ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. రోజంతా కూలర్లు, ఏసీలు వాడాల్సి వస్తున్నది. ఫలితంగా, విద్యుత్ బిల్లు తడిసి మోపెడవుతున్నది. అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఇల్లు సహజంగానే చల్లబడుతుంది. దీనివల్ల విద్యుత్ ఆదా అవ్వడంతోపాటు పర్యావరణానికీ మేలు కలుగుతుంది.
సూర్యోదయం, సూర్యాస్తమయంలో బయట గాలి చల్లగా ఉంటుంది. ఈ సమయంలో ఇంటికి ఎదురెదురుగా ఉన్న కిటికీలు, తలుపులను తెరవాలి. దీనివల్ల వేడి గాలి బయటికి వెళ్లి, చల్లని గాలి లోపలికి ప్రవేశిస్తుంది. దాంతో, ఇల్లంతా చల్లబడుతుంది. మధ్యాహ్నం వేళల్లో కిటికీలను మూసి ఉంచాలి. ఇంట్లో పెరిగే ఇండోర్ ప్లాంట్స్.. గాలిలోని తేమను పెంచి, సహజంగానే ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. స్నేక్ ప్లాంట్, అలోవెరా, మనీ ప్లాంట్, అరెకా పామ్.. ఇలాంటి మొక్కలను కిటికీల దగ్గర, గది మూలల్లో ఉంచాలి. ఫలితంగా, గాలి శుభ్రపడటమే కాకుండా ఇల్లు కూడా చల్లగా ఉంటుంది.
ప్లాస్టిక్, సింథటిక్ కర్టెన్లు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. కాబట్టి, జనపనార, వెదురు, కాటన్ కర్టెన్లు వాడటం మంచిది. ఇవి సూర్యరశ్మితోపాటు వేడిని కూడా ఇంట్లోకి రాకుండా సమర్థంగా అడ్డుకుంటాయి. ముఖ్యంగా కిటికీలకు ఖాదీ, తెల్లటి కాటన్ వస్ర్తాలను కడితే.. అవి వేడిని పరావర్తనం చేస్తాయి. ఎలక్ట్రిక్ బల్బులు కూడా కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి, పగటిపూట అవసరం లేని గదుల్లో లైట్లు ఆపేయాలి. ఇంటి డాబాపైన తెల్లటి సున్నం, రిఫ్లెక్టివ్ పెయింట్ వేయించాలి. ఇది సూర్యరశ్మిని స్లాబ్ గ్రహించకుండా వెనక్కి పంపుతుంది. ఇంటి లోపలి ఉష్ణోగ్రతను రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గిస్తుంది.