The Other Side | ఇండ్లల్లో వంట చేసేవారిలో మహిళలే ఎక్కువ! కానీ బయట ఫుడ్ ఇండస్ట్రీలో మాత్రం పురుషుల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది. టీ మాస్టర్ నుంచి బిర్యానీ మేకర్వరకు సింహభాగం వాళ్లే ఉంటారు. అందుకే ఈ రంగంలో అరుదుగా కనిపించే మహిళా పాకప్రవీణుల సంగతులు రికార్డు చేయాలనుకున్నారు అనూష డిడిగె. ముఖ్యంగా దక్షిణభారత దేశంలోని ఫుడ్ అండ్ బేవరేజెస్ పరిశ్రమతో ముడిపడి ఉన్న మహిళల జీవితాలను డాక్యుమెంట్ చేయాలని భావించారామె.
దీనికోసం బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్, పుదుచ్చేరి తదితర ప్రాంతాలన్నీ తిరిగారు. అక్కడి హోటల్స్‌లో పనిచేసే మహిళలను పలకరించారు. ఈ విషయాలన్నిటినీ సేకరించి కరోనా సమయంలో ‘ది అదర్ సైడ్’ పేరుతో డాక్యుమెంటరీ చిత్రీకరించారు. ఎందరి జీవితాలకో ఆమె ఒక రూపం ఇచ్చారు. వీరిలో ఓ కాలేజ్ క్యాంటీన్లో పనిచేసే మహిళ, మెక్సికన్ రెస్టారెంట్ షెఫ్, బ్రెడ్ పకోడా వేసే ఆంటీ… ఇలా భిన్నమైన వ్యక్తుల జీవితాలను చిత్రించారు. ‘ది అదర్ సైడ్’ మంచి పేరు సాధించడంతో, రాబోయే రోజుల్లో సంగీత పరిశ్రమపై మరో డాక్యుమెంటరీ రూపొందించే లక్ష్యంతో ఉన్నారు అనూష.