e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home చింతన అజ ముఖం - అంతరార్థం

అజ ముఖం – అంతరార్థం

అజ ముఖం - అంతరార్థం

‘అజ’ శబ్దానికి పరబ్రహ్మ, మేక లేక గొర్రె’ అని అర్థం. అజ ముఖమనగా బ్రహ్మదృష్టి- జ్ఞానదృష్టితో సృష్టిని పరబ్రహ్మమయంగా దర్శించడం. జ్ఞానదాత అయిన మహేశ్వరుడు దక్షునికి అజ-బ్రహ్మ దృష్టి అనుగ్రహించాడని పరమార్థం!

తే. ‘నిర్వికార! నిరంజన! నిష్కలంక!
నిరతిశయ! నిష్క్రియారంభ! నిర్మలాత్మ!
విశ్వ సంబోధ్య! నిరవద్య! వేద వేద్య!
ప్రవిమలానంద! సంసార భయ విదూర!’-

- Advertisement -

శ్లో. యస్తే దదాతి రవ మస్య వరం దదాసి
యోవా మదం వహతి తస్య దమం విధత్సే
ఇత్యక్షర ద్వయ విపర్యయ కేళి శీల
కిం నామ కుర్వతి నమో న మనః కరోషి.

‘స్తుతి కుసుమాంజలి:’ అనే స్తోత్రగ్రంథంలో ‘జగద్ధర భట్టు’ అనే మహాభక్తుడు ‘శంభో! శంకరా! భూతేశా! భక్త వరదా! నీకు ‘రవం’ (ధ్వని) ఇచ్చేవాడికి- అనగా నిన్ను భక్తితో శబ్దరూపంగా స్తుతించేవాడికి నీవు దానిని (రవం-ని) విపర్యయం- తారుమారు చేసి ‘వరం’ ఇస్తావు. ఏ మూర్ఖుడు అహంకరించి నీ యెడల ‘మదం’ వహించి హుంకరిస్తాడో, వానిని నీవు ‘దమం’ (ఇంద్రియ నిగ్రహం) చేత నిగ్రహించి- దండించి దారికి తెస్తావు. ఓ దక్ష యజ్ఞ విధ్వంసకా! ఇలా రెండక్షరాల శబ్దాలలో వర్ణాలను (అక్షరాలను) వ్యత్యయం- ఇటు అటు చేసి చూసే ఆట అంటే నీకు చాలా ఇష్టమని నాకు స్పష్టమవుతోంది. అలాంటప్పుడు, నేను నీకు నిత్యమూ, నిరంతరమూ నిశితమైన శ్రద్ధాభక్తులతో ‘శివాయ నమః నమ శ్శివాయ’ అంటూ నమస్కరిస్తున్నా కూడా, ఓ నాగభూషణా! భవార్ణవ శోషణా! వర్ణ విపర్యయ కేళీ లోలుడవైన నీవు నాయందు జాలి పూని నీ మనః- మనస్సును (‘నమః’ తారుమారైతే ‘మనః’) నావైపు ఎందుకు మళ్లించవు? అనగా, నాయందు దయ ఎందుకు చూపవు?’ అని తన భక్తిని సరస చతురతతో చమత్కరించి చాటుకుంటాడు.

నిటలాక్షుడు- ముక్కంటి నిగ్రహ అనుగ్రహ సమర్థుడు. ఆయన అనుగ్రహం పొందిన దక్షుడు అబ్జయోని- బ్రహ్మదేవుని ఆదేశం మేరకు అర్ధాంతరంగా- మధ్యలోనే, ఆగిపోయిన యజ్ఞాన్ని పూరించడానికి పూనుకొన్నాడు. వెంటనే పరాత్పరుడు, పద్మావరుడు, అఖిల లోక గురుడు, యజ్ఞేశ్వరుడు, మహావిష్ణువు గరుడారూఢుడై పూచిన (కర్ణికారం) కొండగోగు చెట్టువలె చూడముచ్చటైన దివ్యసుందర విగ్రహంతో అచ్చటికి విచ్చేశాడు. వినీల నీరద కాంతితో కనువిందు చేస్తున్న ‘అవికారాయ శుద్ధాయ’- వికార దూరుడైన విష్ణుమూర్తిని వీక్షించి విరించి- బ్రహ్మ, విరూపాక్షుడు- శివుడు, వృత్రహంత- ఇంద్రుడు, మొదలైన విబుధ వరులంతా తటాలున లేచి వాలిన భక్తితో అనంత దయాసాగరునికి సాదర నమస్కారాలు సమర్పించారు. వివిధ విధాల వినుతించారు. బ్రహ్మదేవుడు ఇలా స్తుతించాడు-

