బడిలో పాఠాలు వింటూ, తోటి పిల్లలతో ఆడుతూపాడుతూ ఉండే బెర్నార్డో జీవితం బ్లడ్ క్యాన్సర్ రావడంతో ఒక్కసారిగా మారిపోయింది. స్కూల్‌కి వెళ్లాల్సిన వయసులో చికిత్స కోసం దవాఖానల చుట్టూ తిరిగాడు. ఈమధ్యే క్యాన్సర్ నుంచి కోలుకున్నాడు బెర్నార్డో. ఈమధ్యే తల్లిదండ్రులతో కలిసి స్కూల్‌కి వెళ్లాడు. స్కూల్లో అడుగుపెట్టిన అతడికి ఊహించని విధంగా స్వాగతం లభించింది. దాంతో, బెర్నార్డోతో పాటు అతని తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు.
ఏడాది పాటు కీమో
బెర్నార్డోకి 2021 ఆగష్టులో ల్యూకేమియా అనే క్యాన్సర్ వచ్చింది. ఏడాది పాటు కీమోథెరపీ తీసుకున్నాడు. క్యాన్సర్ నుంచి కోలుకున్నవెంటనే స్కూల్లోకి వెళ్లాడు. అతను స్కూల్ గేటు దాటగానే తోటి విద్యార్థులు దారికి ఇరువైపులా నిల్చొని చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. అంతేకాదు టీచర్లు అతడిని ప్రేమగా కౌగిలించుకున్నారు కూడా. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో అందర్నీ కదిలిస్తోంది. బెర్నార్డో వీడియో చూసినవాళ్లు ‘బెర్నార్డో నువ్వొక ఫైటర్. అందుకే నువ్వు క్యాన్సర్ మీద విజయం సాధించావు’ అని కామెంట్లు చేస్తున్నారు.