భారతీయుల స్వభావమే అంత. ఏ దేశంలో ఉన్నా మూలాల్ని మరచిపోరు. జీవనశైలి, ఆహార
విధానాలు మార్చుకోరు. ప్రత్యేక సందర్భాల్లో సంప్రదాయ వస్ర్తాలనే కట్టుకుంటారు. నిత్యం
ఇంటి వంటే తినాలనుకుంటారు. అవకాశం ఉంటే, తొలి ముద్ద ఏ తొక్కుతోనో
ఆరంభిస్తారు. అందుకే ఇక్కడి నుంచి పచ్చళ్లూ వడియాల నుంచి పట్టు పరికిణీలూ
పట్టు చీరల వరకూ కొరియర్లోనో, స్నేహితుల ద్వారానో విదేశాలకు వెళ్తుంటాయి.
కానీ, ఆ రవాణా ఏమంత సులభం కాదు. అనేక సమస్యలు. ఇలాంటి ఇబ్బందులను స్వయంగా అనుభవించడం వల్ల వచ్చిన అనుభవంతో ‘ఫార్వర్డ్ పార్సెల్’పేరుతో ఒక స్టార్టప్‌ను మొదలుపెట్టారు హైదరాబాద్‌కు చెందిన చేతన. ఎన్ఆర్ఐల షాపింగ్ కష్టాలను తీరుస్తున్న ఆ ఆంత్రప్రెన్యూర్ను ‘జిందగీ’ పలకరించింది.
నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. ఇక్కడే ఇంజినీరింగ్ చదివాను. చివరి సంవత్సరం అయిపోగానే పెండ్లయ్యింది. అప్పటికే మావారు యూకేలో ఉద్యోగం చేస్తున్నారు. దాంతో నేనూ వెళ్లిపోయాను. అక్కడే మాస్టర్స్ చేసి, ఉద్యోగంలో చేరాను. పన్నెండేండ్లు యూకేలో ఉన్నాం. ఓసారి, మా అమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇండియాకు వచ్చాం. తర్వాత, పరిస్థితుల ప్రభావంతో ఇక్కడే స్థిరపడాల్సి వచ్చింది. మా అమ్మాయిని హైదరాబాద్‌లోని స్కూల్లోనే చేర్పించాం.
‘ఫార్వర్డ్ పార్సెల్’ కాన్సెప్ట్ ఇదే..
కొండాపూర్‌లో ఆఫీస్, స్టోర్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక వెబ్సైట్ తయారు చేశాం. విదేశాల్లో ఉన్నవాళ్లు రిజిస్టర్ కాగానే, వాళ్లకు మా ఇండియన్ అడ్రస్ ఇస్తాం. దాన్ని వాళ్లు ఫిజికల్ అడ్రస్‌గా వాడుకోవచ్చు. అందులోనూ, ఇప్పుడు మనదేశంలో ఇ-కామర్స్ వేగంగా దూసుకెళ్తున్నది. పిన్నీసు నుంచి చిరుధాన్యాల వరకు అన్నీ ఏ దేశం నుంచైనా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. కాబట్టి, మా కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను ఆన్లైన్లో షాపింగ్ చేసి, మా అడ్రస్‌కు డెలివరీ చేయించుకుంటారు. అలాగే వాళ్లింట్లో వాళ్లు కూడా కావాల్సినవన్నీ మాకు తెచ్చి ఇవ్వొచ్చు. వీటన్నిటినీ ఒకేచోట భద్రపరచి, వాళ్లు చెప్పిన సమయానికి మూటగట్టి ఒకేసారి విదేశాలకు పంపిస్తాం. ఆర్డర్ మా దగ్గరకు రాగానే, ఫొటోలు తీసి కస్టమర్లకు పంపుతాం. ఏదైనా డ్యామేజ్ ఉన్నట్టు అనిపిస్తే, వెనక్కి పంపుకోవచ్చు. ప్రతి వస్తువుకు బార్కోడ్ అమర్చుతాం. దీనివల్ల ఒక కస్టమర్ వస్తువు ఇంకొకరి దాంట్లో కలిసిపోయే ఆస్కారం ఉండదు. కస్టమర్ తన వస్తువులన్నిటినీ మా దగ్గర 30 నుంచి 60 రోజుల వరకు పెట్టుకోవచ్చు.
