భార్యభర్తల బంధానికి గౌరవం, ప్రేమ పునాదుల్లాంటివి. అయితే కొన్నిసార్లు భాగస్వామి మనకు మొదటి ప్రాధాన్యమివ్వకుండా కేవలం ఒక ఆప్షన్‌గా మాత్రమే చూస్తున్నారని బాధపడుతుంటాం. దంపతుల మధ్య ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు తీవ్రమైన మానసిక వేదన, ఆందోళన కలగడం సహజం. తమ బంధం అసలు ఏ దిశగా వెళ్తున్నది?
భాగస్వామి మనసులో ఏముంది? అనే గందరగోళం ఏర్పడుతుంది. మీ బంధంలోనూ ఇలాంటి సందిగ్ధత నెలకొంటే.. కార్లిటీ తెచ్చుకోవడానికి కొన్ని సంకేతాలు సాయపడతాయి.
కమ్యూనికేషన్ లోపం: బంధం బలంగా ఉండాలంటే ఇద్దరి వైపు నుంచి ప్రయత్నం ఉండాలి. కానీ, ఒక్కరే మెసేజ్ చేయడం, కాల్ చేయడం లేదా కలవడానికి ప్లాన్ చేయడం లాంటి బాధ్యతలు తీసుకుంటుంటే అది ప్రమాదకర సంకేతం. ఒకవేళ మీరు కాల్స్, మెసేజ్ చేయడం ఆపేసినప్పుడు, అవతలి వ్యక్తి రోజుల తరబడి స్పందించకపోతే.. వారి ప్రవర్తనలో ఆసక్తి లోపించిందని, మిమ్మల్ని ఒక ఆప్షన్‌గా మాత్రమే చూస్తున్నారని అర్థం.
చివరి నిమిషంలో: మీ భాగస్వామి ఎప్పుడూ చివరి నిమిషంలోనే మిమ్మల్ని కలవడానికి ప్లాన్ చేస్తున్నారని అంటే.. వేరే ప్లాన్స్ క్యాన్సిల్ అయినప్పుడు లేదా అంతకంటే మంచి ఆప్షన్ దొరకనప్పుడు మాత్రమే మిమ్మల్ని గుర్తుచేసుకుంటున్నారని అర్థం. మిమ్మల్ని ఒక ఆప్షన్‌గా భావించేవారు వారి ఫ్యూచర్ ప్లాన్స్‌లో మీకు ఎప్పటికీ ప్రాధాన్యం ఇవ్వరు.
అబద్ధాలు చెబుతూ: వారికి అవసరమైనప్పుడు మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. కానీ, మీకు వారి అవసరం ఉన్నప్పుడు మాత్రం వారి దగ్గర వంద అబద్ధాలు సిద్ధంగా ఉంటాయి. భార్యాభర్తల బంధంలో ఇలాంటి నిర్లక్ష్యం తీవ్ర నిరాశను మిగుల్చుతుంది. ‘నేను చాలా బిజీగా ఉన్నాను’, ‘మర్చిపోయాను’ అనే సాకులు తరచూ వినబడుతుంటే మీరు వాళ్లకి కేవలం ఒక ఆప్షన్ మాత్రమే అని గ్రహించాలి.
నమ్మకం లేకుంటే: కాలం గడిచినా మీ భాగస్వామి బంధం పట్ల పూర్తి నమ్మకంతో లేకపోతే, తను ఇతర ఆప్షన్ల కోసం చూస్తున్నట్లుగా అర్థం. అందులో భాగంగానే మిమ్మల్ని తన స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు పరిచయం చేయడానికి వెనుకాడుతుంటారు. ఇలాంటి సమయంలో ఒత్తిడి చేయకుండా, తనతో నేరుగా మాట్లాడండి. ఇద్దరి ఆలోచనలు, భవిష్యత్తు లక్ష్యాలు కలవకపోతే, భావోద్వేగాల్ని గౌరవిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిది.