జీవితంలోని ప్రత్యేకమైన రోజుల్ని, చిన్నాపెద్దా విజయాల్ని నలుగురితో కలిసి సెలెబ్రేట్ చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు పరిశోధకులు. నలుగురిలోకి వెళ్లడం, నలుగురితో కలిసి భోంచేయడం, కష్టసుఖాలు పంచుకోవడం.. ఇవన్నీ సామాజిక సంబంధాల్ని బలోపేతం చేసే అంశాలే. ‘పబ్లిక్ పాలసీ-మార్కెటింగ్” జర్నల్ ఆన్లైన్ ఎడిషన్లో ఈ అధ్యయన వివరాలు ప్రచురించారు.
సామాజిక మద్దతు వల్ల జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సరిపడా శక్తి వస్తుందని గుర్తించారు. ఒత్తిడి, నిరాశావాదం మాయమైపోతాయనీ వెల్లడైంది. జీవన ప్రమాణం కూడా పెరుగుతుందని తేల్చి చెప్పారు. ‘సామాజిక సంబంధాలు పెంచుకునేవాళ్లు సమాజం పట్ల బాధ్యతగా ఉంటున్నారు. ప్రజాసేవకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు’ అంటున్నారు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డానియెల్ బ్రిక్.