కళ బతికుండాలనే.. నా సంచారం!
సెల్ఫోన్లు, సినిమాల మోజులో పల్లె కళల ప్రభ తగ్గింది. ఇలాంటి రోజుల్లో వారసత్వాన్ని భూజానేసుకొని ఊరూరూ తిరుగుతూ సంప్రదాయ కళకు జీవం పోస్తున్నది ఓ పెద్దావిడ. పెద్దగా చదువుకోకపోయినా భర్త నుంచి వచ్చిన ఆ కళను తన పిల్లలకు కూడా పరిచయం చేసింది 70 ఏండ్ల తూర్పాటి సాలమ్మ.
సెల్ఫోన్లు, సినిమాల మోజులో పల్లె కళల ప్రభ తగ్గింది. ఇలాంటి రోజుల్లో వారసత్వాన్ని భూజానేసుకొని ఊరూరూ తిరుగుతూ సంప్రదాయ కళకు జీవం పోస్తున్నది ఓ పెద్దావిడ. పెద్దగా చదువుకోకపోయినా భర్త నుంచి వచ్చిన ఆ కళను తన పిల్లలకు కూడా పరిచయం చేసింది 70 ఏండ్ల తూర్పాటి సాలమ్మ. యాభై ఏండ్లుగా మందహెచ్చుల కళకు సాలమ్మ చేసిన కృషిని గుర్తించిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఈ ఏడాది ఆమెను ప్రతిభా పురస్కారంతో సత్కరించింది. ఈ కళను అంతరించిపోకుండా రేపటి తరాలకు పంచుతానంటున్న సాలమ్మ జిందగీతో ముచ్చటించింది.. ఆ విశేషాలు తన మాటల్లోనే..
ఇరవై ఏండ్లకే భర్తను కోల్పోయి రోడ్డున పడిన నాకు ఈ కళనే జీవనాధారమైంది. నా కుటుంబానికి నాలుగు మెతుకులు పెట్టింది. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని కట్టుగూడెం గ్రామం. మా నాన్న అప్పట్లోనే అటెండర్‌గా పనిచేశాడు. మేము మొత్తం నలుగురం అక్కాచెల్లెళ్లం, ఒక అన్న. పెద్దబాలశిక్ష వరకు చదువుకున్న నాకు పదేండ్లకే పెళ్లి చేసి అత్తగారింటికి పంపించారు. మా మామ మంద హెచ్చు కళాకారుడు. ఆయనను చూసి నా భర్త నేర్చుకున్నాడు. పెండ్లి తర్వాత నా భర్తతో కలిసి గ్రామాలు తిరుగుతూ నేను కూడా కథాగానం చేసేదాన్ని. అలా నాకు ఈ కళ పరిచయమైంది. పేరుకే గొప్ప కళ, ఆదాయం మాత్రం సున్నా. పదో పరకో ఇస్తారని ఆశపడి యాచిస్తే కడుపునిండా తిండిపెట్టి పంపేవాళ్లు. మాకు కొడుకు పుట్టిన ఏడాదిన్నరకు మా ఆయన కాలం చేసిండు. అంతగొప్ప కళాకారుడు సచ్చిపోతే ఆయన కార్యం చేయడానికి కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండే.

వాళ్లిద్దరూ తోడయ్యారు
ఆయన పోయాక అత్తగారింట్లో ఉండలేక కొడుకును తీసుకొని పుట్టింటికి వచ్చేశాను. నా బిడ్డను పోషించుకునేందుకు దొరికిన పనల్లా చేసినా. పంట పొలాల్లో పనిచేసుకుంటా నేర్చుకున్న పాటలు పాడేదాన్ని. నా కళను చాలామంది మెచ్చుకునేది. ఆ కళను సంపుకోవడం ఇష్టం లేక కొడుకును సంకలేసుకొని గ్రామాలకు వెళ్లి ఈ వృత్తిని కొనసాగించాను. నా కొడుకు కూడా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు నాతోపాటు పాడేందుకు వచ్చేటోడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకుని నాతో పాటే ఈ వృత్తిలోనే కొనసాగుతున్నాడు. పెండ్లి తర్వాత నా కోడలు కూడా జతకట్టింది. ప్రధానంగా జానపద కళారూపాల్లో ఆడవాళ్లు ప్రధాన కథకులుగా ఉండటం అరుదు. మగవారు ప్రధాన కథకులుగా ఉంటే మహిళలు మాత్రం కోరస్ ఇస్తుంటారు. కానీ, నేను మాత్రం గత 50 ఏండ్ల నుంచి తాళాలు కొడుతూ ప్రధాన పాత్రలో కథాగానం చేస్తున్నాను. యేటా దసరా నుంచి మొదలు మే నెల వరకు ఇల్లు విడిచి సంచార జీవితాన్ని గడుపుతాం. వర్షాకాలంలో మాత్రం ఇంటిపట్టున ఉంటూ దొరికిన పనల్లా చేసుకొని జీవిస్తాం.
