తీసిన వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ నచ్చడం లేదా? ఆ వీడియోలో ఏదో ఒక వస్తువును చేర్చాలని అనుకుంటున్నారా?.. ఇంతకుముందైతే దీనికోసం గంటలకొద్దీ ఎడిటింగ్ చేయాల్సి వచ్చేది. కానీ, ఇకపై ఆ అవసరం లేదు! యూట్యూబ్ తన ప్లాట్ఫామ్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎంతలా జొప్పించిందంటే.. కేవలం ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, మీ వీడియో రూపురేఖలే మారిపోతాయి. కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ తీసుకొచ్చిన ఆ పవర్ఫుల్ ఏఐ అప్డేట్స్ ఏంటో చూద్దాం.
యూట్యూబ్ షార్ట్స్ కోసం ‘రీ ఇమాజిన్’ అనే అద్భుతమైన ఏఐ టూల్‌ను ప్రస్తుతం పరీక్షిస్తున్నది.
ఒక్క ఫ్రేమ్ చాలు: మీరు చేస్తున్న ఏదైనా షార్ట్ వీడియోలోని ఒక్క ఫ్రేమ్‌ను తీసుకుని, దాన్ని మీ ఊహకు తగ్గట్టుగా మార్చేయవచ్చు. ఉదాహరణకు.. ఒక సాధారణ వీధిని రోమ్ మహానగరంలోని వీధుల్లానో, మంచుతో కప్పేసిన వీధిగానో మార్చేయమని ఏఐని అడగవచ్చు.
వస్తువులు వచ్చేస్తాయి: వీడియోలో లేని వస్తువులను కూడా ఏఐ సాయంతో చేర్చవచ్చు. ‘ఈ సీన్లో ఒక ఏనుగు ఉండాలి’ అని టైప్ చేస్తే చాలు.. అక్కడ ఏనుగు ప్రత్యక్షమవుతుంది!
ఏఐ ఇన్-సైట్స్: మీ చానెల్ సబ్‌స్ర్కైబర్లు ఏం చూడాలనుకుంటున్నారో ఏఐ విశ్లేషించి మీకు చెబుతుంది. దానికి తగ్గట్టుగా వీడియో స్క్రిప్ట్ ఐడియాలు, అవుట్ లైన్లను కూడా క్షణాల్లో అందిస్తుంది.
డ్రీమ్ స్క్రీన్: షార్ట్స్ క్రియేటర్లకు ఇది ఒక వరమే! మీరు జస్ట్ ఒక టెక్ట్స్ ప్రాంప్ట్ ఇస్తే చాలు.. ఏఐ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ వీడియోలు, ఇమేజ్‌లను క్రియేట్ చేస్తుంది. మీరు ఎక్కడికీ వెళ్లనక్కర్లేదు, గ్రీన్ మ్యాట్ కూడా అవసరం లేదు.
మీరు ఏ భాషలో వీడియో తీసినా.. అది ప్రపంచం నలుమూలల ఉన్నవారికీ వారి మాతృభాషలోనే వినిపించేలా ‘ఆటో-డబ్బింగ్’ ఫీచర్‌ను యూట్యూబ్ భారీగా విస్తరించేలా ప్లాన్ చేస్తున్నది.
27 భాషల్లో డబ్బింగ్: ప్రస్తుతం ఈ ఫీచర్ 27 భాషలకు సపోర్ట్ చేస్తున్నది. ఇందులో ‘ఎక్స్‌ప్రెసివ్ స్పీచ్’ అనే ఫీచర్ ద్వారా డబ్బింగ్ వాయిస్ కూడా రోబోలా కాకుండా, క్రియేటర్ అసలు గొంతులో ఉండే ఎమోషన్ని పలికిస్తుంది.
లిప్ సింక్: అద్భుతమైన విషయం ఏంటంటే.. మాట్లాడే భాష మారినా, ఆడియోకు తగ్గట్టుగా వీడియోలోని వ్యక్తి పెదవుల కదలికలను కూడా ఏఐ మార్చేస్తుంది. సంగీతం కూడా మీ ఇష్టమే! షార్ట్స్ క్రియేటర్ల కోసం ‘డ్రీమ్ ట్రాక్’ అనే మరో ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
టెక్ట్స్ టూ మ్యూజిక్: మీకు ఎలాంటి మ్యూజిక్ కావాలో కేవలం 50 అక్షరాల్లో వివరిస్తే చాలు.. యూట్యూబ్ ఏఐ మీ కోసం ఒక సరికొత్త బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను కంపోజ్ చేసి ఇచ్చేస్తుంది. దీనివల్ల కాపీరైట్ గొడవలు ఉండవు. ఒక్కమాటలో చెప్పాలంటే.. మీ ఆలోచనలకు ఏఐ పదును పెడుతుంది. కంటెంట్ క్రియేషన్‌ను ఒక ఆటలా మార్చేస్తుంది! ఇకపై క్రియేటర్లు కేవలం ఐడియాల మీద ఫోకస్ చేస్తే చాలు.. ఎడిటింగ్, డబ్బింగ్ వంటి కష్టమైన పనులన్నీ ఏఐ చూసుకుంటుంది. టెక్నాలజీ పెరుగుతున్న వేగాన్ని బట్టి చూస్తే, రాబోయే రోజుల్లో ఒక సామాన్యుడు కూడా హాలీవుడ్ స్థాయి వీడియోలను తన ఫోన్లోనే క్రియేట్ చేసేయవచ్చు. మరి ఈ సరికొత్త ఏఐ ఫీచర్లను మీరూ ట్రై చేసేయండి!