ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, ఉరుకుల పరుగుల జీవితంలో పడి.. చిన్నచిన్న సంతోషాలను కూడా కోల్పోతుంటారు. అలాంటివారి కోసం.. ఫిన్లాండ్ ప్రభుత్వం, అక్కడి పర్యాటక శాఖ ఓ అద్భుతమైన అవకాశం అందిస్తున్నది. తమ దేశంలో పర్యటిస్తే.. ఆనందంగా జీవించడం ఎలాగో నేర్పుతామని చెబుతున్నది. ఇందుకోసం ఫిన్లాండ్వాసిగా ఆనందంగా గడపండి అంటూ.. ‘చిల్ లైక్ ఏ ఫిన్’ అనే కార్యక్రమం ఏర్పాటు చేసింది.
వరుసగా ఎనిమిది సార్లు ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది ఫిన్లాండ్. తమ దేశప్రజల సంతోష రహస్యాలను ప్రపంచంతో పంచుకోవడానికి ఓ అవకాశం కల్పిస్తున్నది. ‘చిల్ లైక్ ఏ ఫిన్’ పేరుతో ఏడు రోజుల ఫిన్లాండ్ పర్యటనను ఆఫర్ చేస్తున్నది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ చాలెంజ్‌లో గెలిచిన వారికి ఫిన్లాండ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ‘లేక్‌ల్యాండ్’లో విహరించే అవకాశం దక్కుతుంది. అదికూడా ఉచితంగా. ప్రయాణ ఖర్చులు మొదలుకొని, వసతి, భోజనం, ఇతర ఖర్చులన్నీ ఫిన్లాండ్ ప్రభుత్వమే భరించనున్నది. వారికి ఆనందంగా జీవించడం ఎలాగో కూడా నేర్పుతుంది. ఫిన్లాండ్ ప్రజలు ప్రకృతితో కలిసి ఎలా జీవిస్తారు? వారి జీవనశైలిలో దాగి ఉన్న ప్రశాంతత ఏమిటి? చిన్న చిన్న విషయాల్లోనూ వారు సంతోషాన్ని ఎలా వెతుక్కుంటారు? అనే విషయాలపై అవగాహన కల్పిస్తుంది.
‘చిల్ లైక్ ఏ ఫిన్’ చాలెంజ్ కోసం ఫిన్లాండ్ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ నెల 29వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. ఇందులో పాల్గొనాలని అనుకునేవారు.. ‘విజిట్ ఫిన్లాండ్’ (https://www.visitfinland.com/en/) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, ఒక ఆన్లైన్ ఫామ్ నింపాలి. మీరు ఎందుకు సంతోషంగా ఉండాలనుకుంటున్నారు? మీ సంతోష రహస్యం ఏమిటి? అనే దానిపై ఒక చిన్న వీడియో తీసి, అందులో పోస్ట్ చేయాలి. ఒంటరిగా లేదా జంటగా కూడా ఈ చాలెంజ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దీనికి దరఖాస్తు చేసుకుంటారు. కానీ కేవలం సుమారు 10-15 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి వారి దేశం నుంచి ఫిన్లాండ్ వెళ్లడానికి, రావడానికి విమాన టిక్కెట్లు ప్రభుత్వమే భరిస్తుంది. ఫిన్నిష్ లేక్‌ల్యాండ్ ప్రాంతంలోని విలాసవంతమైన రిసార్ట్స్‌లో బసతోపాటు పసందైన భోజనాన్నీ ఏర్పాటు చేస్తుంది. సంతోషంగా జీవించడంపై నిపుణుల ద్వారా ప్రత్యేక క్లాసులు కూడా ఉంటాయి. మరెందుకు ఆలస్యం.. మీరూ ఈ చాలెంజ్‌లో పాల్గొనండి. అద్భుతమైన ఫిన్లాండ్లో ఆనందంగా గడిపి.. సంతోషంగా జీవించడం ఎలాగో నేర్చుకోండి.