ఆధునిక జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో యూరిక్ యాసిడ్ సమస్య ఒకటి. ఇది మితిమీరితే కీళ్ల నొప్పులు, వాపులు రావడమే కాకుండా భవిష్యత్తులో గౌట్ వ్యాధికి దారితీసే ప్రమాదముంది. మరి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఇంగ్లిష్ మందుల కంటే మన వంటింట్లోని సహజ మూలికలే అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రతిరోజూ మన కూరల్లో వాడే కొత్తిమీర యూరిక్ యాసిడ్ స్థాయులను తగ్గించడంలో ఒక సంజీవనిలా తోడ్పడుతుంది. దీనితో తయారుచేసే కషాయం యూరిక్ యాసిడ్‌ను ఎలా నివారిస్తుందో తెలుసుకుందాం..
ప్యూరిన్లు ఎకువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయులు వేగంగా పెరిగి కీళ్లలో స్పటికాల రూపంలో చేరి తీవ్రమైన నొప్పులు, వాపులు, గౌట్ సమస్యకు దారితీస్తాయి. అలాంటి సమయంలో కొత్తిమీర లేదా ధనియాల కషాయం యూరిక్ యాసిడ్ స్థాయులను తగ్గించడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొత్తిమీరలో ఉండే డైయూరిటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, విటమిన్ సి, కె, ఫ్లేవనాయిడ్లు శరీరంలోని టాక్సిన్లను సమర్థంగా తొలగించి మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. కొత్తిమీర కషాయం ఒక సహజమైన డయూరిటిక్ ఏజెంట్‌గా పనిచేసి మూత్రవిసర్జన ప్రమాణాన్ని పెంచుతుంది. తద్వారా రక్తంలో పేరుకుపోయిన అధిక యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా సులభంగా బయటికి పోతుంది. ఇది మూత్రపిండాలపై పడే భారాన్ని తగ్గించి వడపోత సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా కీళ్లలో కలిగే మంట, వాపులను తగ్గించడంలో ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీలక పాత్ర పోషిస్తాయి.
కషాయం తయారు చేయడానికి.. తాజా కొత్తిమీర లేదా ఒక స్పూన్ ధనియాలు శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. మరిగిన నీటిని వడకట్టి గోరువెచ్చగా తీసుకోవాలి. ఈ కషాయాన్ని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల శరీరానికి గరిష్ట ప్రయోజనాలు చేకూరుతాయి. ఇలా వారానికి 4 నుంచి 5 రోజులు చేయడం వల్ల శరీరంలోని యూరిక్ యాసిడ్ తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగవుతుంది. కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో చకెర స్థాయులను నియంత్రించడంలో కొత్తిమీరలోని ప్రత్యేక మూలకాలు ఉపయోగపడతాయి. అలాగే చర్మ సమస్యలు ఉన్నవారికి రక్తాన్ని శుభ్రపరిచి సహజమైన కాంతిని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపి రోగనిరోధకశక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. అయితే ఈ కషాయం మంచి హెర్బల్ రెమిడీగా పనిచేసినప్పటికీ ఇది పూర్తిస్థాయి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. బీపీ, షుగర్ మందులు వాడుతున్న వాళ్లు వైద్యుడి సలహా తర్వాతే దీనిని తీసుకోవాలి.