Cloud Tailor | లాక్డౌన్ సమయం. బయటికి వెళ్లలేని పరిస్థితి. సుస్మిత నిండు గర్భిణి. తన అవసరానికి తగినట్టు దుస్తులు కుట్టేందుకు ఆన్లైన్లో ఒక్క టైలర్ కూడా దొరకలేదు. ఆ సంఘటన ఆమెను విస్మయానికి గురిచేసింది. ప్రతి సమస్యలోనూ ఓ పరిష్కారం ఉన్నట్టే.. సుస్మిత ఎదుర్కొన్న ఇబ్బంది నుంచీ ఓ బిజినెస్ ఐడియా ప్రాణంపోసుకుంది. ‘క్లౌడ్ టైలర్’ పురుడుపోసుకుంది. రెండేండ్లలో సంస్థ ప్రపంచమంతా విస్తరించింది.
సుస్మిత లక్కాకుల.. అచ్చమైన హైదరాబాదీ ఆంత్రప్రెన్యూర్. తను ఇక్కడే చదువుకుంది. నాన్న బాలకృష్ణ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. పీజీ చేస్తున్నప్పుడే విప్రోలో ఉద్యోగం వచ్చింది. బెంగళూరులో పోస్టింగ్. ఆ తర్వాత క్వాంటమ్, డెల్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసింది. అప్పటి వరకూ ఆమె జీవితం వేరు. ఆ తర్వాత వేరు. కరోనా.. ఆ ఐటీ ఉద్యోగిలోని ఆంత్రప్రెన్యూర్ను బయటికి తెచ్చింది. లాక్డౌన్ కారణంగా ఆమె కుటుంబమంతా హైదరాబాద్ వచ్చేసింది. ఆ సమయంలో సుస్మిత నిండు గర్భిణి. కరోనా భయంతో కాలు బయటపెట్టలేని పరిస్థితి. ప్రెగ్నెన్సీ కారణంగా బరువు పెరగడంతో తనకు అనువుగా ఉండే డ్రెస్సులు కుట్టించుకోవాలని చాలా ప్రయత్నించింది. ఎక్కడికి వెళ్లినా నిరాశే. పనితనం బావుంటే సమయానికి ఇవ్వరు. సమయానికి ఇస్తే కుట్టు నాసిరకంగా ఉంటుంది. ఆ చేదు అనుభవంలోంచి ‘క్లౌడ్ టైలర్’ ప్రాణంపోసుకుంది. ఇదొక ఆన్లైన్ దర్జీ దుకాణం.
టైలర్ దగ్గర ఓ డ్రెస్ కుట్టించుకోవడం అంటే ఒక యజ్ఞమే. మరుసటి రోజునుంచి వెంటపడుతూనే ఉండాలి. సమయానికి అందుతాయన్న గ్యారెంటీ లేదు. కొందరికి మనం చెప్పిన డిజైన్లు నచ్చవు. వాళ్లు కుట్టినట్లే వేసుకోవాలి. క్లౌడ్ టైలర్లో ఇలాంటి సమస్యలేం ఉండవు. నచ్చిన వస్త్రాన్ని ఆన్లైన్లో కొనుగోలు చేసి, క్లౌడ్ టైలర్ యాప్‌ను సంప్రదిస్తే చాలు. ఆ వస్త్రం నేరుగా కంపెనీకి వెళ్తుంది. ఒకవేళ మీరు ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసినా.. క్లౌడ్ టైలర్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని సంప్రదిస్తే.. దగ్గర్లోని లేడీ టైలర్ వచ్చి కొలతలు తీసుకుని వెళ్తారు. లేదంటే, ఆ పని కూడా ఆన్లైన్లోనే పూర్తి చేస్తారు. డ్రెస్ సిద్ధం కాగానే మీ చిరునామాకు డెలివరీ చేస్తారు. ప్రతి దశలో ఏం జరుగుతున్నదీ యాప్‌లో చూసుకోవచ్చు. బిడ్డ పుట్టే
వరకూ తన ఐడియాను పక్కనపెట్టింది సుస్మిత. తర్వాత నెలల బిడ్డను చంకన వేసుకొని.. బంధువులు, స్నేహితుల ఇండ్లకు వెళ్లింది. తన ఆలోచన చెప్పింది. వారినే మొదటి కస్టమర్లుగా భావించింది. చుట్టుపక్కల అపార్ట్మెంట్లలో డెమో ఇచ్చింది. భర్త పార్కింగ్‌లో బిడ్డను ఆడిస్తుంటే.. తను ఫ్లోర్లన్నీ తిరిగి కొలతలు తీసుకునేది. మధ్యతరగతి ప్రజలనే లక్ష్యం చేసుకున్నది. అంతలోనే సుస్మిత కరోనా బారినపడింది. కొవిడ్ చికిత్స తీసుకుంటూనే.. కస్టమర్లను పెంచుకోవడంపై దృష్టిపెట్టింది. ఆరోగ్యం కుదుటబడిన తర్వాత బంజారాహిల్స్‌లో ఆఫీస్ అద్దెకు తీసుకొని వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నది. సుస్మిత భర్త రుద్రప్రతాప్ కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి, క్లౌడ్ టైలర్లో జీవిత భాగస్వామికి చేదోడుగా ఉంటున్నాడు.
