హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 5 : వరంగల్ నిట్లో స్ప్రింగ్ స్ప్రీ-2024 వేడుకలు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ సాంస్కృతిక మహోత్సవం విద్యార్థుల్లో హుషారు నింపింది. ఈ నెల 7 వరకు కొనసాగనుండగా దేశ నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులతో క్యాంపస్ సందడిగా మారింది. విద్యార్థులు పోటీపడి ప్రదర్శించిన ఈవెంట్ల్లు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచాయి. ఈ వేడుకలను నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అంబేదర్ లెర్నింగ్ సెంటర్లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ ఏకతాటిపైకి తీసుకొచ్చినందుకు మొత్తం బృందాన్ని అభినందించారు. విద్యార్థులకు సంపూర్ణ అభ్యాసం అవసరమని, ఇలాంటి ఈవెంట్లు వారి అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ డీ శ్రీనివాసాచార్య మాట్లాడుతూ 40కి పైగా ఈవెంట్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ప్రెసిడెంట్ హరికృష్ణ, కల్చరల్ వైస్ ప్రెసిడెంట్ సతీశ్ బెన్, సాహిత్, తనీశ్, ప్రశాంత్, చందర్ కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు.
తాడూరి రేణుక, శిష్యులు కూచిపూడి నాట్యం ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ క్లబ్ నిర్వహించింది. సాయంత్రం 4గంటల తర్వాత అన్సాల్వ్, నుకడ్ నాటక్, నిట్ గాట్ టాలెంట్, ఫిల్మ్ ట్రెజర్ హంట్, ఫిల్మ్ క్విజ్, కొరియో నైట్, ఫుడ్ హంట్ ఈవెంట్లు పోటాపోటీగా సాగాయి. హరిచరణ్ మ్యూజికల్ నైట్ షో విద్యార్థుల్లో ఫుల్ జోష్ నింపింది. ప్రోషోలో భాగంగా ప్రముఖ గాయకుల పాటలకు విద్యార్థులు ఉర్రూతలూగారు.