవచ్చు. ఈ రెండూ సమృద్ధంగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాల ఉత్పత్తులు, బాదం, సోయాపాలతో చేసే టోఫు, నారింజ రసం, తృణధాన్యాలు లాంటి వాటిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. సాల్మన్, ట్యునా, సార్డిన్ జాతుల చేపలు, గుడ్డు పచ్చసొన తింటే తగినంత విటమిన్-డి లభిస్తుంది. ఎముకలను బలోపేతం చేసే వ్యాయామాలు చేస్తూ ఉండాలి.