పరాశక్తి రూప విలాసం
ప్రపంచంలోని సమస్తం ప్రకృతిలో లీనమయ్యేందుకు ప్రళయాన్ని ఆశ్రయిస్తుంది. కానీ, ఆదిశక్తి మాత్రమే మూల ప్రకృతియై ప్రళయంలోనూ చెక్కు చెదరక నిశ్చయమై ఉంటుంది. అందుకే ఆదిశక్తిని ఆరాధించడం అంటే జీవితంలోని అనిశ్చితికి స్వస్తి చెప్పి నిశ్చయగతిని పొందడమే! జీవశక్తిని ప్రపంచశక్తిగా, విశ్వశక్తిని జీవశక్తిగా పరిణమింపజేసే శక్తి ఆరాధనే నవరాత్రుల ఆంతర్యం.
ప్రపంచంలోని సమస్తం ప్రకృతిలో లీనమయ్యేందుకు ప్రళయాన్ని ఆశ్రయిస్తుంది. కానీ, ఆదిశక్తి మాత్రమే మూల ప్రకృతియై ప్రళయంలోనూ చెక్కు చెదరక నిశ్చయమై ఉంటుంది. అందుకే ఆదిశక్తిని ఆరాధించడం అంటే జీవితంలోని అనిశ్చితికి స్వస్తి చెప్పి నిశ్చయగతిని పొందడమే! జీవశక్తిని ప్రపంచశక్తిగా, విశ్వశక్తిని జీవశక్తిగా పరిణమింపజేసే శక్తి ఆరాధనే నవరాత్రుల ఆంతర్యం. ‘శక్తి’ అన్న పదం ప్రపంచంలోని అన్ని శక్తులనూ జాగృతపరుస్తుంది. సర్వం శక్తిమయం అన్న విశ్వ సత్యానికి ప్రాణం పోస్తుంది. ప్రకృతికి ప్రతీకయై మన జీవితాలతో మమేకమై అలరారుతుంది. ఆదిశక్తి ప్రాదాన్యమైన దేవీ నవరాత్రులు నవదుర్గల రూప వైశిష్ట్యాన్నీ, నైవేద్యాల కైంకర్యాన్నీ విలువలను తెలియజెప్పే విజయదశమిగా కొనసాగే దివ్య పరంపరను ప్రరేపించే వేడుకగా, ఆదిశక్తి అందించే ప్రేరణగా భావించి నవరాత్రుల దివ్యత్వాన్ని తెలుసుకుందాం… ఆ పరాశక్తి రూప విలాసాన్ని దర్శించుకుందాం..
1 మొదటి రోజు
శైలపుత్రీ నమోస్తుతే
నవరాత్రి ఉత్సవాల్లో మొదటిరోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు అమ్మవారిని ‘శైలపుత్రి’ అవతారంలో ఆరాధిస్తారు. ధ్యానం: వందే వాంఛిత చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరీం శైలపుత్రీం యశస్వినీం॥ జగత్ప్రతిష్ఠా స్వరూపిణి అయిన అమ్మవారు శైలపుత్రిగా జన్మించి, స్త్రీ శక్తికి యశోభాగ్యాన్ని కలిగించింది. ఆదిపరాశక్తి.. సతీదేవిగా యోగాగ్నిలో తనువు చాలించి మీనా, హిమవంతులకు శైలపుత్రిగా జన్మించింది. మంచిని ద్వేషించే శత్రువులను సంహరించడానికి, రుద్రుని ధనుస్సు సంధించడానికి శైలపుత్రిగా అవతరించింది.

