ప్రేమ.. విశ్వవ్యాప్తమైంది. భూమ్మీద ఏ మూలకు వెళ్లినా.. ప్రేమికులు కనిపిస్తారు. ‘ప్రేమికుల దినోత్సవం’ జరుపుకొంటారు. కానీ, ప్రాంతాన్ని, పద్ధతులను బట్టి.. వేర్వేరుగా సెలెబ్రేట్ చేసుకుంటారు. ఒక్కో దేశంలో ఒక్కో తీరుగా.. ‘వాలెంటైన్స్ డే’ వేడుకల్లో మునిగితేలుతారు.
Valentines Day Celebrations | మొట్టమొదటి వాలెంటైన్స్ డే కార్డు ఫ్రాన్స్‌లోనే పుట్టిందని చాలామంది నమ్మకం. 1415లో ఓర్లీన్స్ డ్యూక్ చార్లెస్.. జైలు నుంచి తన భార్యకు ప్రేమలేఖలు పంపాడట. అవే మొట్టమొదటి వాలెంటైన్స్ డే కార్డులు. ఇక ఫిబ్రవరి 12 నుంచి 14 వరకూ ఫ్రాన్స్‌లోని ‘వాలెంటైన్’ అనే గ్రామం.. ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఊరంతా గ్రీటింగ్ కార్డులు, గులాబీల అలంకరణలతో నిండిపోతుంది. బహుశా.. ప్రపంచంలోనే అత్యంత అందమైన వాలెంటైన్స్ డే ఇక్కడే జరుగుతుంది.
అర్జెంటీనాలో వాలెంటైన్స్ డే.. ‘జూలై’లో వస్తుంది. ‘ద వీక్ ఆఫ్ స్వీట్నెస్’గా.. వారం రోజుల వేడుక చేసుకుంటారు ఇక్కడి ప్రేమికులు. చాక్లెట్లు, మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటారు.
ఫిబ్రవరి 14న ప్రేమికులు పెళ్లితో ఒక్కటయ్యే సంప్రదాయం ఫిలిప్పీన్స్‌లో కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది యువజంటలు.. ప్రభుత్వం నిర్వహించే వేడుకలో ‘వివాహ’ బంధంలోకి అడుగుపెడతారు.
ప్రపంచమంతా ఏడాదిలో ఒక్కరోజు ‘వాలెంటైన్స్ డే’ జరుపుకొంటే.. కొరియన్లు నెలకోసారి ఈ వేడుకను నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతినెలా 14వ తేదీ ప్రేమికుల రోజే! మే నెలలో గులాబీల దినోత్సవం, జూన్ నెలలో ముద్దుల దినోత్సవం, డిసెంబర్లో హగ్స్ డే.. ఇలా ఒక్కో నెల 14వ తేదీన ఒక్కో తీరున జరుపుకొంటారు.
వేల్స్ వాసులు జనవరి 25న ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకొంటారు. దీనిని ‘సెయింట్ డ్విన్వెన్ దినోత్సవం’ అని పిలుస్తారు. ఈ రోజున ప్రేమికులు ఒకరికొకరు చేతితో తయారుచేసిన చెక్క స్పూన్లను ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ సంప్రదాయం 16వ శతాబ్దం నుంచి కొనసాగుతున్నది.
ఫిబ్రవరి 14 సందర్భంగా.. డెన్మార్క్ ప్రేమికులు ‘స్నో డ్రాప్స్’గా పిలుచుకునే తెల్లని పూలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక్కడ ప్రేమికులకే కాదు.. కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులకు కూడా బహుమతులు, గ్రీటింగ్ కార్డులు అందిస్తారు.
ఆఫ్రికా ఖండ దేశం ఘనాలో ఫిబ్రవరి 14ను ‘జాతీయ చాక్లెట్ దినోత్సవం’గా జరుపుకొంటారు. దేశంలో పర్యాటకాన్ని పెంచడానికి అక్కడి ప్రభుత్వం ఈ ఏర్పాటుచేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా కోకో ఉత్పత్తి చేసే దేశాలలో ఘనా కూడా ఒకటి. ఫిబ్రవరి 14న చాక్లెట్ దినోత్సవం కోసం.. ఇక్కడ ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు.
జపాన్‌లో ‘వాలెంటైన్స్ డే’ అంటే మహిళలదే! ఇక్కడ ఆడవాళ్లు తమ భాగస్వాములకు చాక్లెట్లను బహుమతిగా అందిస్తారు. అయితే.. నెల తర్వాత వచ్చే ‘మార్చి 14’ పురుషుల వంతు! ‘వైట్ డే’గా జరుపుకొనే ఈ రోజున.. మగవాళ్లు ఆడవాళ్లకు ప్రత్యేక బహుమతులు ఇస్తారు. దక్షిణ కొరియాలోనూ ఇదే సంప్రదాయం పాటించినా.. వైట్ డే తర్వాత మరో నెలకు, అంటే ఏప్రిల్ 14న బ్లాక్ డేనూ సెలెబ్రేట్ చేసుకుంటారు.
ఫిబ్రవరి 14ను స్నేహితుల దినోత్సవంగా జరుపుకొంటారు ఫిన్లాండ్వాసులు. ప్రేమికుల కన్నా.. స్నేహితులతోనే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.