Ghost movies | ఏదో ఉంటుంది.. అదేంటో తెలియదు! ఎవరో ఉంటారు.. కనిపించరు! కట్టుకథ అని తెలుసు! సినిమా అనీ తెలుసు!! క్షణక్షణం భయమే! ధైర్యం కూడగట్టుకొని చూస్తాం!! చెవులు మూసుకొని హమ్మయ్య అనుకుంటాం. కండ్లు మూసుకొని ఊపిరి పీల్చుకుంటాం.. సినిమాలో నరాలు తెగే సీన్లు ఉన్నాయని తెలిస్తే చాలు టికెట్లు తెగడం ఖాయం! ఈ సంప్రదాయం బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచీ ఉన్నదే. సరైన హిట్లు లేనప్పుడల్లా బాక్సాఫీస్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేవి సస్పెన్స్ థ్రిల్లర్సే! తరాలు మారుతున్నా.. మనుషుల ఆలోచనా విధానాలు తారుమారవుతున్నా.. థ్రిల్లర్ మూవీ దగ్గరికి వచ్చేసరికి అందరూ సగటు ప్రేక్షకులే! ‘ఆత్మ’ కథల చుట్టూనే తిరుగుతున్నా సరికొత్త కథనంతో సైకలాజికల్ థ్రిల్లర్స్‌గా తెరకెక్కుతున్న సినిమాలు విజయవంతం అవుతున్నాయి.
అర్ధరాత్రి 12 గంటలు.. గాలిలో తేలియాడుతూ లీలగా ఓ పాట చెవిన పడుతుంది. లంకంత ఇంట్లో ఉంటున్న హీరో ఉలిక్కిపడతాడు. అతగాడి కంగారు చూసి ప్రేక్షకులూ బెంబేలెత్తిపోతారు. కథానాయకుడు కంగారుగా పరుగులు తీస్తాడు. అతణ్ని మరెవరో వెంబడిస్తుంటారు. ఓ పాడుబడ్డ ఇంట్లోకి చొరబడతాడు హీరో. భయంకరమైన కేకలు ప్రతిధ్వనిస్తాయి! కాసేపటికి ఆయన ఆయాసంగా మళ్లీ తెరపై కనిపిస్తాడు. ఆ పాట పాడిందెవరో, హీరో ఎందుకు కంగారుపడ్డాడో.. ప్రీ క్లయిమాక్స్ వరకూ ప్రేక్షకుడికి అంతుపట్టదు. జగ్గయ్య హీరోగా నటించిన ‘అర్ధరాత్రి’ సినిమా మూలకథ ఇదే! ఆయనే హీరోగా వచ్చిన ‘ఆమె ఎవరు?’ కూడా ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లింగ్ సినిమానే! కృష్ణ హీరోగా తీసిన ‘అవే కళ్లు’ సినిమా సస్పెన్స్ మూవీల్లో సెన్సేషనల్ హిట్ సాధించింది. ఇలా చెబుతూపోతే వెండితెరపై దండిగా రికార్డులు కొల్లగొట్టిన థ్రిల్లింగ్ సినిమాలు కోకొల్లలు. సస్పెన్స్ ఫార్ములాకు దయ్యాన్ని జోడించి రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాలన్నీ హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచినవే! ఇక ఆత్మను జోడించి తీసిన సినిమాల్లో సింహభాగం సూపర్‌హిట్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ముప్పయ్ ఏండ్ల కిందటి ‘ఆత్మబంధం’ నుంచి పదమూడేండ్ల కిందటి ‘13బి’ వరకు రకరకాల ప్రేతాత్మ ప్రేరేపిత కథలు వెండితెరపై విజయవంతంగా ప్రదర్శితమయ్యాయి. ఇటీవలి కాలంలోనూ ఇలాంటి సినిమాలు పలకరిస్తూనే ఉన్నాయి. కామెడీ హారర్, థ్రిల్లింగ్ హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ ఇలా జానర్ మారినా.. ప్రేక్షకులను సస్పెన్స్‌లో పెట్టి హిట్‌ను తమ ఖాతాలో వేసుకుంటున్నారు దర్శక, నిర్మాతలు.
‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు కిచ్చ సుదీప్. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో తెలుగునాట అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘విక్రాంత్ రోణ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది. ఓటీటీలో విడుదలైన తర్వాత మరింత ఆదరణ పొందింది. ఈ సినిమాలో దయ్యం లేదు. ఆత్మ అంతకన్నా రాదు. అవి ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అలరించింది. లేని కూతురుతో హీరో మాట్లాడటం, ఆ చిన్నారి అతని వెన్నంటే ఉండటం.. ఇలా స్క్రీన్‌ప్లే మాయాజాలంతో పట్టు బిగించాడు దర్శకుడు అనూప్ భండారి. సుదీప్ పాత్ర తీరుతెన్నులు, ఆహార్యం అనుమానించదగ్గట్టుగా ఉండటంతో సస్పెన్స్ లెవల్స్ పెంచగలిగాడు. కథలో కొత్తదనం, కథనంలో థ్రిల్లింగ్ అంశాలు బాగా కలిసొచ్చాయి.
దయ్యాలు, ఆత్మల చుట్టూ తిరిగే కథలతో మలయాళంలో తరచూ సినిమాలు వస్తూనే ఉంటాయి. మమ్ముట్టి హీరోగా నటించిన ‘రోషాక్’ కూడా అటువంటిదే! ఈ మధ్య ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది. కథనంలో వేగం మందగించినా సస్పెన్స్‌తో దానిని అధిగమించాడు దర్శకుడు నిషమ్ బషీర్. సినిమా నెమ్మదిగా సాగినా అంతుచిక్కని ఒక రహస్యంతో ప్రేక్షకుడి నాడిని పట్టాడు. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్‌గా మంచి ఆదరణ పొందుతున్నది.
విభిన్న కథలు ఎంచుకోవడంలో తమిళస్టార్ ధనుష్ ముందుంటాడు. ఈ మధ్యకాలంలో ఆయన ద్విపాత్రాభినయం చేసిన ‘నేనే వస్తున్నా’ సినిమా కూడా దాదాపు ఇలాంటి సస్పెన్స్ మూవీనే! ఆత్మ ఆవహించిన కూతురిని కాపాడుకోవడానికి ఓ తండ్రి ఏం చేశాడన్నది కథ. ఆత్మ కాన్సెప్ట్‌ను కాస్త డిఫరెంట్‌గా ప్రజెంట్ చేశాడు దర్శకుడు సెల్వ రాఘవన్. తమిళంలో మంచి వసూళ్లనే సాధించింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ పెద్దగా ఆడకపోయినా చూసినవాళ్లకు మాత్రం థ్రిల్‌ను పంచింది. ఓటీటీలో జోరు కొనసాగిస్తున్నది.
డబ్బింగ్ చిత్రాలకు మించి కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాలూ ఉన్నాయి. సమంత ‘యూ టర్న్’ అప్పట్లో సంచలనం సృష్టించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ సీరియల్ మర్డర్స్ కథాంశంతో తెరకెక్కినా.. సస్పెన్స్ థ్రిల్లర్ లిస్ట్‌లోకి చేరింది. ఈ సినిమా ‘కఠ్పుత్లీ’గా హిందీలో రీమేక్ అయింది. ఇందులో అక్షయ్ హీరోగా నటించాడు. థియేటర్లో సందడి చేయకపోయినా.. ఓటీటీలో మంచి క్లిక్‌లు సాధిస్తున్నది. తాజాగా విడుదలైన ‘మసూద’ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆత్మ ఆవహించిన ఓ చిన్నారిని దాన్నుంచి ఎలా కాపాడారన్నది కథాంశం. కథ పాతదే అయినా.. కథనంలో కొత్తదనం చూపించడంతో ‘మసూద’ విజయాన్ని సొంతం చేసుకుంది. దయ్యం సినిమాలను భయంభయంగా చూస్తూనే.. ఇండస్ట్రీకి ధైర్యం ఇస్తున్న ప్రేక్షకులకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
Nivetha Thomas | నివేదా థామస్ వరుస సినిమాలు ఎందుకు చేయట్లేదు?