పేరుకు ‘నథింగ్’ అయినా.. ప్రతి ఎడిషన్‌లోనూ ‘సమ్‌థింగ్ స్పెషల్’ ఫీచర్లను జోడిస్తుంది లండన్‌కు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ. తాజాగా, తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 4(బి)ని భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. తమ బ్రాండ్ నుంచి వస్తున్న సరికొత్త బడ్జెట్/మిడ్‌రేంజ్ ‘బి’ సిరీస్‌లో ఇదే మొదటి ఫోన్ అని సంస్థ చెబుతున్నది. ఈ కొత్త ఫోన్లో అనేక అత్యాధునిక ఫీచర్లను జోడించింది. నథింగ్ ఫోన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది దాని వెనుక ఉండే ట్రాన్స్పరెంట్ డిజైన్. ఫోన్ 4(బి)లోనూ ఈ డిజైన్‌ను కొనసాగిస్తున్నది. అయితే, మునుపటి ఫోన్లలా పెద్దగా కాకుండా, వెనుక కెమెరా మాడ్యూల్ కింద ఒక సన్నని హారిజంటల్ గ్లిఫ్ బార్ లైటింగ్‌ను కొత్తగా పరిచయం చేస్తున్నది. డిస్ప్లే పరిమాణం 6.77 అంగుళాలు. ఎఫ్‌హెచ్‌డీ+ AMOLED స్క్రీన్.. 120Hz. దీంతో స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి.
ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్-4 చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. మెరుగైన ఆన్-డివైజ్ ఏఐ ఫీచర్లను సపోర్ట్ చేసేలా ఈ ప్రాసెసర్‌ను తీర్చిదిద్దారు. అన్ని మోడళ్ల మాదిరిగానే ఇందులోనూ ఫొటోగ్రఫీ కోసం అద్భుతమైన కెమెరా సెటప్ ఉన్నది. వెనుకవైపు రెండు కెమెరాలలో.. మెయిన్ కెమెరా 50 ఎంపీ కాగా, మరొకటి 8 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్. ఇక సెల్ఫీల కోసం ముందుభాగంలో 16 ఎంపీ కెమెరాను అమర్చారు. బ్యాటరీ విషయానికి వస్తే.. 6000 ఎంఏహెచ్ పెద్ద బ్యాటరీతో వస్తున్నది. ఇది 33W ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది కూడా. సరికొత్త ఆండ్రాయిడ్-16 ఆధారిత నథింగ్ ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. అనవసరమైన యాప్స్ లేని క్లీన్ సాఫ్ట్వేర్ అనుభూతిని ఇస్తుంది. బేస్ వేరియంట్లో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్; 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నది.