మాది డూప్లెక్స్ ఇల్లు. తూర్పు-పడమర బాల్కనీలు ఇంటిలోపలికి కలపవచ్చా? – బి.వసుంధర, భద్రాచలం
డూప్లెక్స్ ఇల్లు కట్టేవారు ప్రధానంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. కింద ఎంత వైశాల్యంతో ఇల్లు కడుతున్నామో.. అంతే వైశాల్యంలో పైన కూడా కట్టాలి. ముందు, వెనుక స్థలం ఉంది, అది వృథా పోతుందని మాత్రం కలపొద్దు. ఇంటి రూపం మారుతుంది. సాధారణ గృహాలు కట్టేటప్పుడు.. అంటే బయట మెట్లు పెట్టి రెండు మూడు అంతస్తులు కట్టినవారు, వారి అవసరం నిమిత్తం పడమర బాల్కనీ లేదా దక్షిణం బాల్కనీని ఇంటి లోపలికి కలుపుకొనే అవకాశం ఉంది. కానీ, డూప్లెక్స్ ఇంటివారు పడమర, దక్షిణాలు కూడా కలుపుకోవద్దు. కలుపుకున్నట్లయితే లోపల మెట్లు వస్తాయి. వాడకం లోపలి నుంచే ఉంటుంది. కాబట్టి, గృహ కొలతలో మార్పులు వస్తాయి. గృహం ‘అంతరం’ అంతా దోషపూరితం అవుతుంది. అలాంటి పని చేయకండి.
మాకు ఇల్లు, దుకాణం దూరంగా ఉన్నాయి. రెండింటిలో దేనిని ముందుగా వాస్తుకు సరిచేసుకోవాలి?
– చేగు పద్మ, భరత్‌నగర్
ఏదైనా నిర్మాణాన్ని మనం వాడుతున్నాం అంటే.. అది బాగుండాలి. మీరు ఇంట్లో ఉంటారు. దుకాణంలో వ్యాపారం చేస్తారు. వాస్తవానికి రెండూ బాగా ఉండాలి కదా! దుకాణం ముందు పెట్టారా? ఇల్లు తీసుకున్నాక పెట్టారా? అన్నది తెలియదు. దోషాలు ఉన్న ఇంట్లోంచి కొన్నట్లయితే దుకాణం కూడా దోషాలు ఉన్నదే దొరుకుతుంది. ముందుగా ఇంట్లో దోషాలను నిర్ధారణ చేసుకొని, సంపూర్ణంగా బాగు చేయండి. తరువాత దుకాణాన్ని సరి చేసుకోండి. ఇల్లా, దుకాణమా.. అన్నప్పుడు ఇల్లే ప్రధానం. గృహంలో ‘శాంతి’ ఉంటేనే మనం బయటి పనులు చక్కపెట్టగలం. ఇంట్లో సరిచేసి, దుకాణాన్ని సరిదిద్దుకోండి. ‘ఇల్లు బాగు చేశాం కదా, దుకాణానిది ఏముంది’ అని వదిలివేయకండి.
మేము ఉంటున్న ఇల్లు పాతది. దోషాలు ఉన్నాయని అంటున్నారు. కొత్త స్థలంలో కట్టుకోవచ్చా? ఉన్న ఇల్లు కూడా బాగు చేయాలా?
– మోదుగు ఉప్పలయ్య, కార్వాన్
పాత ఇల్లు సొంతమే అయినప్పుడు, దానిని బాగు చేయలేక కొత్త ఇల్లు కట్టాలి అంటే.. అందులోనే ఉండి కట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు దోషాల ఇంట్లో ఉండి మంచి ఇల్లు కట్టడం చాలా కష్టం అవుతుంది. కొత్త ఇల్లు చక్కగా పూర్తి చేయాలి కదా! ముందుగా పాత ఇంటిని వదిలి అద్దె ఇంటికి మారిపోండి. ఆ కిరాయి ఇల్లు కూడా వాస్తుకు ఉన్నదానినే ఎంచుకోండి. అందులో ఉండి కొత్త ఇల్లు కట్టండి. రెండు ఇండ్లు అవసరం అనుకున్నప్పుడు పాత ఇంటిని ముందు బాగు చేసి, కొత్త ఇల్లు ప్రారంభం చేయండి. అలా సునాయాసంగా మీరు మంచి గృహాలను సొంతం చేసుకొంటారు.
మెట్లు ‘వాయవ్యం’లో ఉన్నాయి. దాని కింద కిచెన్ కట్టారు. ఆ దిశకు ఉండొచ్చా? – సావిత్రి, కొత్తగూడెం
మన ఇంట్లో వంటగది ముఖ్యమైన భాగం. దానిని ఎక్కడో అక్కడ ఇరికించి కడితే ఎలా? ఆగ్నేయంలో లేదా వాయవ్యంలో కిచెన్ ఉండవచ్చు అనడంలో, ‘మెట్ల కింద కూడా’ అని అర్థం కాదు కదా! వంటగది మరీ అంత ఇరుకుగా పెట్టకుండా, దానిని తొలగించండి. బదులుగా ఇప్పుడు ఉన్న ఇంటి భాగంలోనే వాయవ్యం గదిలో వంటగది ఏర్పాటు చేసుకోండి. ఇంటి పరిధిదాటి బయటి స్థలం వాడుకోవడం అనేది.. ఇంటికి పెద్ద దోషాన్ని కలిగించడమే. అది వంటగది, స్నానాలగది.. ఏదైనా కావచ్చు. బయటికి ఇతరత్రా గదులు ఏవైనా సరే పడమర సందును, దక్షిణం సందును వాడుకోవడం మంచిది కాదు.
మాకు తూర్పు, దక్షిణం రోడ్డు ఉంది. తూర్పు రోడ్డు ఎత్తుకు ఉంది. ఇల్లు కట్టొచ్చా? ఎలా కట్టాలి? – యాదగిరి, రామారం, గుండాల
తూర్పు ఎత్తు రోడ్డు ఉన్నప్పుడు తూర్పు ప్రభావం తప్పక ఇంటిపైన ఉంటుంది. పైగా మీది ఆగ్నేయ బ్లాకు. ఆ స్థలాన్ని ఇంటి కోసం కాకుండా దవాఖాన లేదా డయాగ్నొస్టిక్ సెంటర్ తదితర కేంద్రాలకు ఉపయోగించండి. అంటే వ్యాపారపరంగా దానిని వాడటం మంచిది. దక్షిణంలో రోడ్డు కిందికి ఉంది కాబట్టి, దక్షిణం రోడ్డు లెవల్ నుంచి ‘కారు పార్కింగ్’ చేసుకొని, తూర్పు రోడ్డు నుంచి గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌తో సపరేట్గా కింది భాగాన్ని కలపకుండా నిర్మాణం చేసి, వ్యాపారాలకు అద్దెకివ్వండి. మంచి ఫలితాలు ఇస్తుంది. అంతేకానీ, గృహానికి మంచిది కాదు. స్థలం దాని స్వరూప స్వభావాలను తెలుసుకొని, నిర్మాణాలు చేయాలి. అప్పుడే మనకు మంచి జరుగుతుంది.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.