ప్రకృతి పాడిన జీవనాదం బతుకమ్మ
పెత్తర అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే పండుగ సంబురాలు తొమ్మిదిరోజుల పాటు అంగరంగవైభవంగా జరుగుతాయి. చివరిరోజైన ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ప్రకృతే దైవంగా పూజించే నవరాత్రి పర్వం ఇది. బతుకమ్మ పండుగ జానపదుల ఆచారమే కాదు.. మనిషి తనకు జీవం పోస్తున్న నేలకు, నీటికి, పూలకు తెలిపే కృతజ్ఞత.
ఒక పువ్వును కొలిచి దేవుడి పాదాల చెంత ఉంచడం భక్తి పూర్వక ఆరాధన. అదే పువ్వుతో ప్రకృతినే దైవంగా మలిచి, వందలాది పూలను ఒక శిఖరంగా పేర్చి, వాటి చుట్టూ సమాజమంతా గొంతు కలిపి పాట పాడటం ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రకటన. పూలతో పేర్చి గౌరమ్మను కొలిచి నీళ్లలో నిమజ్జనం చేసి ప్రకృతితో మమేకమవుతున్న ఆ సంబురం బతుకమ్మ. తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ వేడుక మొదలైంది. పూల పండుగ వైభవం ఇదిగో..
పెత్తర అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే పండుగ సంబురాలు తొమ్మిదిరోజుల పాటు అంగరంగవైభవంగా జరుగుతాయి. చివరిరోజైన ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ప్రకృతే దైవంగా పూజించే నవరాత్రి పర్వం ఇది. బతుకమ్మ పండుగ జానపదుల ఆచారమే కాదు.. మనిషి తనకు జీవం పోస్తున్న నేలకు, నీటికి, పూలకు తెలిపే కృతజ్ఞత. బతుకమ్మను అర్థం చేసుకోవాలంటే దాని చుట్టూ పేర్చిన పూలతో పాటు ఆ పూలు పూసిన నేలను, వాటిని పెంచిన వర్షాన్ని, వాటి చుట్టూ తిరిగిన తేనెటీగలను, వాటిని సేకరించిన మహిళల చేతులను, తరతరాలుగా ఆ పూలకు పేర్లు నేర్పిన పెద్దలను కూడా చూడాలి. అప్పుడే బతుకమ్మ ఒక పూల పండుగ నుంచి ప్రకృతి, మనిషి, సమాజం మధ్య ఉన్న సంబంధాలను ఆవిష్కరించే జీవన తత్వంగా కనిపిస్తుంది.
సాధారణంగా దేవుడి కోసం ఆలయాన్ని నిర్మిస్తాం. బతుకమ్మలో మాత్రం ప్రకృతిలో దొరికిన పూలే ఆలయమవుతాయి. వాటిని పేర్చే మహిళల చేతులే శిల్పుల ఉలులుగా మారుతాయి. పసుపుతో రూపొందించిన గౌరమ్మ ఆ పుష్ప సమూహానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది. ప్రకృతి అందించిన పూలతో కొలువైన ఈ రూపం కొన్ని గంటల తర్వాత తిరిగి అదే ప్రకృతిలో కలిసిపోతుంది. సృష్టి నుంచి రూపం పొందడం, కొంతకాలం మన మధ్య ఉండటం, తిరిగి ప్రకృతిలో కలిసిపోవడం.. బతుకమ్మలో కనిపించే ఈ చక్రం జీవన సహజత్వాన్ని గుర్తు చేస్తుంది.
బతుకమ్మకు సంబంధించి పలుగాథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు తెలంగాణలో తీవ్ర కరువు వచ్చి ప్రజలు దీర్ఘకాల, భయంకరమైన వ్యాధులను తట్టుకోలేక చనిపోతుంటే ప్రకృతిలోని రంగురంగుల పూలను గోపురంగా పేర్చి బతికించమని దేవతను పూజించారట. ఆ దేవతే బతుకమ్మ అని జానపదులు చెబుతారు. నాటి నుంచి మహిళలు తొమ్మిదిరోజుల పాటు ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానె బియ్యం బతుకమ్మ, అలిగిన బతుకమ్మ (అర్రెం), వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇలా రోజుకొకరీతిలో బతుకమ్మ సంబురం చేసుకుంటారు. బతుకమ్మ పేరులోని బతుకు అనే పదం ఈ పండుగకు మరింత లోతైన అర్థాన్ని ఇస్తుంది. జీవితం నిలవాలి, కుటుంబాలు సంతోషంగా ఉండాలి, పంటలు పండాలి, స్త్రీలు సౌభాగ్యంతో జీవించాలి, సమాజం సుభిక్షంగా ఉండాలి అనే ఆకాంక్షలు ఈ ఆరాధనలో మిళితమై ఉన్నాయి.
పూలను పూజా సామగ్రిగా చూడకూడదు. అవి జీవన వైవిధ్యానికి ప్రతీకలు. బతుకమ్మకు పూలను ఎంచుకోవడంలో ఒక విశేషమైన స్థానిక పరిజ్ఞానం దాగి ఉంది. తంగేడు, గునుగు, బంతి, చామంతి, గుమ్మడి వంటి పూల రకాలను వాటి రంగులు, ఆకారాలు, లభ్యత ఆధారంగా బతుకమ్మ పేర్చడానికి ఉపయోగిస్తారు. వర్షాకాలం చివరి దశలో శరదృతువు ప్రారంభంలో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో పుష్పించే మొక్కలు ప్రకృతికి కొత్త అందాన్ని ఇస్తాయి. ఏ కాలంలో ఏ పూలు దొరకుతాయో, వాటిని ఎక్కడ సేకరించాలో, ఎలా పేర్చాలో పెద్దల నుంచి చిన్నవారికి అనుభవం ద్వారా అందే జ్ఞానం ఈ పండుగలో భాగమైంది. ఒక సమాజం తన చుట్టూ ఉన్న మొక్కలను గుర్తించడం, అవి పుష్పించే కాలాన్ని తెలుసుకోవడం, వాటిని సాంస్కృతిక జీవితంలో భాగం చేసుకోవడం అనేది మనిషికి ప్రకృతితో ఉన్న సన్నిహిత సంబంధానికి నిదర్శనంగా నిలుస్తుంది.
ఒకే రకమైన పూలతో బతుకమ్మను పేర్చవచ్చు. కానీ అనేక రకాల పూలతో రూపొందిన బతుకమ్మ మరింత వైవిధ్యంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వివిధ రకాల మొక్కలు, కీటకాలు, పక్షులు, ఇతర జీవులు పరస్పరం సంబంధాలు కలిగి ఉన్నప్పుడే పర్యావరణ వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తాయి. బతుకమ్మలో ఉపయోగించే ప్రతీ పువ్వుకూ ప్రత్యేకమైన ఔషధగుణం ఉంది. పూలన్నిటినీ కలిపి సద్దుల బతుకమ్మగా నీటిలో నిమజ్జనం చేయడం వల్ల చెరువులు శుద్ధి అవుతాయి. తంగేడు వంటి మొక్కల్ని సంప్రదాయ వైద్య విధానాల్లో వివిధ అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇక బతుకమ్మలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు వేటికవే ప్రత్యేకం కాగా సద్దుల రోజు తయారుచేసే రకరకాల సద్దులు ఈ కాలంలో ఆరోగ్యానికి మేలు చేస్తాయని పెద్దలు చెబుతారు.
