ప్రజా రక్షణలోనే కాదు.. వీరత్వాన్ని ప్రదర్శించడంలోనూ ముందున్నామని చాటుతున్నారు ఆ మహిళా పోలీసులు. లాఠీలు పట్టిన చేతులతో ఖడ్గం దూస్తున్నారు. ధీరత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న ‘ఫెన్సింగ్ క్రీడ’.. వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఆ నలుగురూ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఏడవ ఆలిండియా పోలీస్ జూడో క్లస్టర్ చాంపియన్‌షిప్‌లో అసమాన ప్రతిభ కనబరిచారు.
కరాటే, తైక్వాండోకు సరిసమానంగా మహిళల ఆత్మరక్షణకు అండగా నిలిచే ప్రత్యేక క్రీడ.. ఫెన్సింగ్. అందుకే, చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ఫెన్సింగ్‌లో శిక్షణ ఇప్పిస్తుంటారు. జాతీయ స్థాయిలో ఫెన్సింగ్ రాణులుగా రాణిస్తున్న ఈ మహిళా పోలీసులు సైతం అలాంటి ఆసక్తితోనే కత్తి పట్టారు. ప్రణీత.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చార్మినార్ పోలీస్ స్టేషన్లో, అంబిక.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సబ్-ఇన్స్పెక్టర్లు. మౌనికారెడ్డి.. నేరేడ్మెట్ స్టేషన్లో, ఉమ.. వికారాబాద్ జిల్లాలోని బషీర్‌బాగ్ స్టేషన్లో కానిస్టేబుల్స్.
ఈ నలుగురితో కూడిన బృందం సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఏడవ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నది. ఫెన్సింగ్ క్రీడలో విజేతగా నిలవడంతో ఈ బృందాన్ని కాంస్య పతకం వరించింది. అయితేనేం, ఆటతీరు మాత్రం అచ్చమైన బంగారమని చెప్పాలి.
ప్రతిభకు వేదిక ఫెన్సింగ్ విదేశీ క్రీడ అయినా భారత్‌లో మంచి ఆదరణ ఉంది..1896 నుంచి ఒలింపిక్స్‌లోనూ ప్రవేశపెట్టారు. క్రికెట్‌కు బ్యాట్లాంటిది.. ఫెన్సింగ్‌కు కత్తి. ఈ క్రీడలో ఎవరికీ గాయాలు కావు. ప్రాణాపాయం ఉండదు. రక్షణగా తలకు మాస్క్, ఛాతీకి చెస్ట్‌గార్డ్, చేతులకు గ్లోవ్స్, కాళ్లకు ప్రత్యేక బూట్లు ఉంటాయి. ఖడ్గం ఎదుటి వ్యక్తికి తగలగానే స్కోర్‌బోర్డుపై పాయింట్లు నమోదు అవుతాయి. ఎంతోమంది తెలంగాణ క్రీడాకారులు కత్తిపట్టి జాతీయ వేదికలపై ప్రతిభ కనబరుస్తున్నారు.
పతకాలే లక్ష్యం..
‘నాన్న రాజు గతంలో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్‌గా పని చేసేవారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటున్నారు. అమ్మ విజయలక్ష్మి చిన్నప్పటి నుంచీ క్రీడల్లో పాల్గొనమంటూ ప్రోత్సహించేది. ఐదో తరగతి నుంచే ఫెన్సింగ్‌లో తర్ఫీదు పొందాను. 2019లో జరిగిన సీనియర్ నేషనల్ ఫెడరేషన్ గేమ్స్‌లో కాంస్యం వరించింది’ అని చెబుతారు అంబిక. ‘డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఫెన్సింగ్‌లో శిక్షణ తీసుకున్నా. ఇప్పటికే వివిధ వేదికల మీద అత్యుత్తమ ప్రతిభ కనబరిచాను. ఎస్సై కావాలన్నది నా ఆకాంక్ష’ అంటారు పాత్లావత్ ఉమ. ఇక, ప్రణీత అయితే ఇప్పటికే జాతీయ స్థాయిలో సత్తా చాటారు. అంతర్జాతీయ వేదికలపై మరిన్ని పతకాలు సాధించాలన్నది ఆమె ఆశయం. ‘తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఫెన్సింగ్ నేర్చుకునేలా ప్రోత్సహించాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది’ అని సలహా ఇస్తారు మౌనికా రెడ్డి. తనకు రాష్ట్ర స్థాయి టోర్నీలో స్వర్ణ పతకం వచ్చింది.
– గంజి ప్రదీప్ కుమార్