హైదరాబాద్ కేంద్రంగా పురుడుపోసుకున్న క్లౌడ్ టైలర్ దేశ, విదేశాల్లో సేవలు అందిస్తున్నది. ఢిల్లీ, తమిళనాడు, బిహార్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర వంటి 10 రాష్ట్రాల్లోని 20 నగరాలకు చేరుకున్నది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి విదేశాల్లో సైతం క్లౌడ్ టైలర్ సేవలు అందుతున్నాయి. ఈ యాప్ ద్వారా సేవలు పొందినవారు సుస్మిత ఆలోచన నచ్చి ఇన్వెస్టర్లుగా మారారు. త్వరలోనే తన క్లౌడ్ టైలర్ యాప్ నుంచి 60వేల మోడళ్లలో ఫ్యాబ్రిక్‌ను విక్రయించనున్నారామె. దీనివల్ల కస్టమర్లకు మరింత వెసులుబాటు ఉంటుంది. క్లౌడ్ టైలర్ మొదలై.. రెండేండ్లే అయినా ఇప్పటికే 30వేలకు పైగా ఆన్లైన్ ఆర్డర్లు తీసుకుంది. హైదరాబాద్ కేంద్రంగా నాలుగుచోట్ల క్లాత్
రిసీవింగ్ సెంటర్లు ఏర్పాటుచేశారు. క్లౌడ్ సేవలు అందుతున్న అన్ని రాష్ట్రాల్లోనూ ఫ్యాషన్ డిజైనింగ్‌లో పీజీ, డిగ్రీ చేసిన డిజైనర్లు అందుబాటులో ఉన్నారు. క్లాత్‌ను ఏ డిజైనర్ డిజైన్ చేశారు? ఏ మాస్టర్ కుట్టారు? ఎంత సమయం పట్టింది? అనే విషయాలు సైతం తెలుసుకోవచ్చు. సంస్థలో పనిచేస్తున్న వారందరికీ గౌరవ వేతనం ఇస్తున్నారు. ఆరోగ్య బీమా సౌకర్యం కూడా కల్పించారు సుస్మిత. సగటున ప్రతి ఒక్కరూ నెలకు రూ.20వేలకు పైగానే సంపాదిస్తున్నారు. ప్రస్తుతానికి 20 మంది ఫ్యాషన్ డిజైనర్లు, పదిహేను మంది మాస్టర్లు, యాభైమంది టైలర్లు, పాతిక మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు.. మరో పాతిక మంది మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పనిచేస్తున్నారు. వీరిలో 50 మందికిపైగా మహిళలే. ‘సంస్థ విజయంలో ప్రతి ఉద్యోగి భాగస్వామ్యమూ ఉంది. దర్జీ పనిలోని దర్జాను ఇలా ప్రపంచానికి చాటుతున్నాం’ అంటున్నారు సుస్మిత.
కస్టమర్లు ఎక్కడినుంచి అయినా ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు. ఫ్యామిలీ మొత్తానికి ఒకే రకమైన డ్రెస్‌లు కావాలన్నా కుట్టిస్తాం. మా విజయానికి గుర్తుగా.. ఐఆర్ఈసీ-2022 అవార్డు, డీటుసీ నుంచి బెస్ట్ ఆంత్రప్రెన్యూర్ పురస్కారం దక్కాయి. ప్రముఖ షాపింగ్ మాల్స్‌లోనూ మా క్లౌడ్ టైలర్ సేవలు అందుబాటులో ఉన్నాయి – సుస్మిత
… డప్పు రవి
ఫొటోలు : ఎం.గోపీకృష్ణ
“కనుమరుగవుతున్న ఖానా వస్త్రాన్ని కాపాడుతున్న 79 ఏండ్ల వృద్ధురాలు.. ఏం చేస్తుందామె”