Nischa Shah | ఐడియా నిశ్చయం.. ఆదాయం అక్షయం
దుస్తులు అమ్మడం ద్వారా డబ్బులు సంపాదించడం ఒక పద్ధతి. వాటిని ఎలా అమ్మాలో చెబుతూ డబ్బులు సంపాదించడం రెండో పద్ధతి. ఇందులో రెండో కోవకు చెందుతుంది ముప్పై ఏండ్ల నిశ్చ షా.
Nischa Shah | దుస్తులు అమ్మడం ద్వారా డబ్బులు సంపాదించడం ఒక పద్ధతి. వాటిని ఎలా అమ్మాలో చెబుతూ డబ్బులు సంపాదించడం రెండో పద్ధతి. ఇందులో రెండో కోవకు చెందుతుంది ముప్పై ఏండ్ల నిశ్చ షా. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా వందల కోట్ల రూపాయల వ్యవహారాలు చూసిన ఆమె, ఆ తర్వాత పర్సనల్ ఫైనాన్స్ వైపు మళ్లింది. పెద్ద సంస్థలు కాదు, వ్యక్తులుగా మనం డబ్బును ఎలా పొదుపు, మదుపు, ఖర్చు చేయాలో తెలుసుకోండి… అని తన యూట్యూబ్ చానెల్ ద్వారా చెబుతున్నది. అందుకు గానూ ఆమె ఏడాదిలో సంపాదించింది ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలు.
అసలు ఇదెలా సాధ్యమైందంటే…
పర్సనల్ ఫైనాన్స్… వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ… ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్. లక్షల్లో సంపాదిస్తున్నా నెలాఖరుకి జేబులు వెతుక్కోవాల్సిన పరిస్థితి. లోన్లు ఉన్నా… ట్యాక్సులూ సగానికి పైగా తినేస్తున్న సందర్భం. మోస్తరు సంపాదన నుంచి ఆరంకెల జీతం వరకూ అందరికీ కావలసింది ఒకటే! ఉన్న డబ్బును సద్వినియోగం చేసుకోవడం ఎలా అన్నది. అందులో చేతికి వచ్చే మొదటి రూపాయి నుంచి ఖర్చయ్యే చివరి రూపాయి వరకూ అన్ని విషయాలూ ముఖ్యమే. ఆ సంగతులనే పూసగుచ్చినట్టు చెబుతూ, రూపాయి విలువను రెట్టింపు చేసే మార్గాలను చూపుతూ వీడియోలు చేస్తుంది లండన్‌లో నివసించే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ నిశ్చ షా.
ట్యాక్స్ తగ్గించి…
నిశ్చ తండ్రి వ్యాపారవేత్త. చిన్ననాటి నుంచి ఆయనతో పాటు తను కూడా ఆ మీటింగులు వింటుండేది. లెక్కలు చూస్తుండేది. అయినా చదువు మీద మక్కువ ఎక్కువ. ఫైనాన్స్, అకౌంటింగ్, మేనేజ్మెంట్లను సబ్జెక్టులతో అండర్ గ్రాడ్యుయేట్ పట్టా అందుకుంది. ఆ తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీ పూర్తి చేసింది. తనకు ఇష్టమైన బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగంలో చేరింది. అయితే తొలి నుంచీ ఆంత్రప్రెన్యూర్‌గా ఎదగాలన్న తపన ఉండటం వల్ల ఓ రెండేండ్లు ఉద్యోగం చేసి, తర్వాత సొంతంగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంది. కానీ, ఆ సబ్జెక్టుల మీద మంచి పట్టు ఉండటంతో ఒక్కో మెట్టూ ఎదుగుతూ దాదాపు తొమ్మిదేండ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసింది. మరోవైపు తల్లిదండ్రులకూ చేదోడువాదోడుగా ఉండేది. కంపెనీ లెక్కలు చూస్తుండేది. ఒకసారి అలా 44 లక్షల రూపాయల ట్యాక్స్‌ను మినహాయింపు పొందేలా చేసింది. అప్పుడే పర్సనల్ ఫైనాన్స్ వైపు తాను దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తించింది నిశ్చ.