లోకోద్ధరణ చేసే క్రమంలో పరమ శివుడితోపాటు తాను నిర్వర్తించే కర్తవ్యాన్ని తెలిసినదై సతిగా తనువు చాలించినా పార్వతియై శైలపుత్రిగా తిరిగి రూపుదాల్చి ఆదర్శంగా నిలిచింది. ఆత్మశక్తి, సంయమనశక్తి, శారీరక శక్తి, దివ్యశక్తి, ధైర్యశక్తి, సహన శక్తి వంటి అనేక శక్తుల సమన్వితగా అలరారే శైలపుత్రిని ఆరాధించిన వారికి సకల శక్తులు, యశస్సు దీవెనగా లభిస్తాయి.
నైవేద్యం: కట్టె పొంగలి
2 రెండో రోజు
చైతన్య ప్రతీక బ్రహ్మచారిణి
సకల సంసారవృక్షానికి బీజస్వరూపమై, కారుణ్యధారినియై వెలుగొందే దేవత నవరాత్రి రెండో రోజున చేతిలో కమండలంతో, నిత్య తపోముద్రాంకితగా.. బ్రహ్మచారిణిగా దర్శనమిస్తుంది. ధ్యానం: దధానాకర పద్మాభ్యా కుక్షుమాలా కమండలం దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యముత్తమా॥ శక్తికి ఆకృతి బ్రహ్మచారిణి. ఈ తల్లి నామరూప అతీత శక్తి. నిత్య తపోముద్రాంకిత. హిమాలయాల్లోని ఒక శిఖరంపై బ్రహ్మచారిణిగా నిష్ఠతో ఘోరమైన తపస్సు చేసి వరంగా శివుణ్ని వరించింది.

జీవితం అంటేనే తపస్సు. కర్తవ్య దీక్షతో, లక్ష్య సాధనతో కార్యోన్ముఖులమై తపఃఫలాన్ని పొందాలనేదే బ్రహ్మచారిణి అవతార సందేశం! ఆత్మవిశ్వాసానికీ, కృషికీ, పట్టుదలకూ సంకేతం ఆమె రూపం. కార్యకారణ భావ సంబంధమే ప్రకృతి- పురుష సమన్వయం. లోకంలో కుటుంబ వ్యవస్థ సుసంపన్నం కావాలనే ఆకాంక్ష ఈ తల్లి ఆరాధనా ఫలం. ఎంతటి కష్టం వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోరాడి గెలవాలన్నది బ్రహ్మచారిణి రూపంలోని ఆంతర్యం.
నైవేద్యం: చిత్రాన్నం
3 మూడోరోజు
శాంతి స్థాపిత చంద్రఘంటా
మనస్సంచార సంజాత, సకల లోక సౌభాగ్యభరిత, భక్తజన స్వాధీనగా ఆరాధనలు అందుకునే దుర్గాదేవి.. ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు నిత్యానందకరి అయిన చంద్రఘంటా దేవిగా దర్శనమిస్తుంది. ధ్యానం: పిండజ ప్రవరారూఢా చండకో పాస్త్రకైర్యుతా ప్రసాదం తనుతేమహ్యం చంద్రఘంటేతి విశ్రుతా॥ అమృత భరితమైన నిత్యానంద రసాపానం లేదా చంద్రకాంతి సుధాపానం చేయడం వలన మొదట ‘ఛిన్నమస్త’గా ఒక అపూర్వ అంశ రూపొందింది. ఆ మహాద్భుతమే చంద్రఘంటా దేవి దివ్యరూపం.

మనుషుల జీవిత గమ్యం మానసిక ప్రశాంతత. అందుకే ఈ తల్లి మనుషుల మనసుకు దిశా నిర్దేశం చేస్తూ ‘మనుష్య మానస్య గమ్య’ అని కీర్తనలు అందుకుంది. జీవజాతికి ప్రాణతుల్యంగా ఉంటూ దీర్ఘాయువును అనుగ్రహించే చంద్రుడు మనఃకారకుడు. శరదృతువులో అమితంగా ప్రకాశించే చంద్రకాంతి సుధాపానం చేసిన చంద్రఘంటాదేవిని ఆరాధిస్తే మనసుకు, జీవితానికి శాంతి సౌభాగ్యాలు చేకూరుతాయి.
నైవేద్యం: కొబ్బరి అన్నం లేదా కొబ్బరి పాయసం
4 నాలుగో రోజు
అశుభనాశిని కూష్మాండ
మానవాళి ఎదుర్కొనే శారీరక, మానసిక రుగ్మతలను పోగొట్టే తల్లి కూష్మాండ దుర్గ. నవరాత్రుల్లో నాలుగో నాడు అమ్మవారిని ఈ రూపంలో కొలుస్తారు. ధ్యానం: సుర సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దధాన హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుమే॥ శరదృతువు ప్రాణికోటికి క్లిష్టకాలంగా చెబుతారు. ప్రజలకు అనారోగ్యం కలిగించే ఈ మాసంలో చెడును ఎదుర్కొనే శక్తినీ, సర్వ శుభాలనూ ప్రసాదించమని ఆ దేవిని కోరుకోవాలి.