కుటుంబ ప్రోత్సాహంతోనే..
నేను భారతదేశానికి తిరిగొచ్చాక ఎక్కడా ఉద్యోగం చేయలేదు. ఎలాగూ ఒక బిజినెస్ ఐడియా ఉంది కాబట్టి, వ్యాపారం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాను. యూకేలో ఉన్నప్పుడు నా భర్త నెస్లే కంపెనీలో పని చేసేవారు. ఇక్కడికి వచ్చాక అమెజాన్‌లో ఆపరేషన్స్ మేనేజర్‌గా చేరారు. సరిగ్గా ఏడాది తర్వాత ఆయన కూడా ఉద్యోగం మానేసి, కంపెనీ కోసం ఫుల్‌టైమ్‌గా పని చేస్తున్నారు. ప్రొడక్ట్స్ వచ్చిన దగ్గర్నుంచి, కస్టమర్‌కు చేరేవరకు అన్ని విషయాలూ ఆయనే దగ్గరుండి చూసుకుంటారు. ప్రస్తుతం మా దగ్గర పన్నెండు మంది ఉద్యోగులు ఉన్నారు. ఒకప్పుడు ఫార్వర్డ్ పార్సెల్ లాంటి కంపెనీ ఉంటే బాగుండని ఓ కస్టమర్‌గా కోరుకున్నాను. ప్రవాసుల అవసరాలన్నీ నాకు తెలుసు. కాకపోతే మొదటి ఆరునెలలు బిజినెస్ ఎలా నడుస్తున్నదో నాకు అర్థం కాలేదు. అదే కస్టమర్స్ నుంచి మళ్లీ మళ్లీ ఆర్డర్స్ రావడం మొదలుకాగానే, నమ్మకం కుదిరింది. కొవిడ్ సమయంలో పబ్లిక్ టాక్ ద్వారానే ఇక్కడా, విదేశాల్లో మా కంపెనీకి ప్రచారం వచ్చింది. దీంతో, కస్టమర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం మా దగ్గర వివిధ దేశాల నుంచి 20 వేల ఎన్ఆర్ఐ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. వీహబ్‌లో చేరాక కాంటాక్ట్స్ పెరిగాయి. మన కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, ఇంటీరియర్స్ కోసం షాపింగ్ చేయాలనుకొనేకస్టమర్లకు తెలంగాణ హస్త కళలను సూచిస్తున్నాం. వాళ్లూ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మా కంపెనీని మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడమే నా ముందున్న లక్ష్యం.
ఆ కష్టాలు తెలుసు
పన్నెండేండ్లు మాతృభూమికి దూరంగా ఉన్నాను. ఇక్కడ ఉన్నప్పుడు ఆ వెలితి తెలియకపోయినా, విదేశాల్లో ఉన్నప్పుడు మన సంస్కృతి, సంప్రదాయాలకు దూరమైపోతాం. ఎంత కష్టమైనా సరే ఇక్కడి దుస్తులు, పచ్చళ్లు తెప్పించుకోకుండా ఉండలేం. మహా అయితే, ఏడాదికోసారి వచ్చినప్పుడు అవసరమైనవన్నీ తీసుకెళ్లేవాళ్లం. మధ్యలోఎప్పుడైనా రావడం కుదరకపోతే, ఇంట్లోవాళ్లనే పంపమని అడిగేవాళ్లం. ఇండియా నుంచి స్నేహితులు వస్తున్నప్పుడు తెచ్చిమ్మని కోరేవాళ్లం. ప్రతిసారీ అలా వెంటపడి అడగడం ఇబ్బందిగా అనిపించేది. ఈ తరహా సేవలు అందించే స్టార్టప్స్ ఉన్నాయేమోనని గూగుల్‌లో వెతికాను. ఎక్కడా కనిపించలేదు. ‘ఆ పనేదో నేనే చేస్తే ఎలా ఉంటుంది?’ అన్న ఆలోచన వచ్చింది. ఇక్కడే స్థిరపడాలని నిర్ణయించుకోగానే, నా బిజినెస్ ఐడియా అమలు చేశాను.
-నిఖిత నెల్లుట్ల