కేరళకు చెందిన 19 ఏండ్ల కాజియా లిజ్ మెజో.. ‘మిస్ యూనివర్స్- ఇండియా 2026’ కిరీటంతో పాటు యావత్ భారతీయుల హృదయాలనూ గెలుచుకున్నది. జైపూర్‌లో ఇటీవలే ముగిసిన ఫైనల్స్‌లో.. 52 మంది పోటీ దారులను వెనక్కి నెట్టి, టైటిల్‌ను కైవసం చేసుకున్నది. ఈ క్రమంలో ‘75వ మిస్ యూనివర్స్’ పోటీల్లో.. భారత్ తరఫున పాల్గొనే అవకాశం దక్కించుకున్నది. దాంతో, నిన్నటి దాకా ఎవరికీ పెద్దగా పరిచయం లేని ఈ అమ్మాయి.. ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నది. ఆమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతుండగా.. ‘కాజియా’ పేరు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నది.
కేరళలోని మావేలిక్కర పట్టణం.. కాజియా లిజ్ మెజో సొంతూరు. అయితే, ఈమె బాల్యమంతా యూఏఈలోని అబుదాబిలో గడిచింది. ఎమిరేట్స్ నేషనల్ స్కూల్, సెయింట్ జోసెఫ్స్ స్కూల్, అబుదాబి ఇండియన్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసింది. ప్రస్తుతం న్యాయ విద్యను అభ్యసిస్తున్నది. మరోవైపు మోడల్‌గానూ రాణిస్తున్నది. తాజాగా మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం గెలవడంతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.
అందాల పోటీల్లో టైటిల్ గెలవడం కాజియాకు ఇది మొదటిసారేం కాదు. 17 ఏండ్లకే ‘మిస్ టీన్ దివా 2024’ టైటిల్‌ను అందుకున్నది. ఆ తర్వాత ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్-2025’లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఈ పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గానూ నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో ‘మిస్ యూనివర్స్ కేరళ 2026’ టైటిల్ అందుకొని.. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలుగానూ రికార్డు సృష్టించింది. అంతేకాదు.. మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి మలయాళీగానూ ఆమె సరికొత్త గుర్తింపు సాధించింది.
అందాల పోటీలతోపాటు అనేక రంగాల్లోనూ కాజియాకు ప్రావీణ్యం ఉంది. 12 ఏండ్ల పాటు శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందింది. పాటలు పాడటంతోపాటు డ్రమ్స్, వయోలిన్ కూడా అద్భుతంగా వాయిస్తుంది. అలాగే పబ్లిక్ స్పీకింగ్, నటనలోనూ కాజియాకు ప్రవేశం ఉంది. మలయాళ చిత్రం ‘షైలాక్’ ద్వారా నటిగానూ తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం ‘మిస్ యూనివర్స్-ఇండియా 2026’గా నిలిచిన కాజియా ముందు మరో కీలకమైన బాధ్యత కూడా ఉంది. నవంబర్‌లో ప్యూర్టోరికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నది. ఆ పోటీల్లోనూ విజయం సాధించి.. విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకోవాలని మనమూ ఆశిద్దాం! ఆల్ ద బెస్ట్ కాజియా!