సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను తీర్చిదిద్దడంలో మాలీవుడ్ దర్శకుల స్టయిలే వేరు. ముఖ్యంగా.. క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ సినిమాలను చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. అందుకే, ఈ జోనర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ఓటీటీ జనాలు బ్రహ్మరథం పడతారు. తాజాగా, ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ సమర్పణలో వచ్చిన ‘దృఢం’ సినిమా కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. గత మే నెలలో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా.. జియో హాట్‌స్టార్ వేదికగా ఇటీవలే తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. రికార్డ్ స్ట్రీమింగ్‌తో దూసుకుపోతున్నది. క్రైమ్ సీన్లోకి ఎంటరైతే.. కేరళలోని పాలక్కడ్‌కు చెందిన విజయ్ (షేన్ నిగమ్).. చాలా నెమ్మదస్తుడు, శాంత స్వరూపుడు. తల్లిదండ్రుల కోరిక మేరకు పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఎస్ఐగా మొదటి పోస్టింగ్‌పై అడవిని ఆనుకుని ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామానికి వెళ్తాడు. విజయ్‌ని అక్కడి స్టాఫ్ ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారు. అతనితో చాలా సరదాగా ఉంటారు.
ఆ ప్రాంతంలో ఎలాంటి నేరాలు జరగవని తెలిసి.. ప్రశాంతంగా డ్యూటీ చేసుకోవచ్చని భావిస్తాడు. అలాంటి సమయంలో గ్రామంలో ఓ శవం దొరుకుతుంది. ఆ తర్వాత ఒక ఫైనాన్స్ కంపెనీ నుంచి 50 లక్షల నగదు, 120 సవర్ల బంగారం మాయమవుతుంది. ఈ రెండు కేసులతో విజయ్ ఉక్కిరి బిక్కిరి అవుతాడు. ఇంతలోనే.. గ్రామంలో అక్కడక్కడా శవాలు బయటపడుతూ ఉంటాయి. అవన్నీ గుర్తుపట్టలేనంత దారుణమైన స్థితిలో ఉంటాయి. పోస్టుమార్టం నివేదికలో.. అందరూ తల వెనుక బలమైన గాయం కావడం వల్లే చనిపోయారని తేలుతుంది. ప్రశాంతంగా ఉండే ఆ పల్లెలో ఏం జరుగుతున్నది? పోలీస్‌గా ఎలాంటి అనుభవం లేని విజయ్.. ఈ కేసుల్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాడు? ఈ క్రమంలో ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటాడు? ఫైనాన్స్ కంపెనీలో జరిగిన దొంగతనానికీ, హత్యలకూ ఏమైనా సంబంధం ఉందా? అసలు ఈ నేరాల వెనకాల ఉన్నది ఎవరు? చివరికి నేరస్తుల్ని విజయ్ పట్టుకున్నాడా? అనేది మిగతా కథ.