బతుకమ్మ పండుగ మహిళల సామూహిక జీవనసౌందర్యానికి ప్రతిబింబం. ఇంటి పనులు, వ్యవసాయ పనులు, కుటుంబ బాధ్యతల మధ్య నిత్యం హడావుడిగా ఉండే మహిళలకు ఆటవిడుపు ఈ పండుగ. అందరూ ఒకచోట చేరి సంప్రదాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా ఆనందాన్ని పంచుకునే అవకాశాన్ని బతుకమ్మ కల్పిస్తుంది. బతుకమ్మ చుట్టూ వలయాకారంలో తిరుగుతూ పాడే పాటల్లో కుటుంబ బంధాలు, ప్రకృతి అందాలు, పంటలు, పల్లెజీవనం, స్త్రీల అనుభవాలు, స్థానిక చరిత్ర, సామాజిక పరిస్థితులు ప్రతిఫలిస్తాయి. తరతరాలుగా మౌఖికంగా కొనసాగిన ఈ పాటలు తెలంగాణ జానపద సాహిత్యానికి విలువైన సంపద. పెద్దలు పాడే పాటలను చిన్నవారు నేర్చుకోవడం ద్వారా భాష, యాస, సంప్రదాయాలు ఒక తరం నుంచి మరో తరానికి చేరుతాయి. బతుకమ్మ పాట ఒక సామూహిక అనుభవం. అక్కడ ఒక్కరి గొంతుకే ప్రాధాన్యం ఉండదు, అనేక గొంతులు కలిసి పాటకు రూపాన్నిస్తాయి. ఈ సమష్టి గానం సామాజిక అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది.
‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’, ‘ఒక్కేసి పూవేసి చందమామ ఒక్కజాము ఆయే చందమామ’.. ఇలా ఎన్నో పాటలు పాడుకుంటూ కుల, ఆర్థిక అంతరాలను అధిగమించి మహిళలు సమూహాలుగా పాల్గొనే సందర్భాలు ఈ పండుగలో మాత్రమే కనిపిస్తాయి. సద్దుల రోజు సాయంత్రం వేళ ఆడబిడ్డలంతా చెరువుల ఒడ్డుకు చేరి లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలతో ఆడిపాడుతారు. ఆ తర్వాత బతుకమ్మలను నిమజ్జనం చేసి ఒకరినొకరు పసుపుకుంకుమలతో పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మా అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. సామాజిక కోణంలో బతుకమ్మ సమానత్వాన్ని, ఐక్యతను చాటి చెబుతుంది.
ప్రకృతిని మనిషి తన చేతులతో పేర్చుకున్న రూపం బతుకమ్మ . ఆ రూపంలో పూలు ఉంటాయి, భక్తి ఉంటుంది, ఆటాపాటా ఉంటాయి, సమాజం ఉంటుంది, అన్నిటికన్నా ముఖ్యంగా మనిషి జీవితం ప్రకృతితోనే ముడిపడి ఉందనే గుర్తింపు ఉంటుంది. పూలను దేవతగా భావించే విశ్వాసం ఒకవైపు, పూలు పూసే ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యతను మరోవైపు .. ఈ రెండిటినీ కలిపే వంతెనగా బతుకమ్మ నిలుస్తుంది. ఇది గతం నుంచి వచ్చిన సంప్రదాయం మాత్రమే కాదు.. భవిష్యత్తును మరింత పచ్చగా, జీవవైవిధ్యంతో నిండుగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సాంస్కృతిక స్ఫూర్తి కూడా! పూలను పూజించడం బతుకమ్మ ఆరాధన అయితే, పూలనిచ్చే ప్రకృతిని కాపాడటం ఈ పండుగ ఇచ్చే సందేశం. తరాలు మారినా, ఎన్ని ఆచారాలు వచ్చిపోయినా, విదేశీ ఒరవడులు కలిసిపోయినా మన సంప్రదాయాలను తరతరాలుగా బతికిస్తున్న తెలంగాణ ఆడబిడ్డల మురిపాల వేడుక బతుకమ్మ.
రంగనాథ్ మిద్దెల…?
9866573461
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

