Valentine’s day | వాలెంటైన్ వీక్‌లో రోజుకో ప్రత్యేకం. రోజ్ డే, ప్రపోజ్ డే ఇలా ఎన్ని ఉన్నా… ప్రేమజంటకు కావాల్సింది నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయనని మాటిచ్చే ప్రామిస్ డే నేడు. ఈ రోజు చెలికాడు చేసే వాగ్దానం.. ఆ మర్నాటి హగ్ డే సందర్భంగా హత్తుకునే కౌగిలి కన్నా వెచ్చగా ఉంటుంది. ఆ మరుసటి కిస్ డే నాడు ఇచ్చి పుచ్చుకునే ముద్దు కన్నా తియ్యగా ఉంటుంది. ఎందుకంటే మొగ్గ తొడిగిన ప్రేమాయణం పరిణయంగా పరిణమించడం.. ఆ జంట చేసుకునే ప్రమాణంపైనే ఆధారపడి ఉంటుంది.
పెండ్లి దగ్గర కట్నకానుకలు కీలక పాత్ర పోషిస్తాయి కానీ, ప్రేమ దగ్గర మనసుదే ఆధిపత్యం. ఆ మనసులో మెదిలే భావాలను ఎంత అందంగా పంచుకుంటే ప్రేమబంధం అంత బలపడుతుంది. తోడుగా ఎవరూ రాకున్నా.. జంటగా మీరుంటే చాలన్న నమ్మకం కలగాలి. కవితలే పంపుతారో, పొగడ్తల్లో ముంచెత్తుతారో, కానుకలే సమర్పించుకుంటారో.. మీ ఇష్టం! ఏం చేసినా అది మీ ఆధిపత్యాన్ని ప్రదర్శించేదై ఉండకూడదు. తన మీద మీకున్న అభిమానానికి తార్కాణంగా కనిపించాలి.
ఇద్దరూ కలుసుకున్నప్పుడు కాలం మంచులా కరిగిపోవాలి. అంతేకానీ గంటల ముల్లులా భారంగా సాగొద్దు. అందుకే అప్పుడప్పుడూ రొటీన్ భేటీలకు కామా పెట్టి లాంగ్ డ్రైవ్‌కు ప్లాన్ చేసుకోండి. ఆ ప్రయాణంలో మీ తోడులో మిమ్మల్ని ఆకట్టుకునే కోణం ఏదైనా ఆవిష్కృతం కావొచ్చు. అది వారిపై మరింత నమ్మకాన్ని కలిగించొచ్చు.
ప్రేమకు పుట్టడం తప్ప గిట్టడం తెలియదు. కానీ, ఈ టెక్నాలజీ యుగంలో ప్రేమ చిగురించినప్పుడే బ్రేకప్ లైసెన్స్ తీసుకుంటున్నారు. కారణం, ఒకరిపై ఒకరికి పూర్తిస్థాయిలో నమ్మకం లేకపోవడమే! వాట్సాప్‌లో ప్రేయసి ఆన్లైన్లో ఉన్నట్టు కనిపించిందా.. తనతో కాకుండా ఎవరితోనో చాట్ చేస్తుందన్న ఇతగాడి అనుమానం. అబ్బాయి వాట్సాప్‌లో లాస్ట్ సీన్ లేట్ నైట్ కనిపిస్తే ఆమెకు అనుమానం. మర్నాడు ఉదయం చర్చలు.. సాయంత్రానికి బ్రేకప్‌లు.. ఇదీ సంగతి! ఎవరి స్పేస్ వారికి ఇవ్వాలన్న చిన్న అవగాహన ఉంటే ఇలాంటి స్పై వ్యవహారాలకు తావుండదు. ఇంతకన్నా.. ప్రేమికులు ఒకరికొకరు ఇచ్చుకునే నమ్మకం మరేం ఉంటుంది.
తను ప్రేమించిన అమ్మాయి స్నాప్‌చాట్‌లో చలాకీగా ఉంటే అతనికి అసహనం. తనను ఆరాధించే అబ్బాయి కొలీగ్స్‌తో కాస్త క్లోజ్‌గా ఉంటే.. ఆమెకు చిరాకు. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలవనంత మాత్రాన ప్రేమించుకోవద్దనే రూల్ లేదు. ఒకరి అభిరుచులను, ఆసక్తులను మరొకరు గౌరవించుకుంటే.. అలాంటి ప్రేమ మరింత రసవత్తరంగా సాగుతుంది. ఈ అనుమానాలు లేకుండా ఉండాలంటే.. ఒకరిపై ఒకరికి కొండంత నమ్మకం కుదరాలి. తన అభిప్రాయానికి విలువ ఇస్తానని మాటిచ్చి పుచ్చుకోండి. మాటిచ్చి మర్చిపోతానంటే కుదరదు.. దాన్ని నిలబెట్టుకున్నప్పుడే మీ పెండ్లి పుస్తకం ప్రేమకావ్యంగా నిలిచిపోతుంది. ఎందుకు ఆలస్యం చేతిలోన చెయ్యేసి ‘ఐ లవ్యూ’ అని నమ్మకంగా చెప్పేయండి!