బచ్చన్నపేట. సెప్టెంబర్ 24 : కలిసి చదువుకున్న రోజులు.. కలిసి నవ్వుకున్న జ్ఞాపకాలు.. బాల్యంలో పెనవేసుకున్న ఆత్మీయ బంధం.. కాలం గడిచినా ఆ స్నేహం మాత్రం చెక్కు చెదరలేదు. తమతో కలిసి 10వ తరగతి వరకు విద్యనభ్యసించిన బాల్య మిత్రురాలు బి. శారద అమ్మ మృతి వార్తతో తోటి మిత్రులు తీవ్ర విషాదానికి గురయ్యారు. శారద కుటుంబం విషాదంలో ఉందని తెలుసుకున్న ఎస్ఎస్సీ బ్యాచ్ బాల్య మిత్రులు జనగామ జిల్లా కట్కూరు గ్రామంలోని ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఈ కష్ట సమయంలో తాము అండగా ఉన్నామంటూ భరోసా కల్పించారు.
తమ బాల్య స్నేహానికి గుర్తుగా..మిత్రురాలి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఎస్ఎస్సీ బ్యాచ్ తరపున రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆర్థిక సహాయం కంటే ఈ సమయంలో తమ మిత్రురాలి కుటుంబం పక్కన నిలవడం ముఖ్యమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాడ పోచయ్య ముసిని వెంకటేష్, ముసిని సాయిబాబా, ఎనుగుల నరేందర్, ఎం.డి. అన్వర్ పాల్గొని శారద కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాల్యంలో మొదలైన స్నేహం.. జీవిత ప్రయాణంలో ఎన్నో ఏళ్లు గడిచినా చెదరలేదు. మిత్రురాలు దూరమైనా ఆమె జ్ఞాపకాలు తమ హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని ఎస్ఎస్సీ బ్యాచ్ మిత్రులు భావోద్వేగానికి లోనయ్యారు.