నేను ప్రత్యేకం
యాదవుల వద్ద యాచించడం మా ఆచారం. ఒక ఊరికి వెళ్లినప్పుడు ఆ గ్రామంలో ఉండే పెద్ద గొల్లను ఇంటికి వెళ్లి కలుస్తాం. మేము వచ్చిన సంగతి యాదవ కులస్తులందరితో ఓ సమావేశం నిర్వహించి చెబుతాడు. మాకు ఇవ్వాల్సిన త్యాగం గురించి వాళ్లు చర్చిస్తారు. ప్రతి గ్రామంలో సుమారు 20 రోజులపాటు ఉంటాం. ఉన్నన్ని రోజులు భారతం, శ్రీకృష్ణుని లీలలు, యాదవ చరిత్ర, వలరాజు, ఎర్రన్న, పాపమ్మ కథలు చెబుతాం. కాటమరాజుల కథల పాత్రలను పటం మీద వేయించి కథాగానం చేయడం మా ప్రత్యేకత. మా వాయిద్యాలైన జెగ్గు (ఢమరుకం), కొమ్ము, తాళాలతో కథాగానం సాగుతుంది. కథ ప్రారంభ సూచికగా కొమ్ము శబ్దం వినిపిస్తాం. వీక్షకులు అందరూ వచ్చాక ప్రధాన కథకుడు జెగ్గు పట్టుకొని కథ చెబుతుండగా తాళాలు కొడుతూ కోరస్ పాడేవాళ్లు అనుసరిస్తారు. అయితే నాకు మాత్రం తాళాలు కొడుతూ కథాగానం చేయడం ఎప్పటినుంచో అలవాటైంది. నా కొడుకు జెగ్గు ఊపుతూ ఉంటాడు. ఏడాదికి నాలుగైదు గ్రామాల్లో సంచరిస్తాం. ఒకసారి కథాగానం చేసిన ఊరిలో తిరిగి మూడేండ్ల వరకు అడుగుపెట్టం. అది మా అనవాయితీ.
రుణపడి ఉంటా
నాకు అస్తులేమైనా ఉన్నాయంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 36 గ్రామాలే నా అస్తిపాస్తులు. ఆ గ్రామాల్లోనే నేను మందహెచ్చుల కళారూపాన్ని ప్రదర్శిస్తుంటాను. 50 ఏండ్లుగా కథాగానం చేస్తున్నాను. అయినా బయటి ప్రపంచానికి నేనెవరో తెలియదు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అందించిన ప్రతిభా పురస్కారమే నా కళకు గుర్తింపును తెచ్చిపెట్టింది. నాలాంటి మట్టి పరిమళాలను పరిచయం చేసిన జానపద గిరిజన విజ్ఞాన పీఠం వెంకన్న సార్‌కు రుణపడి ఉంటాను. ఈ పురస్కారం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా తీసుకోవడం మరింత సంతోషంగా ఉంది. ఒకప్పుడు పంటలు లేక, జీవాల పోషణ లేక మాకు త్యాగం ఇచ్చేందుకు వెనకాడిన రోజులున్నాయి. ఇప్పుడు వాళ్ల జీవితాలు మెరుగయ్యాయి. గ్రామంలోకి వెళ్లగానే సంతోషంగా త్యాగమిచ్చి గౌరవిస్తున్నారు. నా తర్వాత ఈ కళను కొనసాగించేందుకు నా కొడుకు కోడలు సిద్ధంగా ఉన్నారు. వారి తర్వాత నా చిన్న మనుమడు ముందుకు తీసుకువెళ్తాడనే నమ్మకం బలంగా ఉంది.
-రాజు పిల్లనగోయిన
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