రెండు కోట్ల జీతం…
2022లో లండన్‌లోని క్రెడిట్ అగ్రికోల్ అనే అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థలో అసోసియేట్ డైరెక్టర్ హోదాలో ఉంది నిశ్చ. అప్పటికి ఆమె జీతం ఏడాదికి రెండు కోట్ల రూపాయల పైనే. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా ఆమె సత్తా అటువంటిది. కానీ, తనకు ఇవేవీ అంత సంతృప్తిని ఇవ్వలేదంటుందామె. ‘అటు సవాలు లేదు, ఇటు మేధోపరంగా ఎదిగే అవకాశమూ లేదు. అందుకే, ఇక ఈ ఉద్యోగం చాలనిపించింది. నాకున్న బ్యాకింగ్ రంగ అనుభవంతో ఇతరులకు సహాయం చేస్తూ, నేను కూడా బతకాలి అనుకున్నా…’ అని చెబుతుంది. నిజానికి నిశ్చకు జర్నల్ (డైరీలాంటిది) రాసే అలవాటు ఉంది. ప్రతి సంవత్సరం ఆ పుస్తకం ద్వారా తన ఆదాయ వ్యయాల్ని తానే ఆడిట్ చేసుకుంటుంది. వ్యక్తిగతంగానూ విజయ పరాజయాల్ని అంచనా వేసుకుని తదుపరి ఏడాదికి కొన్ని లక్ష్యాలు పెట్టుకుని సన్నద్ధమవుతుంది. అలా ఒకసారి తాను కొనుక్కున్న ప్లానర్‌లో ‘సమయం, డబ్బు అనేవి లెక్కలోకి రాని విషయాలైతే అసలు నువ్వు ఏం చేయడానికి ఇష్టపడతావు’ అన్న ప్రశ్న ఉంది. అప్పటికే జీవితాన్ని కొత్తదారిలో కొనసాగించాలన్న ఆలోచనతో ఉన్న ఆమెకు ఇది ఒక మలుపులా పనికొచ్చింది. వెంటనే తనకు గుర్తొచ్చిన అంశం… వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ. దీని గురించి సామాజిక మాధ్యమాల ద్వారా చెబితే నలుగురికీ పనికొస్తుంది, తానూ సొంతంగా ఎదగొచ్చు అనుకుంది. అలా 2021లో ‘నిశ్చ (nischa)’ పేరిట యూట్యూబ్ చానెల్ ప్రారంభించింది. ఇందులో మరింత ముందుకు వెళ్లేందుకు తొమ్మిది నెలల ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసుకుని, 2023లో ఉద్యోగం మానేసింది. పూర్తి స్థాయి యూట్యూబర్‌గా మారింది.
నాలుగు రెట్లు…
డబ్బు కోసం వెంట పడటం కాకుండా… తనకు నచ్చిన పనిని, వచ్చిన పనిని పూర్తి సామర్థ్యంతో చేయాలి అని మొదటే అనుకుంది. కాబట్టి ఆ దారిలోనే వెళ్లింది నిశ్చ. తాను అత్యవసర నిధి కింద దాచుకున్న సొమ్మును వాడుకుంటూ వీడియోలు చేయడం ప్రారంభించింది. 1000 మంది సబ్‌స్ర్కైబర్లు రావడానికి ఆమెకు 11 నెలల సమయం పట్టింది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా తన జీవితం గురించి చెప్పిన వీడియో మాత్రం వైరల్‌గా మారింది. దీంతో అతి త్వరలోనే ఆ సంఖ్య 50 వేలకు చేరింది. ప్రస్తుతం ఆమెకు 12 లక్షల మంది దాకా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలి, ఆస్తులు ఎలా కొనుగోలు చేయాలి, ట్యాక్స్‌ల నుంచి మినహాయింపు పొందే మార్గాలేమిటిలాంటి రకరకాల విషయాలను తన వీడియోల్లో విశ్లేషణాత్మకంగా చెబుతుంది.
అంతేకాదు, ధనవంతులు అవ్వాలి అంటే మన ఆలోచనా విధానం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు.. లాంటి మానసికపరమైన అంశాలనూ చక్కగా వివరిస్తుంది. ఇందులో ముఖ్యంగా… ‘హౌ టు ఇన్వెస్ట్ యువర్ ఫస్ట్ 1000 డాలర్స్’ (మీ మొదటి వెయ్యి డాలర్లను ఎలా పెట్టుబడి పెట్టాలి), 7 ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ (అనాయాసంగా డబ్బు సంపాదించే 7 మార్గాలు), మనీ హ్యాబిట్స్ కీపింగ్ యు పూర్ (డబ్బు విషయంలో ఈ అలవాట్లు మిమ్మల్ని పేదలుగా ఉంచుతాయి) లాంటివి విపరీతంగా పాపులర్ అయ్యాయి. నిశ్చ వీడియో పెట్టిందంటే కనీసం లక్ష వ్యూస్ పక్కా! కొన్నయితే కోట్ల వ్యూస్ కొల్లగొడతాయి. దీన్నిబట్టి యూట్యూబ్ ప్రపంచంలో ఆమెకు ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. యూట్యూబ్ వీడియోలు, బ్రాండ్ కొలాబరేషన్లు, పర్సనల్ కోర్సుల ద్వారా 2023 మే నుంచి 2024 మే వరకూ ఆమె సంపాదించింది అక్షరాలా 8 కోట్ల రూపాయలు. అంటే, ఆమె బ్యాంకు ఉద్యోగానికి నాలుగు రెట్లు అన్నమాట. నమ్మకంతో ముందడుగు వేసి, వచ్చింది మాత్రమే కాదు నచ్చిందీ చేయడం విజయానికి సూత్రం అని నిశ్చ నిరూపిస్తున్నది కదూ!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