జగన్మాత కూష్మాండ దుర్గలా జగత్తును కాపాడుతుంది. దీర్ఘాయువును ప్రసాదించే అమృత కలశాన్ని చేతిలో ధరించి సదా భక్తవత్సలయై, కల్పవల్లియై అలరారుతుంది. విశ్వంలోని దుఃఖాలను పోగొట్టే సమర్థురాలిగా అపార సంసార సాగరాన్నీ తరింపజేస్తుంది. దురుతాలను దూరం చేసే ఈ కూష్మాండ దుర్గ సర్వమంగళగా కరుణిస్తుంది.
నైవేద్యం: మినప గారెలు
5 ఐదో రోజు
అమ్మ లాలిత్యమే స్కంధమాత
‘మాతృదేవోభవ’ అనే సందేశాన్నీ, అమ్మ తత్వాన్నీ మానవాళికి ప్రబోధంగా అందిస్తుంది స్కంధ మాత. పంచమి నాడు ఆదిశక్తి తల్లులకే తల్లిగా స్కంధమాతగా పూజలు అందుకుంటుంది. ధ్యానం: సింహాసన గతానిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభదాస్తు సదాదేవీ స్కంధమాతా యశస్వినీ॥ విశ్వ చైతన్యం తాలూకు వాత్సల్యం అంతా అమ్మ రూపంలోనే ఒదిగి ఉంది. అందుకే ఆనందమయిగా, అమృతమయిగా అవతరించింది స్కంధమాత.

ఆదిమాతగా కుమారస్వామిని లాలించే రూపంలో వెలుగొందే దివ్యమూర్తి స్కంధమాత చల్లని దృష్టి వైభవాన్ని ఎంత వర్ణించినా తనివి తీరదు. తన మూడోకంటితో దేన్నైనా భస్మం చేయగల శంకరుడు సైతం అమ్మ దయా పూరిత దృక్కులను చూసి తనకు ఫాలనేత్రం ఉందని మర్చిపోతాడట. ఈ అమ్మ లాలిత్యమే శాశ్వత చైతన్య ఝరి, సౌందర్యలహరి. అమ్మ భావనలోనే అమృతత్వం ఉంది. కనుక స్కంధ మాతను నిర్మలమైన మనసుతో ఆరాధించాలి.
నైవేద్యం: దద్దోజనం
6 ఆరో రోజు
కాత్యాయనీ విద్మహే
సకల జనధాత్రీ, విధాత్రీ కాత్యాయనీదేవి నవరాత్రులలో ఆరో రోజైన షష్ఠినాడు ఆరాధనలు అందుకుంటుంది. సర్వమంగళకారణీ, కీర్తి ప్రదాయనీ, మోక్షదాయినిగా కీర్తించే కాత్యాయనీదేవి జ్ఞానశక్తికి ప్రతీక. ధర్మార్థకామ మోక్షాలకూ ఈ తల్లే అధికారిణి. ఈమె లేనిదే ఏదీ లేదు. ధ్యానం: చంద్రహాసో జ్వలకరా శార్దూల వరవాహనా కాత్యాయనీ శుభం దద్యాత్ దేవీదానవ ఘాతినీ॥ శక్తి తత్వాన్ని తెలుసుకోవడం వల్ల విశ్వచైతన్య శక్తి, దుర్గాదేవి అంశలైన కాత్యాయనీ దేవి మన బుద్ధిని ప్రేరేపిస్తుంది.

