సుగంధం… అది కేవలం నాసికను తాకే వాసన కాదు; అంతరాత్మను పరవశింపజేసే ఒక అనుభూతి. ఇస్లామిక్ సంస్కృతిలోని లోతును స్పృశించాలంటే, మనం ఆ చిన్ని అత్తరు సీసాలో దాగి ఉన్న శతాబ్దాల చరిత్రను, ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలి. ఇది కేవలం బాహ్య అలంకరణ కాదు,ఆరాధనలో భాగమైన ఒక పవిత్ర సువాసన. ప్రవక్త ఇష్టపడిన ‘దైవీక’ మకరందం.
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితం ఒక పరిమళభరిత ఉద్యానవనం. ఆయన సువాసనలను ఎంతగానో ప్రేమించేవారు. ఆ మహనీయుడి మాటల్లోనే చెప్పాలంటే.. ‘ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైన విషయాలలో సుగంధం ఒకటి. అయితే, నా కన్నులకు చలవనిచ్చేది (నిజమైన ప్రశాంతత) మాత్రం నమాజ్ (ప్రార్థన)లోనే ఉంది’ అనేవారు. ప్రవక్త వారి వ్యక్తిత్వం ఎంతటి సుగంధభరితమైనదంటే, ఆయనతో కరచాలనం చేసిన సహాబాలు (అనుచరులు), ఆ తర్వాత రోజంతా తమ చేతుల నుంచి దివ్యమైన పరిమళం వెదజల్లిందని చెప్పుకొనేవారు. అంటే, అత్తరు ధరించడం అనేది కేవలం అలవాటు కాదు, అది ఒక ‘సున్నత్’- ప్రవక్త మార్గంలో నడిచే ఒక అద్భుతమైన ప్రక్రియ.
ఇస్లాంలో పవిత్రత (తహారత్) అనేది విశ్వాసంలో సగ భాగం. అల్లాహ్ ముందు నిలబడేటప్పుడు మన దేహం, మనసు ఎంత పవిత్రంగా ఉండాలో, మన ఆహార్యం కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలి. ముఖ్యంగా శుక్రవారం (జుమా) రోజున. శుభ్రంగా స్నానం ఆచరించడం, ఉత్తమమైన వస్ర్తాలను ధరించడం, చివరిగా, సుగంధ భరితమైన అత్తరును అద్దుకోవడం ఇందులో భాగం. మనం మసీదులో అడుగుపెట్టినప్పుడు, మన అత్తరు వాసన తోటి భక్తులకు చిరాకు కలిగించకుండా, ప్రశాంతతను పంచాలి. ఆ సువాసనల మధ్య చేసే ప్రార్థన హృదయానికి హత్తుకుంటుంది, ఏకాగ్రతను పెంచుతుంది.
అత్తర్లు కేవలం మసీదులకే పరిమితం కాలేదు, అవి మన సామాజిక జీవనంలోనూ పెనవేసుకుపోయాయి. ఎవరికైనా అత్తరును కానుకగా ఇవ్వడం అంటే, వారి జీవితంలో
ఆనందాన్ని నింపాలని కోరుకోవడమే. అత్తరు అనేది మన బాహ్య శుభ్రతను, అంతర్గత ఆధ్యాత్మికతను కలిపే ఒక పారదర్శక వంతెన. ఈసారి మీరు అత్తరు సీసా మూత
తీసినప్పుడు.. అది కేవలం సువాసన కోసం అని కాకుండా, అల్లాహ్ పట్ల మీకున్న
భక్తికి, ప్రవక్త పట్ల మీకున్న ప్రేమకు చిహ్నంగా భావించండి.ఒక్క చుక్క అత్తరు.. మీ రోజంతా
పవిత్రమైన ఆలోచనలతో నిండిపోయేలా చేస్తుంది….?
-ముహమ్మద్ ముజాహిద్
96406 22076