‘యజ్ఞ నారాయణా! నీవు నిర్వికారుడవు- పరిణామ (మార్పు) రహితుడవు; నిరంజనుడవు- (అంజనమనగా కాటుక, మాయకు సంకేతం) మాయ అంటని వాడవు; నిష్కలంకుడవు- ఏ విధమైన దుర్లక్షణాలు, అపవాదాలు లేనివాడవు; నిరతిశయ- నీకు సాటి లేనప్పుడు నీకంటే మేటి ఎలా ఉండగలడు?; నిష్క్రియారంభ- ఎలాంటి కర్మలు లేని కేవల జ్ఞాన స్వరూపుడవు; నిర్మలాత్మ- శుద్ధ సత్తగుణ పూర్ణ ఆత్మ స్వరూపుడవు; విశ్వ సంబోధ్య- వ్యక్తమైన విశ్వం చేతనే చక్కగా తెలియబడేవాడవు; నిరవద్య- దోషరహితుడవు; వేద వేద్య- వేదమంత్రములచే మాత్రమే తెల్సుకోదగినవాడవు; ప్రవిమలానంద- విషయరహిత ఆనంద స్వరూపుడవు; సంసార భయ విదూర- భక్తుల భవబంధాలను భంజించే- పటాపంచలు చేసేవాడవు’. అమూలకమైన ఈ ‘తేటగీతి’ పద్యం మూలశ్లోక భావానుకూలంగా, సాక్షాత్కరించిన సత్య సనాతనుడైన పరమాత్మ తత్తాన్ని పరమేష్ఠి- బ్రహ్మ, ద్వారా పండిత కవి పోతన నిత్యనూతన విధంగా తేటతెల్లం చేస్తూ తెనిగించిన ‘నామ గీతిక’.

ప్రసన్నుడైన పుండరీకాక్షుడు యజ్ఞాన్ని పూర్తి చేయించి దక్షునికి ఇలా ప్రబోధించాడు- ‘పుణ్యాత్ముడా! త్రిమూర్తులమైన మేము ఈ మూడు లోకాలకు ఏకైక కారణ స్వరూపులం. నేనే బ్రహ్మను, నేనే శివుడను. మానవుడు తన అవయవాలను తనకంటే వేరుగా భావించడు కదా! హరి, హర, హిరణ్యగర్భులమైన మా ముగ్గురనూ వేరుగా చూడనివాడు ధన్యుడు’. అవబృథ స్నానంతో పవిత్రుడై యజ్ఞఫలాన్ని పరిపూర్ణంగా పొందిన దక్షుణ్ణి ‘ధర్మబుద్ధితో సుఖంగా జీవించ’ మని ఆశీర్వదించి త్రిమూర్తులు, సురులు, భూసురులు తమ తమ మందిరాలకు వెళ్లారు. అనంతర కాలంలో దాక్షాయణి మేనకా- హిమవంత దంపతులకు దుహిత- ‘పార్వతి’గా పుట్టి పరితపించి పరమేశ్వరుని పతిగా పొందింది. ఇలా కథ సుఖాంతమైంది.

ఇక, ఈ అర్థవాద కథకి అంతరార్థం- ‘అజ’ శబ్దానికి పరబ్రహ్మ, మేక లేక గొర్రె’ అని అర్థం. అజ ముఖమనగా బ్రహ్మదృష్టి- జ్ఞానదృష్టితో సృష్టిని పరబ్రహ్మమయంగా దర్శించడం. జ్ఞానదాత అయిన మహేశ్వరుడు దక్షునికి అజ-బ్రహ్మ దృష్టి అనుగ్రహించాడని పరమార్థం! జ్ఞాన రహితమైన కేవల కర్మకాండ- కర్మ జాడ్యం మానవుని ఉద్ధరించలేదని సిద్ధాంతం. కర్మ తప్ప జ్ఞానమనే గంధం- వాసన, కూడా లేని వారంతా దక్షులే అని భాగవత పురాణ హృదయం. తమ మూఢత్వాన్నే పొరబాటు పడి ప్రౌఢత్వంగా భావించి విర్రవీగే కుహనా మేధావులకు, పండితమ్మన్యులకు ప్రతినిధి స్వరూపుడే దక్షుడు. భాగవతంలో అనన్య భక్తి అంటే ఒక దేవుణ్ణే భజించి- పురస్కరించి, ఇతర దేవుళ్లను పూజించ తిరస్కరించమని కాదు. అనేకత్వంలో ఏకత్వం, ఏకత్వంలో అనేకత్వం- ఈ అనుభూతిని అంది పుచ్చుకొని ఆనందించడమే అనన్య భక్తి.

అందరిలో అనంతుని- అచ్యుతుని అవలోకించే- చూచేవాడే ఉచ్చతమ వైష్ణవుడు! శివుడు సృష్టిలోనే ప్రథమ వైష్ణవుడు! దక్షుడు శివకేశవులలో భేదం చూచాడు. తత్ఫలంగా తల తెగిపోయింది. మేక తల దాపురించింది. మేక తల ఎప్పుడూ అధోముఖంగా- క్రిందిచూపుగానే ఉంటుంది కదా! ఇకముందు ఎప్పుడూ అహంకారంతో తల ఎగరేయకుండా వినయ విధేయతలు నేర్పారని కూడా అంతరార్థం! దక్షుడనగా జీవుడు, అవిద్యా పాశబద్ధుడు. సకల పాశ విముక్తుడు సదాశివుడు, సద్గురుమూర్తి, దక్షిణామూర్తి. అభవ (శివ) నిందకుడు అనంతర జన్మలో అజం (మేక, గొర్రె) గా జన్మిస్తాడని కూడా హెచ్చరిక! దక్షునికి తన దక్షత (సమర్థత) మీద దిక్కుమాలిన దురహంకారం. జీవునికి తన దక్షత ఒక్కటే కాదు, దేవదేవుని ‘అక్షతలు’- అనుగ్రహ ఆశీస్సులు కూడా అత్యంత అనివార్యం- అని కూడా అమోఘమైన సంకేతం! సందేశం! శుభం భూయాత్‌!
(సశేషం)

అజ ముఖం - అంతరార్థంతంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అజ ముఖం - అంతరార్థం
అజ ముఖం - అంతరార్థం
అజ ముఖం - అంతరార్థం

ట్రెండింగ్‌

Advertisement