సర్వ మహాపాతకాల నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది. నిజ శాశ్వత గమ్యాన్ని ప్రాణికోటికి నిర్దేశిస్తుంది. శక్తిని రెండు రకాలుగా అభివర్ణిస్తారు. సృష్టి స్థితిలయలకు కారణమైన మాయాశక్తి మొదటిది. ఈ శక్తే సకల సంసార బంధాలకూ హేతువు. అదే అవిద్య. భవసాగరం నుంచి విముక్తినిచ్చే జ్ఞానశక్తి రెండోది. మానవాళిని ఉద్ధరించే ఈ శక్తిని విద్య అంటారు. అవిద్య శక్తిని విద్యాశక్తిగా ప్రార్థించడమే మన కర్తవ్యమని చెబుతుంది కాత్యాయనీరూపం.
నైవేద్యం: కేసరిబాత్ లేదా పెసర పునుగులు
7 ఏడో రోజు
శుభధాత్రీ కాళరాత్రి
వాత్సల్య పూరిత అమృతమైన ఆదిశక్తి అఖిల బ్రహ్మండాన్నీ రక్షించడానికి దుష్టసంహారం చేసి శుభాలను కురిపించడానికి అపరకాళిగా మారింది. సప్తమినాడు దుర్గాదేవిని కాళరాత్రి అవతారంలో ఆరాధిస్తారు. దుష్టశిక్షణ- శిష్టరక్షణ పరంగా దేవదేవతలకే ప్రేరణనిచ్చే మహారూపం ఇది. ధ్యానం: ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ వామపాదోల్ల సల్లోహల తాటంక భూషణా వర్ధన్మూర్ధ ధ్వజా కృష్ణా కాళరాత్రి ర్భయంకరీ॥ విశ్వ కల్యాణం కోసం, ధర్మ పరిరక్షణ కోసం వివిధ రూపాలలో దేవీ ఆవిర్భావం జరిగింది.

ప్రపంచానికి వాటిల్లే ఉపద్రవం నుంచి మానవాళిని ఉద్ధరించడానికి నల్లనిరంగులో, అభయ హస్తంతో, లోక భీకర రూపంలో సాక్షాత్కరించింది కాళరాత్రీ దేవి. గ్రహబాధల్ని తొలగించే కాళరాత్రి మృత్యువుకే భయం కలిగిస్తుంది. ఏకవేణితో భయంకర రూపంతో దుష్టశిక్షణ చేసే శత్రునాశిని ఈమె. దుర్గుణాలనూ, దుష్టశక్తులనూ పారద్రోలి సత్కర్మలను ప్రేరేపిస్తూ మంచి బుద్ధులను వృద్ధిచేస్తూ మానవాళికి ప్రేరణనిస్తుంది.
నైవేద్యం: శాకాన్నం లేదా కలగూర పులుసు
8 ఎనిమిదో రోజు
వందే మహాగౌరి
శుభప్రదమై, జయాన్ని కలిగించే అభయపాణియై ఆదిశక్తి మహాగౌరి అవతారంలో అష్టమిరోజు విశేషంగా పూజలు అందుకుంటుంది. భయంకర కాళ స్వరూపాన్ని విడిచి అమ్మవారు ధవళకాంతితో వెలిగిపోయే స్వచ్ఛమైన శుద్ధమైన రూపంలో మహాగౌరిగా కొలువుదీరింది. ధ్యానం: శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా॥ సర్వమంగళాలకూ నెలవైన మహాగౌరి సన్నిధిలో అమంగళానికి ఆస్కారమే లేదు.

