మ్యారేజ్…! మనిషి జీవితంలో ఓ టర్నింగ్ పాయింట్! నిండు నూరేళ్ల జీవితాన్ని కొత్త వ్యక్తితో కలిసి పంచుకోవడానికి వివాహ బంధంలోకి అడుగుపెట్టడం.. బ్యాచిలర్ లైఫ్ నుంచి కపుల్ లైఫ్‌లోకి మారడం.. పెద్దల ఆశీర్వాదాలు, సన్నిహితుల శుభాకాంక్షల మధ్య ఆ మధుర క్షణాలను ఆస్వాదించడం.. లైఫ్ జర్నీలోనే ఓ అద్భుతమైన సీన్! మనోఫలకం నుంచి ఎన్నటికీ చెరిపివేసుకోలేని ఓ అందమైన దృశ్య కావ్యం.
పెళ్లంటే.. పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. మూడే ముడులు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసి నూరేళ్లూ.. అంటూ నవ దంపతులు మురిసిపోతుంటారు. ఆ శుభదినాన్ని కునులపండువగా, గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని ముచ్చటపడుతుంటారు. నిజానికి, పెండ్లంటే.. రిసెప్షన్లు.. విందు భోజనాలతో ఘనంగా సెలబ్రేట్ చేసుకునే వేడుక మాత్రమే కాదు; దాంపత్య బంధంలోని ఔన్నత్యాన్ని, కుటుంబ సంబంధాల్లోని గాఢతను కాపాడుతామంటూ బంధు, మిత్రుల సమక్షంలో చేసే ప్రతిజ్ఞ! ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని ఒడుదొడుకులొచ్చినా.. ఒకరికొకరు తోడు-నీడగా ఉంటామని, ఏ సంతోషాన్నైనా, ఏ కష్టాన్నైనా జంటగానే కలిసి పంచుకుంటామని చేసుకునే ప్రామిస్! అందుకే మనిషి జీవితంలో పెండ్లి ఒక కీలక ఘట్టం. మరింత ఉజ్వలమైన భవిష్యత్ కోసం జంటగా వేస్తున్న తొలి అడుగు.
కొత్త జీవితానికే కాదు; తనదైన కుటుంబానికి సైతం పునాది పడేదీ వైవాహిక బంధంతోనే! అలా ఏర్పడ్డ కుటుంబాలే సమాజానికి మూల స్తంభాలు. సామాజిక సంబంధాల అల్లికలో దాంపత్య బంధానిదే విశిష్ఠ పాత్ర. అరమరికలు లేని, క్రమశిక్షణ తప్పని అన్యోన్య దాంపత్యమే కుటుంబాన్ని సుదృఢంగా
నిలబెడుతుంది. వివాహ బంధం ద్వారా ఏర్పడ్డ కుటుంబమే మన గుర్తింపు. అదే మన గౌరవం.
మన వంశకీర్తి. మన పురోగమనానికి ఆధారమూ అదే, శక్తీ అదే. అందులోంచి విడిపోతే మన జీవితం దారం తెగిన గాలిపటమే!
దురదృష్టవశాత్తు, ఇటీవల కొందరు వ్యవహరిస్తున్న తీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టాలంటేనే భయపడే పరిస్థితులను సృష్టిస్తున్నది. ఒకరితో లవ్‌ట్రాక్ నడుపుతూనే, మరొకరిని పెండ్లి చేసుకోవడం.. ఆ తరువాత మనసు పడ్డ వారి కోసం మనువాడిన వారిని మట్టుబెడుతున్న తీరు కలవరపెట్టడమే కాకుండా, వివాహ వ్యవస్థకే మచ్చ తెస్తున్నది. ఇలాంటి వ్యవహారాల్లో ఒకప్పుడు మహిళలే బాధితులుగా మారితే, ఇప్పుడు పురుషులు కూడా మర్డరై పోతుండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది. మరోవైపు, విడాకుల సంఖ్య పెరగడమూ ఆందోళన కలిగిస్తున్నది. ఏ రెండు మూడేండ్ల క్రితమో పెండ్లయిన వారే కాకుండా, పదేండ్లు, ఇరవై ఏండ్లు పైబడి కాపురాలు చేసినవారు, అన్యోన్య దంపతులుగా కనిపించినవారు కూడా విడాకులకు సిద్ధమవుతున్న తీరు వివాహ వ్యవస్థకే సవాలు విసురుతున్నది.
ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ, సామాజిక బంధాల అల్లికలో గురుతర బాధ్యత నిర్వర్తిస్తూ, కుటుంబానికి మూలస్తంభాలుగా నిలుస్తున్న దంపతులను, వారిని ఒక్కటిగా నిలుపుతున్న వివాహ వ్యవస్థను గౌరవించుకోవాలన్న భావన నుంచి వచ్చిందే ప్రపంచ వివాహ దినోత్సవం! ఏటా ఫిబ్రవరి రెండో ఆదివారం ‘వరల్డ్ మ్యారేజ్ డే’గా పాటిస్తున్నారు. అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ‘వరల్డ్‌వైడ్ మ్యారేజ్ ఎన్కౌంటర్’ అనే సంస్థ 1981లో వేసిన తొలి అడుగులను స్ఫూర్తిగా తీసుకొని, 1983 నుంచి వరల్డ్ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. పెండ్లి అనే బంధంతో రెండు హృదయాలను ముడివేసుకుని, దాంపత్య బంధంలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ, కుటుంబ సంబంధాల్లోని ఆప్యాయతలు, సమష్టితత్వంలోని ఆనందాన్ని పంచిపెడుతున్న అనంతకోటి దంపతులకు శతకోటి వందనాలు.
-కందిబండ కృష్ణప్రసాద్