శివాత్మిక స్వరూపణియైన ఈ తల్లి భక్తుల అభీష్టాలను నెరవేర్చి భోగభాగ్యాలను అనుభవించే మంగళకర జీవితాన్ని ప్రసాదిస్తుంది. నిత్య నిర్మల స్వరూపమై విరాజిల్లే గౌరి ప్రశాంతతకు చిహ్నమైన శ్వేతవర్ణంలో పరమ శాంతి స్వరూపం తానై ఒప్పారుతుంది. సదా శుభాన్నీ ప్రసాదించమని గౌరీదేవిని ప్రార్థిస్తే తప్పక ఆశీర్వదిస్తుంది మహాగౌరి.
నైవేద్యం: చక్కరపొంగలి లేదా బెల్లం పాయసం
9 తొమ్మిదో రోజు
మోక్షప్రదాయిని సిద్ధిధాత్రి
మానవాళి సంరక్షణా భారం వహిస్తూ సర్వ ప్రాణులలోనూ చైతన్యవంతమై ప్రకాశించేదేవి నవదుర్గలలో చివరిదైన సిద్ధిధాత్రి. మహర్నవమి రోజు సిద్ధిధాత్రిని ఆదిశక్తి అంశగా కొలుస్తారు. లౌకిక చింతనతోనే జీవితం గడపక శాశ్వతమైన పారమార్థిక భావనతో జీవితగమ్యమైన మోక్షాన్ని కోరుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది సిద్ధిధాత్రి రూపం. ధ్యానం: సిద్ధగంధర్వ యక్షాద్యైః అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధ్ధిదా సిద్ధిదాయినీ॥ భౌతిక జీవితంలో మనుషులకు కావలసిన సర్వసిద్ధులనూ అనుగ్రహించే సిద్ధిధాత్రి అమ్మవారు అద్వైత సిద్ధికి ప్రేరణ.

అమరత్వాన్ని పొందడానికి ఆశీస్సులు అందిస్తుంది. ఈ తల్లి అచల అప్రమేయతత్వం అత్యద్భుతం. అలౌకిక భావనాతుల్యం. దేవదేవతలందరితో పూజలు అందుకునే సిద్ధిధాత్రీ దేవిని ఏ కోరికలతో ఆరాధించినా సిద్ధింపజేస్తుంది. అభిమాన అహంకారాలను వదిలి శుద్ధమైన అంతరంగంలో ఈ దేవిని స్తుతించాలి.
నైవేద్యం: క్షీరాన్నం
10 పదోరోజు
అపరాజిత శ్రీ రాజరాజేశ్వరీ
నవరాత్రుల్లో విశేష రూపాల్లో దర్శనం ఇచ్చే అమ్మవారు విజయదశమి నాడు శ్రీరాజరాజేశ్వరీదేవిగా అవతరిస్తుంది, అపరాజితలా దీవిస్తుంది. ధ్యానం: యాదేవీ సర్వభూలేషు చేతనేత్యభిదీయతే నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమాః॥ సర్వభూత ప్రభంజని అయిన ఆదిశక్తి మూర్తీభవించిన జ్ఞానం, చైతన్యం, నవదుర్గల ఆంతర్యాన్నంతా తనలో ఇమడ్చుకున్న శ్రీరాజరాజేశ్వరిని దసరానాడు పూజించినవారికి చల్లని దీవెనల రూపంలో ఆనందవృష్టిని కురిపిస్తుందీ అమ్మ.

భారతీయుల ఆరాధ్య దేవత అమ్మవారు. ఆదిపరాశక్తి అవతార విశేషం అత్యద్భుతం. అవతార విశేషాల వర్ణం అద్వైతం, ఆనందకరం, అలౌకికం, శమశమయతే పాపం అంటూ జమ్మిచెట్టును పూజించి శ్రీరాజరాజేశ్వరీదేవిని సహృదయ భావంతో దసరానాడు ఆరాధించాలి. ఆశీస్సులు అందుకోవాలి.
నైవేద్యం: పులిహోర, లడ్డూలు
…? డా॥ ఇట్టేడు అర్కనందనాదేవి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

